కంటెంట్‌కు వెళ్లు

బైబిల్లోని స్త్రీల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

బైబిల్లోని స్త్రీల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిల్లో ఎంతోమంది స్త్రీల గురించి ఉంది, వాళ్ల నుండి మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. (రోమీయులు 15:4; 2 తిమోతి 3:16, 17) ఈ ఆర్టికల్‌లో, అలాంటి స్త్రీలలో కొంతమంది గురించి చూస్తాం. వాళ్లలో కొందరు మంచివాళ్లు, మనం వాళ్లలా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఇంకొందరు చెడ్డవాళ్లు, మనం వాళ్లలా ఉండకూడదు.—1 కొరింథీయులు 10:11; హెబ్రీయులు 6:12.

  అబీగయీలు

 అబీగయీలు ఎవరు? ఆమె నాబాలు భార్య. అతను చాలా ధనవంతుడు, కానీ కఠినుడు. అయితే అబీగయీలు వివేచన, వినయం గల స్త్రీ. ఆమె చూడడానికి అందంగా ఉండేది, పైగా యెహోవాకు నచ్చే లక్షణాలు ఆమెలో ఉన్నాయి.—1 సమూయేలు 25:3.

 ఆమె ఏం చేసింది? అబీగయీలు రాబోతున్న ప్రమాదాన్ని తప్పించడానికి తెలివితో, వివేచనతో చర్య తీసుకుంది. ఇశ్రాయేలుకు రాజు కాబోతున్న దావీదు, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్రాంతంలోనే అబీగయీలు, నాబాలు నివసించేవాళ్లు. దావీదు, ఆయన మనుషులు అక్కడ ఉన్నప్పుడు నాబాలుకు చెందిన గొర్రెల్ని దొంగల బారినుండి కాపాడేవాళ్లు. కానీ దావీదు మనుషులు, ఆహారం అడగడానికి వచ్చినప్పుడు నాబాలు పొగరుగా ఇవ్వనన్నాడు. దావీదుకు విపరీతమైన కోపం వచ్చింది! దాంతో దావీదు, ఆయన మనుషులు నాబాలును, అతని ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ చంపేయడానికి బయల్దేరారు.—1 సమూయేలు 25:10-12, 22.

 తన భర్త ఏం చేశాడో అబీగయీలుకు తెలిసినప్పుడు ఆమె వెంటనే చర్య తీసుకుంది. దావీదు కోసం, ఆయన మనుషుల కోసం కొంత ఆహారాన్ని తన సేవకులతో పంపించింది, కరుణ చూపించమని దావీదును వేడుకోవడానికి ఆమె కూడా వెనకాలే వెళ్లింది. (1 సమూయేలు 25:14-19, 24-31) దావీదు ఆమె పంపినవాటిని, ఆమె వినయాన్ని చూసినప్పుడు, ఆమె తెలివైన సలహా విన్నప్పుడు, ప్రమాదాన్ని ఆపడానికి దేవుడే ఆమెను పంపించాడని అర్థం చేసుకున్నాడు. (1 సమూయేలు 25:32, 33) ఆ తర్వాత కొన్ని రోజులకే నాబాలు చనిపోయాడు, అప్పుడు అబీగయీలు దావీదుకు భార్య అయింది.—1 సమూయేలు 25:37-41.

 అబీగయీలు నుండి మనమేం నేర్చుకోవచ్చు? అబీగయీలుకు ఎంతో అందం, ఆస్తి ఉన్నా తానే గొప్ప అని ఆమె అనుకోలేదు. శాంతిని కాపాడడం కోసం, తాను ఏ తప్పూ చేయకపోయినా క్షమాపణ అడిగింది. ఎంతో ఒత్తిడి కలిగించే పరిస్థితిలో ప్రశాంతంగా, యుక్తిగా, ధైర్యంగా, తెలివిగా వ్యవహరించింది.

  ఎస్తేరు

 ఎస్తేరు ఎవరు? ఆమె ఒక యూదురాలు, పర్షియా రాజైన అహష్వేరోషు ఆమెను తన రాణిగా చేసుకున్నాడు.

 ఆమె ఏం చేసింది? ఎస్తేరు రాణి తన అధికారాన్ని ఉపయోగించి తన ప్రజలైన యూదుల్ని కాపాడింది. పర్షియా సామ్రాజ్యంలోని యూదులందర్నీ ఫలానా రోజున చంపేయాలనే ఆజ్ఞ జారీ అయిందని ఆమెకు తెలిసింది. ఆ దుష్ట పన్నాగాన్ని, ప్రధాన అధిపతి అయిన హామాను పన్నాడు. (ఎస్తేరు 3:13-15; 4:1, 5) వయసులో చాలా పెద్దవాడూ వరుసకు అన్న అయిన మొర్దెకై సహాయంతో, ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి మరీ ఆ కుట్ర గురించి తన భర్త అయిన అహష్వేరోషు రాజు ముందు బయటపెట్టింది. (ఎస్తేరు 4:10-16; 7:1-10) అప్పుడు ఎస్తేరు, మొర్దకైలు ఇంకో ఆజ్ఞ జారీ చేసేలా, అంటే యూదులు తమను తాము కాపాడుకునేలా ఆజ్ఞ జారీ చేయడానికి అహష్వేరోషు అనుమతి ఇచ్చాడు. అప్పుడు యూదులు తమ శత్రువుల్ని పూర్తిగా ఓడించారు.—ఎస్తేరు 8:5-12; 9:16, 17.

