కంటెంట్‌కు వెళ్లు

పవిత్రశక్తి అంటే ఏమిటి?

పవిత్రశక్తి అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 పవిత్రశక్తి దేవుడు ఉపయోగించే శక్తి, అది చురుకైన శక్తి. (మీకా 3:8; లూకా 1:35) దేవుడు తాను అనుకున్నది జరిగించడానికి తన శక్తిని ఏ చోటుకైనా పంపించగలడు.—కీర్తన 104:30; 139:7.

 బైబిల్లో, రూ-ఆహ్‌ అనే హీబ్రూ పదాన్ని, న్యూమా అనే గ్రీకు పదాన్ని “ఆత్మ” అని అనువదించారు. చాలా సందర్భాల్లో ఆ పదాలు దేవుని చురుకైన శక్తిని లేదా పవిత్రశక్తిని సూచిస్తాయి. (ఆదికాండం 1:2) అయితే బైబిలు ఆ పదాలను వేరే అర్థాల్లో కూడా ఉపయోగిస్తోంది.

 ఇవన్నీ మన కంటికి కనిపించవు గానీ అవి చేసే పనులు మాత్రం మనకు తెలుస్తాయి. అదేవిధంగా దేవుని పవిత్రశక్తి కూడా “గాలిలా కంటికి కనిపించనిది, రూపం లేనిది, శక్తివంతమైనది.”—యాన్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌, డబ్ల్యూ. ఇ. వైన్‌ రాసినది.

 బైబిలు, దేవుని పవిత్రశక్తిని ఆయన ‘చేతితో’ లేదా “వేలితో” పోలుస్తోంది. (కీర్తన 8:3; 19:1; లూకా 11:20; మత్తయి 12:28 తో పోల్చండి.) ఒక శిల్పకారుడు పని చేయడానికి తన చేతులను, వేళ్లను ఎలాగైతే ఉపయోగిస్తాడో అలానే దేవుడు కూడా తన పవిత్రశక్తిని ఈ కింది వాటి కోసం ఉపయోగించాడు:

పవిత్రశక్తి ఒక వ్యక్తి కాదు

 దేవుని పవిత్రశక్తిని ఆయన ‘చేతితో,’ “వేలితో,” లేదా “ఊపిరితో” పోల్చడం ద్వారా అది ఒక వ్యక్తి కాదని బైబిలు చూపిస్తోంది. (నిర్గమకాండం 15:8, 10) శిల్పకారుని చేతులు వాటంతటవే పనిచేయవు గానీ అతని మెదడు, శరీరం చెప్పినట్టుగా పనిచేస్తాయి. అదేవిధంగా, దేవుని పవిత్రశక్తి కూడా సొంతగా పనిచేయదు గానీ ఆయన చెప్పినట్టే పనిచేస్తుంది. (లూకా 11:13) బైబిలు దేవుని పవిత్రశక్తిని నీళ్లతో పోలుస్తోంది. అంతేకాదు దాన్ని విశ్వాసం, జ్ఞానం వంటివాటితో ముడిపెడుతోంది. ఈ పోలికలన్నిటిని బట్టి పవిత్రశక్తి ఒక వ్యక్తి కాదని చెప్పవచ్చు.—యెషయా 44:3; అపొస్తలుల కార్యాలు 6:5; 2 కొరింథీయులు 6:6.

 బైబిలు దేవుని పేరు యెహోవా అని, ఆయన కుమారుని పేరు యేసుక్రీస్తు అని చెప్తుంది. అయితే పవిత్రశక్తికి ఒక పేరు ఉందని మాత్రం చెప్పట్లేదు. (యెషయా 42:8; లూకా 1:31) నమ్మకస్థుడైన స్తెఫను చనిపోతున్నప్పుడు అతనికి ఒక దర్శనంలో పరలోకం కనిపించింది. అక్కడ అతనికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే కనిపించారు గానీ ముగ్గురు కనిపించలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “అతను పవిత్రశక్తితో నిండిపోయి, ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అతనికి దేవుని మహిమ, దేవుని కుడిపక్కన యేసు నిలబడి ఉండడం కనిపించింది.” (అపొస్తలుల కార్యాలు 7:55) స్తెఫను ఆ దర్శనాన్ని చూసేలా సహాయం చేసింది దేవుని శక్తి అయిన పవిత్రశక్తే.

పవిత్రశక్తి గురించిన అపోహలు

 అపోహ: కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ ఇంగ్లీషు బైబిల్లోని 1 యోహాను 5:7, 8 వచనాలు చెప్తున్నట్టు పరిశుద్ధాత్మ లేదా పవిత్రశక్తి ఒక వ్యక్తి, అంతేకాదు అది త్రిత్వంలో భాగం.

