కంటెంట్‌కు వెళ్లు

చనిపోబోయే ముందు ఎదురైన అనుభవాలు—వాటి అర్థం ఏమిటి?

చనిపోబోయే ముందు ఎదురైన అనుభవాలు—వాటి అర్థం ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 చాలామంది ప్రజలు తాము ఇక చనిపోతామని అనుకున్న చివరి క్షణాల్లో, తమ శరీరం నుండి తాము వేరైపోతున్నట్టు లేదా ప్రకాశవంతమైన వెలుగును చూసినట్టు, లేదా చాలా అందంగా ఉన్న ఓ ప్రదేశానికి వెళ్లినట్టు అనిపించిందని చెప్తారు. ‘అలా వేరే లోకాన్ని చూసిరావడం ఓ గొప్ప భాగ్యమని కొంతమంది భావిస్తారు’ అని రికలెక్షన్స్‌ ఆఫ్‌ డెత్‌ అనే పుస్తకం చెప్తుంది. అలాంటి అనుభవాల గురించి బైబిలు ప్రస్తావించట్లేదు కానీ, అవి మరణం తర్వాతి జీవితానికి సంబంధించిన దర్శనాలు కావనే నిజాన్ని బైబిలు చెప్తుంది.

 చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.

‘చనిపోయినవాళ్లు ఏమీ ఎరుగరు’ అని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 9:5) చనిపోయినప్పుడు మనం వేరే లోకానికి వెళ్లంగానీ, అసలు ఉనికిలోనే లేకుండా పోతాం. చనిపోయిన తర్వాత, ఆత్మ మన శరీరం నుండి వేరైపోయి అమర్త్యంగా జీవిస్తుందని బైబిలు బోధించట్లేదు. (యెహెజ్కేలు 18:4) కాబట్టి, చనిపోబోయే ముందు ఎదురైన అనుభవాలు పరలోకానికో, నరకానికో లేదా మరణం తర్వాతి జీవితానికో సంబంధించిన దృశ్యాలు కాదు.

 మరణం తర్వాతి జీవితం గురించి లాజరు ఏమి చెప్పాడు?

చనిపోయిన తర్వాత నిజంగా ఏమి జరుగుతుందో బైబిల్లోని లాజరు వృత్తాంతం వివరిస్తుంది. చనిపోయిన నాలుగు రోజుల తర్వాత, యేసు లాజరును తిరిగి బ్రతికించాడు. (యోహాను 11:38-44) ఒకవేళ, లాజరు చనిపోయి వేరే లోకంలో సంతోషంగా జీవిస్తూ ఉండివుంటే, యేసు ఆయన్ని బ్రతికించి మళ్లీ భూమ్మీదకు తీసుకురావడం క్రూరత్వమే అయ్యుండేది. కానీ, మరణం తర్వాతి జీవితం గురించి లాజరు మాట్లాడినట్లు బైబిలు ఎక్కడా చెప్పడంలేదు. ఒకవేళ, చనిపోయిన తర్వాత ఆయన వేరే లోకానికి వెళ్లివుంటే దానిగురించి ఆయన ఖచ్చితంగా చెప్పివుండేవాడు. పైగా, యేసు లాజరు మరణాన్ని నిద్రతో పోల్చాడు. అంటే చనిపోయినప్పుడు లాజరు ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడని ఆయన ఉద్దేశం.—యెహాను 11:11-14.