 ఎస్తేరు నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఎస్తేరు రాణి సాటిలేని ధైర్యాన్ని, వినయాన్ని, అణకువను చూపించింది. (కీర్తన 31:24; ఫిలిప్పీయులు 2:3) ఆమె అందగత్తె, రాణి అయినప్పటికీ ఇతరుల సలహాను, సహాయాన్ని తీసుకుంది. తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఒకపక్క ధైర్యాన్ని, మరోపక్క నేర్పును, గౌరవాన్ని చూపించింది. యూదులకు ప్రాణాపాయం ఉన్న సమయంలో, తాను కూడా యూదురాలినే అని ధైర్యంగా చెప్పింది.

దెబోరా

   దెబోరా ఎవరు? ఆమె ఒక ప్రవక్త్రి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజల నుండి ఏం కోరుకుంటున్నాడో చెప్పడానికి ఆమెను ఉపయోగించుకున్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలీయుల మధ్య తలెత్తిన సమస్యల్ని పరిష్కరించడానికి కూడా దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడు.—న్యాయాధిపతులు 4:4, 5.

 ఆమె ఏం చేసింది? దెబోరా ప్రవక్త్రి ధైర్యంగా యెహోవా ఆరాధకులకు మద్దతిచ్చింది. దేవుడు చెప్పినట్లే, ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించడానికి, తమను అణచివేస్తున్న కనానీయులతో యుద్ధం చేయడానికి దెబోరా బారాకును పిలిపించింది. (న్యాయాధిపతులు 4:6, 7) బారాకు దెబోరాను తనతోపాటు రమ్మన్నప్పుడు, ఆమె భయపడకుండా ఆయనతోపాటు వెళ్లింది.—న్యాయాధిపతులు 4:8, 9.

 దేవుడు అద్భుతరీతిలో ఇశ్రాయేలీయుల్ని గెలిపించినప్పుడు ఆ సంఘటనను వర్ణిస్తూ దెబోరా, బారాకు ఒక పాట పాడారు. ఆ పాటలో కనీసం కొంత భాగాన్నైనా దెబోరా కూర్చి ఉంటుంది. ఆ పాటలో ఆమె, యాయేలు అనే మరో ధైర్యవంతురాలైన స్త్రీ కనానీయుల్ని ఓడించడానికి ఎలా సహాయం చేసిందో చెప్పింది.—న్యాయాధిపతులు 5వ అధ్యాయం.

 దెబోరా నుండి మనమేం నేర్చుకోవచ్చు? దెబోరా స్వయంత్యాగ స్ఫూర్తిని, ధైర్యాన్ని చూపించింది. దేవుని దృష్టిలో సరైనది చేసేలా ఇతరుల్ని ప్రోత్సహించింది. వాళ్లు అలా చేసినప్పుడు, వాళ్లను మనస్ఫూర్తిగా మెచ్చుకుంది.

  •  దెబోరా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, ‘నేను ఇశ్రాయేలులో ఒక తల్లిగా లేచాను’ (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చూడండి.

  దెలీలా

 దెలీలా ఎవరు? ఆమె ఇశ్రాయేలు న్యాయాధిపతైన సమ్సోను ప్రేమించిన స్త్రీ.—న్యాయాధిపతులు 16:4, 5.

 ఆమె ఏం చేసింది? ఆమె ఫిలిష్తీయుల అధికారుల దగ్గర డబ్బు తీసుకుని, సమ్సోనుకు నమ్మకద్రోహం చేసింది. ఆ సమయంలో ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయుల్ని కాపాడడానికి యెహోవా ఆయన్ని ఉపయోగించుకుంటున్నాడు. అయితే సమ్సోనుకు అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి ఫిలిష్తీయులు ఆయన మీద పైచేయి సాధించలేకపోయారు. (న్యాయాధిపతులు 13:5) దాంతో ఆ అధికారులు దెలీలా సహాయం కోరారు.

 వాళ్లు దెలీలాకు లంచం ఇచ్చి, సమ్సోనుకు అంత శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోమని చెప్పారు. దెలీలా ఆ డబ్బు తీసుకుని, చాలాసార్లు ప్రయత్నించి చివరికి సమ్సోను రహస్యాన్ని తెలుసుకుంది. (న్యాయాధిపతులు 16:15-17) తర్వాత ఆ రహస్యాన్ని ఫిలిష్తీయులకు చెప్పింది, దాంతో వాళ్లు ఆయన్ని బంధించి చెరసాలలో వేశారు.—న్యాయాధిపతులు 16:18-21.

