కంటెంట్‌కు వెళ్లు

“చివరి రోజులు” లేదా “అంత్యదినముల” సూచన ఏమిటి?

“చివరి రోజులు” లేదా “అంత్యదినముల” సూచన ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 “ఈ వ్యవస్థ ముగింపు” లేదా “యుగసమాప్తి” అనే కాలాన్ని గుర్తించే సంఘటనలు, పరిస్థితులు, వైఖరుల గురించి బైబిలు ముందే చెప్తుంది. (మత్తయి 24:3; పరిశుద్ధ గ్రంథము) ఆ కాలాన్నే బైబిలు “చివరి రోజులు,” “అంత్యకాలం” లేదా “అంత్యదినములు” అని పిలుస్తుంది.—2 తిమోతి 3:1; దానియేలు 8:19; పరిశుద్ధ గ్రంథము.

“చివరి రోజుల” గురించిన కొన్ని బైబిలు ప్రవచనాలు ఏంటి?

 ఒకే కాలంలో చాలా విషయాలు జరుగుతాయని, అవన్నీ కలిసి చివరి రోజుల్ని గుర్తుపట్టడానికి ఒక “సూచనగా” ఉంటాయని బైబిలు చెప్పింది. (లూకా 21:7) కొన్ని ఉదాహరణలు పరిశీలించండి:

 ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు. యేసు ఇలా చెప్పాడు: “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి.” (మత్తయి 24:7) అలాగే, “భూమ్మీద శాంతి లేకుండా చేసే” యుద్ధాల్ని సూచించే గుర్రపురౌతు గురించి ప్రకటన 6:4 చెప్పింది.

 కరువులు. యేసు ఇలా చెప్పాడు: “ఆహారకొరతలు ... వస్తాయి.” (మత్తయి 24:7) ప్రకటన గ్రంథం ఇంకో గుర్రపురౌతు గురించి కూడా చెప్పింది, అతను స్వారీ చేయడం వల్ల చాలా చోట్ల కరువులు వస్తాయి.—ప్రకటన 6:5, 6.

 పెద్దపెద్ద భూకంపాలు. “ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ... భూకంపాలు వస్తాయి” అని యేసు చెప్పాడు. (మత్తయి 24:7; లూకా 21:11) ప్రపంచమంతటా వచ్చే ఈ పెద్దపెద్ద భూకంపాలు ముందెన్నడూ లేనంత బాధను, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి.

 వ్యాధులు. “పెద్దపెద్ద అంటు​వ్యాధులు” లేదా తెగుళ్లు వస్తాయని యేసు చెప్పాడు.—లూకా 21:11.

 నేరాలు. వందల సంవత్సరాల నుండి నేరాలు జరుగుతున్నా, చివరి రోజుల్లో ‘చెడుతనం పెరిగిపోతుందని’ యేసు చెప్పాడు.—మత్తయి 24:12.

 భూమి నాశనమవ్వడం. మనుషులు “భూమిని నాశనం చేస్తూ” ఉంటారని ప్రకటన 11:18 ముందే చెప్పింది. దౌర్జన్యానికి, అవినీతికి పాల్పడడంతో పాటు పర్యావరణాన్ని కూడా పాడుచేస్తూ వాళ్లు ఎన్నో విధాల్లో భూమిని నాశనం చేస్తారు.

 దిగజారే వైఖరులు. “కృతజ్ఞత లేనివాళ్లు, విశ్వసనీయంగా ఉండనివాళ్లు, ... మొండివాళ్లు, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు, నమ్మకద్రోహులు, మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు” ఎక్కువమంది ఉంటారని 2 తిమోతి 3:1-4 వచనాలు చెప్తున్నాయి. ఈ వైఖరులు ఎంత స్పష్టంగా కనిపిస్తాయంటే, ఆ కాలాన్ని “ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు” అని పిలవవచ్చు.

 కుటుంబ బంధాలు బలహీనపడతాయి. కుటుంబ సభ్యుల మీద “మమ​కారం లేనివాళ్లు” చాలామంది ఉంటారని, పిల్లలు ‘తల్లిదండ్రులకు లోబడరని’ 2 తిమోతి 3:2, 3⁠లో బైబిలు చెప్పింది.

 దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది. యేసు ఇలా చెప్పాడు: “ఎక్కువమంది ప్రేమ చల్లారిపోతుంది.” (మత్తయి 24:12) అంటే, ఎక్కువమంది ప్రజల్లో దేవుని మీద ప్రేమ తగ్గిపోతుందని యేసు ఉద్దేశం. చివరి రోజుల్లో అలాంటివాళ్లు “దేవుణ్ణి కాకుండా సుఖాల్ని” ప్రేమిస్తారని 2 తిమోతి 3:4 చెప్తుంది.

 మత వేషధారణ. ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కనిపిస్తారు కానీ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించరని 2 తిమోతి 3:5⁠లో బైబిలు చెప్పింది.

 బైబిలు ప్రవచనాల గురించిన అవగాహన పెరుగుతుంది. ‘అంత్యకాలంలో’ చాలామంది ప్రజలు బైబిలు సత్యాల గురించి ఎక్కువగా తెలుసుకుంటారని, బైబిలు ప్రవచనాల గురించిన నిజమైన అవగాహన కూడా పెరుగుతుందని దానియేలు పుస్తకం చెప్తుంది.—దానియేలు 12:4, అధస్సూచి.

 ప్రపంచమంతటా ప్రకటన పని జరుగుతుంది. యేసు ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది.”—మత్తయి 24:14.

 ఉదాసీనత, ఎగతాళి ఎక్కువౌతాయి. ఈ వ్యవస్థ అంతం దగ్గరపడిందని రుజువులు స్పష్టంగా చూపిస్తున్నా, ప్రజలు దాన్ని పట్టించుకోరని యేసు చెప్పాడు. (మత్తయి 24:37-39) అంతేకాదు, కొంతమందైతే రుజువుల్ని ఎగతాళి చేస్తూ ఆ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేస్తారని 2 పేతురు 3:3, 4 వచనాలు చెప్తున్నాయి.

 అన్ని ప్రవచనాలు నెరవేరతాయి. ఈ ప్రవచనాల్లో ఏవో కొన్ని లేదా ఎక్కువశాతం నెరవేరడం కాదు గానీ అవన్నీ ఒకే సమయంలో నెరవేరడం చివరి రోజులకు గుర్తుగా ఉంటుందని యేసు చెప్పాడు.—మత్తయి 24:33.

మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామా?

 అవును. ప్రపంచ పరిస్థితులు, అలాగే బైబిలు కాలపట్టిక ప్రకారం చూస్తే 1914⁠లో చివరి రోజులు మొదలయ్యాయని అర్థమౌతుంది. అదే సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని ప్రపంచ పరిస్థితులు ఎలా చూపిస్తున్నాయో తెలుసుకోవడానికి కింది వీడియో చూడండి:

 1914⁠లో దేవుని రాజ్యం పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టింది. అది మొట్టమొదట చేసిన ఒక పని ఏంటంటే, అపవాదియైన సాతానును అతని చెడ్డదూతలను పరలోకం నుండి వెళ్లగొట్టడం, వాళ్లను భూమికి పరిమితం చేయడం. (ప్రకటన 12:7-12) ప్రజల చెడు వైఖరులు, వాళ్ల చెడ్డపనులు చూసినప్పుడు మనుషుల మీద సాతాను ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. దానివల్ల చివరి రోజులు “ప్రమాదకరమైన, కష్టమైన” కాలాలుగా తయారయ్యాయి.—2 తిమోతి 3:1.

 ఇలాంటి ప్రమాదకరమైన కాలాల్ని చూసి చాలామంది కలతపడుతున్నారు. సమాజం అంతకంతకూ దిగజారుతుందని వాళ్లు ఆందోళన పడుతున్నారు. కొందరైతే, మనుషులు ఒకరినొకరు పూర్తిగా నాశనం చేసుకుంటారని భయపడుతున్నారు.

 అయితే, ప్రపంచ పరిస్థితుల్ని చూసి కలతపడుతున్న ఇంకొంతమంది భవిష్యత్తు బాగుంటుందని ఆశతో జీవిస్తున్నారు. ప్రపంచంలోని సమస్యల్ని తీసేయడానికి దేవుని రాజ్యం త్వరలోనే చర్య తీసుకుంటుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. (దానియేలు 2:44; ప్రకటన 21:3, 4) దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడని వాళ్లు ఓపికతో ఎదురుచూస్తున్నారు, “అంతం వరకు సహించినవాళ్లే రక్షించబడతారు” అని యేసు చెప్పిన మాటల్ని బట్టి ఓదార్పు పొందుతున్నారు.—మత్తయి 24:13; మీకా 7:7.