 నిజం: కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ ఇంగ్లీషు బైబిల్లోని 1 యోహాను 5:7, 8 వచనాల్లో ఇలా ఉంది: “పరలోకంలో, తండ్రి, వాక్యం, పరిశుద్ధాత్మ: వీళ్లు ముగ్గురు ఏకమై ఉన్నారు. భూమ్మీద సాక్ష్యమిచ్చేవాళ్లు ముగ్గురు ఉన్నారు.” కానీ అపొస్తలుడైన యోహాను ఆ మాటల్ని రాయలేదని, కాబట్టి బైబిల్లో అవి ఉండకూడదని పరిశోధకులు కనుగొన్నారు. ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎమ్‌. మెట్స్‌గర్‌ ఇలా రాశాడు: “ఈ మాటలు కల్పితం, బైబిల్లోని కొత్త నిబంధనలో వాటికి అస్సలు స్థానం లేదనేది ఖచ్చితం.”—ఎ టెక్స్‌టువల్‌ కామెంటరీ ఆన్‌ ద గ్రీక్‌ న్యూ టెస్టమెంట్‌.

 అపోహ: బైబిలు పవిత్రశక్తిని ఒక వ్యక్తిలా సంబోధిస్తోంది కాబట్టి అది ఒక వ్యక్తే.

 నిజం: లేఖనాలు కొన్నిచోట్ల పవిత్రశక్తిని వ్యక్తిలా సంబోధిస్తున్న మాట నిజమే, కానీ అంతమాత్రాన అది ఒక వ్యక్తని చెప్పలేం. తెలివిని, మరణాన్ని, పాపాన్ని కూడా బైబిలు వ్యక్తిలా సంబోధిస్తోంది. (సామెతలు 1:20; రోమీయులు 5:17, 21) ఉదాహరణకు, తెలివి ‘నగర ద్వారాల పక్కన, తలుపుల దగ్గర బిగ్గరగా’ మాట్లాడుతుందని బైబిలు చెప్తుంది. అంతేకాదు పాపం ప్రలోభపెడుతుందని, చంపుతుందని, దురాశను పుట్టిస్తుందని కూడా బైబిలు చెప్తుంది.—సామెతలు 8:3; రోమీయులు 7:8, 11.

 అదేవిధంగా, యేసు చెప్పిన మాటల్ని రాస్తున్నప్పుడు అపొస్తలుడైన యోహాను కూడా పవిత్రశక్తిని “సహాయకుడు” (పా-రా-క్లి-టోస్‌) అని పిలుస్తూ ఒక వ్యక్తిలా సంబోధించాడు. ఆ సహాయకుడు రుజువుల్ని ఇస్తాడని, నడిపిస్తాడని, మాట్లాడతాడని, వింటాడని, ప్రకటిస్తాడని, మహిమపరుస్తాడని కూడా యోహాను వర్ణించాడు. (యోహాను 16:7-15) అయితే వేరే వచనాల్లో యోహాను పవిత్రశక్తిని వర్ణించడానికి న్యూమా అనే నపుంసక లింగ నామవాచకాన్ని ఉపయోగించాడు. ఆ సందర్భాల్లో ఆయన “దాన్ని,” “అది” అనే నపుంసక లింగ సర్వనామాల్ని కూడా ఉపయోగించాడు.—యోహాను 14:16, 17.

 అపోహ: పవిత్రశక్తి పేరున బాప్తిస్మం ఇవ్వడం, అది ఒక వ్యక్తి అని చూపిస్తుంది.

 నిజం: బైబిలు కొన్నిసార్లు “పేరున” అనే మాటను అధికారాన్ని సూచించడానికి ఉపయోగిస్తుంది. (ద్వితీయోపదేశకాండం 18:5, 19-22; ఎస్తేరు 8:10) మనం అప్పుడప్పుడూ “చట్టం పేరున” లేదా “చట్టం పేరుతో” అంటుంటాం, అంతమాత్రాన చట్టం ఒక వ్యక్తి కాదు కదా. ఇది కూడా అలాంటిదే. పవిత్రశక్తి పేరున బాప్తిస్మం తీసుకునే వ్యక్తి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడంలో పవిత్రశక్తికి ఉన్న అధికారాన్ని, పాత్రను గుర్తించానని చూపిస్తాడు.—మత్తయి 28:19.

 అపోహ: యేసు అపొస్తలులు, మొదటి శతాబ్దంలోని ఇతర శిష్యులు పవిత్రశక్తి ఒక వ్యక్తి అని నమ్మారు.

 నిజం: బైబిలుగానీ చరిత్రగానీ ఆ విషయం నిజమని చెప్పట్లేదు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెప్తోంది: “పవిత్రశక్తి అంటే పరలోకంలో ఉండే దేవునిలాంటి ఒక వ్యక్తి అనే నిర్వచనం . . . క్రీస్తు శకం 381లో కాన్‌స్టాంటినోపుల్‌ కౌన్సిల్‌లో నుండి పుట్టుకొచ్చింది.” అంటే అపొస్తలుల్లోని చివరి వ్యక్తి చనిపోయిన 250 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత అన్నమాట.