 దెలీలా నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం దెలీలాలా ఉండకూడదు. అత్యాశ వల్ల ఆమె తన స్వార్థమే చూసుకుంది, దేవుడైన యెహోవా సేవకుణ్ణి మోసగించి నమ్మకద్రోహం చేసింది.

  మగ్దలేనే మరియ

 మగ్దలేనే మరియ ఎవరు? ఆమె యేసుకు నమ్మకమైన శిష్యురాలు.

 ఆమె ఏం చేసింది? యేసుతో, ఆయన శిష్యులతో ప్రయాణించిన స్త్రీలలో మగ్దలేనే మరియ ఒకామె. వాళ్ల అవసరాలు తీర్చడానికి ఆమె తన సొంత డబ్బును ఉదారంగా ఖర్చుపెట్టేది. (లూకా 8:1-3) ఆమె యేసు పరిచర్య చివరివరకు ఆయన్ని అనుసరించింది, ఆయన చంపబడినప్పుడు దగ్గర్లో నిలబడింది. యేసు తిరిగి బ్రతికాక ఆయన్ని మొట్టమొదట చూసినవాళ్లలో ఆమె కూడా ఉంది!—యోహాను 20:11-18.

 మగ్దలేనే మరియ నుండి మనమేం నేర్చుకోవచ్చు? మగ్దలేనే మరియ యేసు పరిచర్యకు ఉదారంగా మద్దతిచ్చింది, నమ్మకమైన శిష్యురాలిగా కొనసాగింది.

  మరియ (మార్త, లాజరుల తోబుట్టువు)

 మరియ ఎవరు? తన సహోదరుడు లాజరు, సహోదరి మార్త లాగే ఆమె కూడా యేసుకు మంచి స్నేహితురాలు.

 ఆమె ఏం చేసింది? దేవుని కుమారుడిగా యేసుకున్న స్థానాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నానని మరియ పదేపదే చూపించింది. యేసు తమ దగ్గరుంటే, తమ సహోదరుడైన లాజరును చనిపోకుండా కాపాడేవాడనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. యేసు అతన్ని తిరిగి బ్రతికించినప్పుడు ఆమె అక్కడే ఉంది. ఒక సందర్భంలో ఆమె ఇంటిపనుల్లో సహాయం చేయకుండా యేసు మాటలు వింటూ కూర్చున్నప్పుడు, ఆమె సహోదరి మార్త ఆమెను విమర్శించింది. అయితే దేవుని విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినందుకు యేసు ఆమెను మెచ్చుకున్నాడు.—లూకా 10:38-42.

 ఇంకో సందర్భంలో మరియ ఎంతో ఆతిథ్యస్ఫూర్తి చూపిస్తూ యేసు తలమీద, పాదాలమీద “ఖరీదైన పరిమళ తైలం” పోసింది. (మత్తయి 26:6, 7) అది చూస్తున్నవాళ్లు ఆమె డబ్బు వృథా చేస్తోందని అన్నారు. కానీ యేసు ఆమెను సమర్థిస్తూ, “ప్రపంచంలో [దేవుని రాజ్యం గురించిన] మంచివార్త ప్రకటించే ప్రతీ చోట ఈమె చేసిన ఈ పని గురించి కూడా చెప్పుకుంటూ ఈమెను గుర్తుచేసుకుంటారు” అన్నాడు.—మత్తయి 24:14; 26:8-13.

 మరియ నుండి మనమేం నేర్చుకోవచ్చు? మరియ బలమైన విశ్వాసం పెంపొందించుకుంది. అనవసర విషయాలకు కాకుండా దేవుని ఆరాధనకే మొదటిస్థానం ఇచ్చింది. ఆమె వినయంతో యేసును ఘనపర్చింది, అందుకు ఎంతో డబ్బు కూడా ఖర్చుపెట్టింది.

మరియ (యేసు తల్లి)

 మరియ ఎవరు? ఆమె యూదురాలైన యువతి. ఆమె కన్యగా ఉన్నప్పుడు అద్భుతరీతిలో గర్భవతియై దేవుని కుమారుడైన యేసును కన్నది.

   ఆమె ఏం చేసింది? మరియ వినయంతో దేవుని ఇష్టాన్ని చేసింది. దేవదూత కనిపించి, ఆమె గర్భవతియై వాగ్దానం చేయబడిన మెస్సీయను కంటుందని చెప్పే సమయానికి యోసేపుతో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. (లూకా 1:26-33) అయినా ఆ బాధ్యతను ఆమె సంతోషంగా స్వకరించింది. యేసు పుట్టిన తర్వాత, యోసేపు మరియలకు నలుగురు కొడుకులూ కనీసం ఇద్దరు కూతుళ్లూ పుట్టారు. అంటే మరియ ఎప్పటికీ కన్యగా ఉండిపోలేదు. (మత్తయి 13:55, 56) యేసుకు తల్లి అయ్యే గొప్ప అవకాశం మరియకు దొరికినా, ఇతరులు తనను పొగడాలని ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. ఇతరులు కూడా ఆమెను ప్రత్యేకంగా చూడలేదు. ఆమెను యేసు పరిచర్య సమయంలోనే కాదు, తొలి క్రైస్తవ సంఘ సభ్యురాలిగా ఉన్నప్పుడు కూడా ఎవ్వరూ అలా చూడలేదు.

 మరియ నుండి మనమేం నేర్చుకోవచ్చు? మరియ ఒక నమ్మకమైన స్త్రీ, ఎంతో బరువైన బాధ్యతను ఆమె సంతోషంగా స్వకరించింది. ఆమెకు లేఖనాలు చాలా బాగా తెలుసు. లూకా 1:46-55 లోని మాటల్ని అన్నప్పుడు ఆమె దాదాపు 20 సార్లు లేఖనాలు ఎత్తిచెప్పిందని ఒక అంచనా.

  •  మరియ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “మరియ ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చూడండి.

మార్త

 మార్త ఎవరు? ఆమె లాజరు, మరియల సహోదరి. ఆ ముగ్గురు యెరూషలేముకు దగ్గర్లో ఉన్న బేతనియ గ్రామంలో నివసించేవాళ్లు.

   ఆమె ఏం చేసింది? మార్తకు యేసుతో మంచి స్నేహం ఉండేది. “యేసు మార్తను, ఆమె సోదరిని, లాజరును ప్రేమించాడు” అని బైబిలు చెప్తుంది. (యోహాను 11:5) మార్త చక్కగా ఆతిథ్యమిస్తూ ఉండేది. ఒకసారి యేసు వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు, మరియ యేసు చెప్పేది వింటూ అక్కడే కూర్చుంది. అయితే మార్త ఇంటి పనుల్లో మునిగిపోయింది. మరియ తనకు సాయం చేయట్లేదని మార్త యేసుకు ఫిర్యాదు చేసింది. అప్పుడు యేసు సున్నితంగా మార్త ఆలోచనాతీరును సరిదిద్దాడు.—లూకా 10:38-42.

 లాజరు జబ్బు పడినప్పుడు, యేసు అతన్ని బాగుచేయగలడనే నమ్మకంతో మార్త, ఆమె సహోదరి ఆయన కోసం కబురు పంపారు. (యోహాను 11:3, 21) అయితే లాజరు చనిపోయాడు. యేసు వచ్చినప్పుడు మార్త ఆయనతో మాట్లాడిన మాటలు గమనిస్తే, పునరుత్థానం గురించిన బైబిలు వాగ్దానం మీద, తన సహోదరుణ్ణి తిరిగి బ్రతికించగల యేసు సామర్థ్యం మీద ఆమెకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది.—యోహాను 11:20-27.

 మార్త నుండి మనమేం నేర్చుకోవచ్చు? మార్తకు ఎంతో ఆతిథ్యస్ఫూర్తి ఉంది. సలహా ఇచ్చినప్పుడు చక్కగా స్వీకరించింది. తన భావాల గురించి, తన విశ్వాసం గురించి బయటికి చెప్పేది.

మిర్యాము

   మిర్యాము ఎవరు? ఆమె మోషే అహరోనుల సహోదరి. బైబిల్లో ప్రవక్త్రి అని మొట్టమొదట పిలవబడిన స్త్రీ ఆమె.

 ఆమె ఏం చేసింది? ఆమె ఒక ప్రవక్త్రిగా దేవుని సందేశాల్ని ప్రజలకు చెప్పింది. ఇశ్రాయేలులో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది. ఎర్రసముద్రం దగ్గర దేవుడు ఐగుప్తు సైన్యాన్ని నాశనం చేసిన తర్వాత, అక్కడున్న పురుషులతో కలిసి విజయగీతం పాడింది.—నిర్గమకాండము 15:1, 20, 21.

 కొంతకాలం తర్వాత, మిర్యాము అలాగే అహరోను మోషేను విమర్శిస్తూ మాట్లాడారు. గర్వం, అసూయ వల్లే వాళ్లు అలా మాట్లాడారని తెలుస్తోంది. అయితే “యెహోవా ఆ మాట వినెను.” అందుకే ఆయన మిర్యామును, అహరోనును గట్టిగా మందలించాడు. (సంఖ్యాకాండము 12:1-9) తర్వాత ఆయన మిర్యాముకు కుష్ఠు వచ్చేలా చేశాడు, ఎందుకంటే అలా మాట్లాడడం ఆమే ముందు మొదలుపెట్టింది. మోషే ఆమె కోసం వేడుకోవడంతో దేవుడు ఆమెను బాగుచేశాడు. ఏడు రోజులు పాలెం బయట ఉన్న తర్వాత ఆమె మళ్లీ ప్రజల మధ్యకు రాగలిగింది.—సంఖ్యాకాండము 12:10-15.

 ఆ దిద్దుబాటును మిర్యాము స్వకరించిందని బైబిలు సూచిస్తుంది. వందల సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులతో, “మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని” అని అన్నప్పుడు, ఆమెకు దొరికిన సాటిలేని అవకాశం గురించి చెప్పాడు.—మీకా 6:4.

 మిర్యాము నుండి మనమేం నేర్చుకోవచ్చు? తన సేవకులు ఒకరితో ఒకరు, అలాగే ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారో దేవుడు పట్టించుకుంటాడని మిర్యాము ఉదాహరణ చూపిస్తుంది. అంతేకాదు, దేవున్ని సంతోషపెట్టాలంటే మనం అనవసరమైన గర్వం, అసూయ చూపించకూడదు. ఆ లక్షణాలకు చోటిస్తే, మనం ఇతరుల పేరు పాడుచేసేలా మాట్లాడే ప్రమాదం ఉంది.

యాయేలు

 యాయేలు ఎవరు? ఆమె హెబెరు భార్య, అతను ఇశ్రాయేలీయుడు కాడు. యాయేలు ధైర్యంగా దేవుని ప్రజలకు మద్దతిచ్చింది.

   ఆమె ఏం చేసింది? కనానీయుల సేనాధిపతి సీసెరా యాయేలు డేరాకు వచ్చినప్పుడు, ఆమె త్వరగా ఆలోచించి చర్య తీసుకుంది. సీసెరా ఇశ్రాయేలీయులతో చేసిన యుద్ధంలో ఓడిపోయి, ఆశ్రయం కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. యాయేలు అతన్ని లోపలికి పిలిచి విశ్రాంతి తీసుకోమంది. అతను నిద్రలో ఉన్నప్పుడు యాయేలు అతన్ని చంపేసింది.—న్యాయాధిపతులు 4:17-21.

 అలా యాయేలు, “యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించును” అని దెబోరా చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చింది. (న్యాయాధిపతులు 4:9) దానివల్ల, ‘స్త్రీలలో ఆమె దీవెన నొందినది’ అని కీర్తించబడింది.—న్యాయాధిపతులు 5:24.

 యాయేలు నుండి మనమేం నేర్చుకోవచ్చు? యాయేలు చొరవ తీసుకుని ధైర్యంగా ప్రవర్తించింది. ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు పరిస్థితుల్ని ఎలా మలుపు తిప్పగలడో ఆమె అనుభవం చూపిస్తుంది.

యెజెబెలు

 యెజెబెలు ఎవరు? ఆమె ఇశ్రాయేలు రాజైన అహాబు భార్య. ఆమె అన్యురాలు, యెహోవాను కాకుండా కనానీయుల దేవుడైన బయలును ఆరాధించేది.

 ఆమె ఏం చేసింది? యెజెబెలు రాణి పెత్తనం చెలాయించేది, ఏమాత్రం జాలీ దయ లేకుండా దౌర్జన్యంగా ప్రవర్తించేది. ఆమె బయలు ఆరాధనను, దానితో ముడిపడివున్న అనైతికతను ప్రోత్సహించింది. అదే సమయంలో, సత్యదేవుడైన యెహోవా ఆరాధనను తుడిచిపెట్టడానికి కూడా ప్రయత్నించింది.—1 రాజులు 18:4, 13; 19:1-3.

   యెజెబెలు తాను అనుకున్నది సాధించడానికి అబద్ధాలాడేది, హత్యలు చేయించేది. (1 రాజులు 21:8-16) అయితే దేవుడు ముందే చెప్పినట్టు ఆమె చాలా దారుణంగా చనిపోయింది, ఎవరూ ఆమెను సమాధి చేయలేదు.—1 రాజులు 21:23; 2 రాజులు 9:10, 32-37.

 యెజెబెలు నుండి మనమేం నేర్చుకోవచ్చు? యెజెబెలు మనకొక హెచ్చరికగా ఉంది. ఆమె దిగజారిన ప్రవర్తన, అనుకున్నది సాధించడానికి ఎంతకైనా ఒడిగట్టే స్వభావం వల్ల, ఆమె పేరును ‘సిగ్గు గానీ అడ్డూఅదుపూ గానీ లేని అనైతిక’ స్త్రీని సూచించడానికి ఉపయోగిస్తారు.

రాహాబు

 రాహాబు ఎవరు? ఆమె కనానీయుల నగరమైన యెరికోలో నివసించిన ఒక వేశ్య. తర్వాత యెహోవా దేవుని ఆరాధకురాలు అయింది.

 ఆమె ఏం చేసింది? తమ దేశాన్ని వేగుచూడడానికి వచ్చిన ఇద్దరు ఇశ్రాయేలు గూఢచారుల్ని రాహాబు దాచిపెట్టింది. ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజల్ని ఐగుప్తు నుండి ఎలా బయటికి తీసుకొచ్చాడో, తర్వాత అమోరీయుల దాడి నుండి వాళ్లను ఎలా కాపాడాడో ఆమె విన్నది.

   రాహాబు ఆ గూఢచారులకు సహాయం చేసి, ఇశ్రాయేలీయులు యెరికోను నాశనం చేయడానికి వచ్చినప్పుడు తనను, తన కుటుంబాన్ని విడిచిపెట్టమని వేడుకుంది. వాళ్లు ఒప్పుకున్నారు, కానీ ఈ షరతులు పెట్టారు: వాళ్లు ఎందుకు వచ్చారో ఆమె ఎవరికీ చెప్పకూడదు, ఇశ్రాయేలీయులు దాడి చేసే సమయానికి ఆమె, ఆమె కుటుంబసభ్యులు ఆమె ఇంట్లో ఉండాలి, అలాగే తన ఇంటిని గుర్తుపట్టడం కోసం కిటికీ నుండి ఒక ఎర్రటి తాడును వేలాడదీసి ఉంచాలి. రాహాబు ఆ నిర్దేశాలన్నీ పాటించింది. ఇశ్రాయేలీయులు యెరికోను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె, ఆమె కుటుంబం ప్రాణాలు కాపాడుకున్నారు.

 రాహాబు ఆ తర్వాత ఒక ఇశ్రాయేలీయుణ్ణి పెళ్లిచేసుకుని దావీదు రాజుకు, యేసుక్రీస్తుకు పూర్వీకురాలైంది.—యెహోషువ 2:1-24; 6:25; మత్తయి 1:5, 6, 16.

 రాహాబు నుండి మనమేం నేర్చుకోవచ్చు? విశ్వాసం చూపించే విషయంలో రాహాబు సాటిలేని ఆదర్శమని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 11:30, 31; యాకోబు 2:25) దేవుడు ఎంతో క్షమిస్తాడని, ఆయనకు పక్షపాతం లేదని, ఏ నేపథ్యానికి చెందినవాళ్లైనా తనమీద నమ్మకం పెట్టుకుంటే వాళ్లను దీవిస్తాడని ఆమె కథ చూపిస్తుంది.

  •  రాహాబు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “ఆమె ‘చేతల వల్ల నీతిమంతురాలని.’ తీర్పు పొందింది” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చూడండి.

రాహేలు

   రాహేలు ఎవరు? ఆమె లాబాను కూతురు, ఇశ్రాయేలీయుల పూర్వీకుడైన యాకోబుకు ఇష్టమైన భార్య.

 ఆమె ఏం చేసింది? రాహేలు యాకోబును పెళ్లిచేసుకొని, ఆయనకు ఇద్దరు కొడుకుల్ని కన్నది. ప్రాచీన ఇశ్రాయేలు 12 గోత్రాల కుటుంబపెద్దల్లో వాళ్లు కూడా ఉన్నారు. రాహేలు వాళ్ల నాన్నకు చెందిన గొర్రెల్ని కాస్తున్నప్పుడు, తనకు కాబోయే భర్తను కలిసింది. (ఆదికాండము 29:9, 10) తన అక్క లేయా కన్నా రాహేలు చాలా అందంగా ఉండేది.—ఆదికాండము 29:17.

 యాకోబు రాహేలును ప్రేమించాడు, ఆమెను పెళ్లిచేసుకోవడం కోసం ఏడు సంవత్సరాలు పనిచేస్తానని చెప్పాడు. (ఆదికాండము 29:18) అయితే, లాబాను యాకోబును మోసం చేసి మొదట లేయాతో పెళ్లిచేశాడు, తర్వాత రాహేలును కూడా ఇచ్చి పెళ్లిచేశాడు.—ఆదికాండము 29:25-27.

 లేయా, ఆమె పిల్లల కన్నా యాకోబు రాహేలును, ఆమె ఇద్దరు కొడుకుల్ని ఎక్కువ ప్రేమించాడు. (ఆదికాండము 37:3; 44:20, 27-29) దానివల్ల ఆ ఇద్దరు స్త్రీల మధ్య శత్రుత్వం ఉండేది.—ఆదికాండము 29:30; 30:1, 15.

   రాహేలు నుండి మనమేం నేర్చుకోవచ్చు? రాహేలు తన కుటుంబంలోని కష్టమైన పరిస్థితిని సహించింది, అయితే దేవుడు తన ప్రార్థనలు వింటాడనే నమ్మకాన్ని ఆమె కోల్పోలేదు. (ఆదికాండము 30:22-24) ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లిచేసుకుంటే కుటుంబంలో ఎంత ఒత్తిడి ఉంటుందో ఆమె కథ చూస్తే తెలుస్తుంది. ఒక వ్యక్తికి ఒక్క భార్యే ఉండాలని దేవుడు పెట్టిన వివాహ ప్రమాణం ఎంత తెలివైనదో రాహేలు అనుభవం చూపిస్తుంది.—మత్తయి 19:4-6.

  •  రాహేలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “మనోవేదనను అనుభవించిన అక్కాచెల్లెళ్లు ‘ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేశారు’” అనే ఆర్టికల్‌ చూడండి.

  •  తన ప్రజలు ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లిచేసుకోవడాన్ని దేవుడు కొంతకాలం ఎందుకు అనుమతించాడో తెలుసుకోవడానికి, కావలికోట 2003, ఆగస్టు ”ప్రశ్నలు పాఠకుల“ సంచికలోని“ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు అంగీకరిస్తాడా?” (ఇంగ్లీష్‌) ఆర్టికల్‌ చూడండి.

రిబ్కా

 రిబ్కా ఎవరు? ఆమె ఇస్సాకు భార్య. యాకోబు, ఏశావు అనే కవలల తల్లి.

 ఆమె ఏం చేసింది? రిబ్కా ఎంత కష్టమైనా దేవుని ఇష్టాన్ని చేసింది. ఆమె బావి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నప్పుడు, ఒకాయన తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగాడు. రిబ్కా వెంటనే నీళ్లిచ్చి, ఆయన ఒంటెలకు కూడా నీళ్లు చేదిపెడతానని అంది. (ఆదికాండము 24:15-20) ఆయన అబ్రాహాము సేవకుడు. ఆయన అబ్రాహాము కొడుకైన ఇస్సాకుకు భార్యను వెదకడానికి ఎంతోదూరం ప్రయాణించి అక్కడికి వచ్చాడు. (ఆదికాండము 24:2-4) అంతేకాదు, దేవుని ఆశీర్వాదం కోసం ఆయన ప్రార్థించాడు. కష్టపడే స్వభావం, ఆతిథ్యస్ఫూర్తి ఉన్న రిబ్కాను చూడగానే, దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడనీ ఇస్సాకుకు భార్యగా దేవుడు ఆమెను ఎంచుకున్నాడనీ ఆయనకు అర్థమైంది.—ఆదికాండము 24:10-14, 21, 27.

   ఆయన ఎందుకు వచ్చాడో రిబ్కాకు తెలిసినప్పుడు ఆయనతో పాటు వెళ్లడానికి, ఇస్సాకుకు భార్య అవ్వడానికి ఆమె ఒప్పుకుంది. (ఆదికాండము 24:57-59) ఆ తర్వాత రిబ్కాకు కవలలు పుట్టారు. పెద్ద కొడుకు ఏశావు, రెండో కొడుకు యాకోబు. పెద్దవాడు చిన్నవాడికి సేవకుడౌతాడని దేవుడు ఆమెకు ముందే తెలియజేశాడు. (ఆదికాండము 25:23) పెద్ద కొడుకుకు వచ్చే దీవెన ఏశావుకు ఇవ్వాలని ఇస్సాకు అనుకున్నప్పుడు, రిబ్కా ఆ దీవెన యాకోబుకు వచ్చేలా చేసింది. ఎందుకంటే అది యాకోబుకు రావడమే దేవుని ఇష్టమని ఆమెకు తెలుసు.—ఆదికాండము 27:1-17.

 రిబ్కా నుండి మనమేం నేర్చుకోవచ్చు? అణకువ, కష్టపడే గుణం, ఆతిథ్యస్ఫూర్తి వంటి లక్షణాల వల్ల రిబ్కా ఒక భార్యగా, తల్లిగా, సత్యదేవుని ఆరాధకురాలిగా తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించింది.

  •  రిబ్కా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “నాకిష్టమే, నేను వెళ్తాను” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చూడండి.

రూతు

 రూతు ఎవరు? ఆమె ఒక మోయాబీయురాలు. ఇశ్రాయేలు దేశంలో యెహోవాను ఆరాధించడానికి ఆమె తన దేవుళ్లను, తన దేశాన్ని విడిచిపెట్టింది.

 ఆమె ఏం చేసింది? రూతు తన అత్త నయోమి పట్ల అసాధారణ ప్రేమ చూపించింది. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు నయోమి, ఆమె భర్త, ఇద్దరు కొడుకులు మోయాబు దేశానికి వెళ్లారు. తర్వాత ఆమె కొడుకులు రూతు, ఓర్పా అనే మోయాబు స్త్రీలను పెళ్లిచేసుకున్నారు. కొంతకాలానికి నయోమి భర్త, ఆమె ఇద్దరు కొడుకులు చనిపోవడంతో ఆమె, ఆమె ఇద్దరు కోడళ్లు విధవరాళ్లయ్యారు.

 ఇశ్రాయేలు దేశంలో కరువు పోయిందని తెలిసినప్పుడు నయోమి అక్కడికి తిరిగెళ్లాలని అనుకుంది. రూతు, ఓర్పా కూడా ఆమెతో పాటు బయల్దేరారు. అయితే నయోమి వాళ్లను తిరిగి తమ బంధువుల దగ్గరికి వెళ్లిపోమని చెప్పింది. ఓర్పా అలాగే వెళ్లిపోయింది. (రూతు 1:1-6, 15) కానీ రూతు తన అత్తను అంటిపెట్టుకుని ఉండాలని నిశ్చయించుకుంది. ఆమెకు నయోమి అంటే చాలా ప్రేమ, నయోమి దేవుడైన యెహోవాను ఆరాధించాలనేది ఆమె కోరిక.—రూతు 1:16, 17; 2:11.

 నయోమి సొంత ఊరు బేత్లెహేము. కొంతకాలానికే ఆ ఊర్లో రూతుకు, అత్తను అంటిపెట్టుకున్న కోడలిగా అలాగే కష్టపడే స్త్రీగా మంచి పేరు వచ్చింది. రూతు గురించి తెలిసి బోయజు అనే సంపన్నుడైన భూస్వామి ఎంతో ముగ్ధుడై ఆమెకు, నయోమికి ఉదారంగా ఆహారం ఇచ్చాడు. (రూతు 2:5-7, 20) ఆ తర్వాత రూతు బోయజును పెళ్లిచేసుకుని దావీదు రాజుకు, యేసుక్రీస్తుకు పూర్వీకురాలైంది.—మత్తయి 1:5, 6, 16.

   రూతు నుండి మనమేం నేర్చుకోవచ్చు? నయోమి మీద, యెహోవా మీద ఉన్న ప్రేమ వల్ల రూతు తన దేశాన్ని, బంధువుల్ని విడిచిపెడిపెట్టడానికి సిద్ధపడింది. ఎన్నో సమస్యలు ఉన్నా ఆమె కష్టపడి పనిచేసింది, అత్తను విడిచిపెట్టలేదు, నమ్మకంగా ఉంది.

లేయా

 లేయా ఎవరు? ఆమె, ఇశ్రాయేలీయుల పూర్వీకుడైన యాకోబు మొదటి భార్య. ఆమె చెల్లి రాహేలు, ఆయనకు రెండో భార్య.—ఆదికాండము 29:20-29.

 ఆమె ఏం చేసింది? లేయా ద్వారా యాకోబుకు ఆరుగురు పిల్లలు పుట్టారు. (రూతు 4:11) అయితే యాకోబు పెళ్లి చేసుకోవాలనుకున్నది లేయాను కాదు రాహేలును. కానీ ఆ అమ్మాయిల తండ్రైన లాబాను, రాహేలుకు బదులు లేయాను ఇచ్చి పెళ్లిచేశాడు. తనను మోసం చేసి లేయాతో పెళ్లిచేశారని యాకోబు తెలుసుకున్నప్పుడు ఆయన లాబానును నిలదీశాడు. అప్పుడు లాబాను, పెద్ద కూతురుకు పెళ్లికాకుండా చిన్న కూతురుకు పెళ్లిచేయడం ఆనవాయితీ కాదని చెప్పాడు. ఒక వారం తర్వాత, యాకోబు రాహేలును పెళ్లి చేసుకున్నాడు.—ఆదికాండము 29:26-28.

 యాకోబు లేయా కన్నా రాహేలునే ఎక్కువగా ప్రేమించాడు. (ఆదికాండము 29:30) దానివల్ల లేయా అసూయపడి, తన భర్త ప్రేమానురాగాల కోసం చెల్లితో పోటీపడేది. దేవుడు లేయా బాధను అర్థంచేసుకుని, ఆమెకు ఏడుగురు పిల్లల్ని ఇచ్చి దీవించాడు. వాళ్లలో ఆరుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల.—ఆదికాండము 29:31.

 లేయా నుండి మనమేం నేర్చుకోవచ్చు? కుటుంబంలో సమస్యలు ఉన్నా, దేవుడు తనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని లేయా అర్థంచేసుకుంది. (ఆదికాండము 29:32-35; 30:20) ఆమె జీవితాన్ని చూస్తే, ఎక్కువమందిని పెళ్లిచేసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో అర్థమౌతుంది. దేవుడు అప్పట్లో కొంతకాలం అలా జరగనిచ్చాడు. కానీ వివాహం విషయంలో ఆయన ఏర్పాటుచేసిన ప్రమాణం ఏంటంటే, ఒక భర్తకు ఒక్క భార్యే ఉండాలి, భార్యకు ఒక్క భర్తే ఉండాలి.—మత్తయి 19:4-6.

  •    లేయా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “మనోవేదనను అనుభవించిన అక్కాచెల్లెళ్లు ‘ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేశారు’” అనే ఆర్టికల్‌ చూడండి.

  •  తన ప్రజలు చాలామందిని పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు అప్పట్లో కొంతకాలం ఎందుకు అనుమతించాడో తెలుసుకోవడానికి, కావలికోట 2003, ఆగస్టు ”ప్రశ్నలు పాఠకుల“ సంచికలోని“ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు అంగీకరిస్తాడా?” (ఇంగ్లీష్‌) ఆర్టికల్స్‌ చూడండి.

లోతు భార్య

 లోతు భార్య ఎవరు? ఆమె పేరేంటో బైబిలు చెప్పట్లేదు. అయితే ఆమెకు ఇద్దరు కూతుళ్లని, వాళ్లంతా సొదొమ నగరంలో ఉండేవాళ్లని బైబిలు చెప్తుంది.—ఆదికాండము 19:1, 15.

 ఆమె ఏం చేసింది? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఆమె పాటించలేదు. సొదొమ, దాని చుట్టుపక్కల నగరాల ప్రజలు ఘోరమైన లైంగిక పాపాలు చేస్తుండడంతో దేవుడు ఆ నగరాల్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే సొదొమలో ఉంటున్న నీతిమంతుడైన లోతుమీద, ఆయన కుటుంబంమీద ప్రేమతో దేవుడు వాళ్లను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడానికి ఇద్దరు దూతల్ని పంపించాడు.—ఆదికాండము 18:20; 19:1, 12, 13.

 ఆ దూతలు లోతు కుటుంబంతో అక్కడినుండి పారిపొమ్మని చెప్పారు. వెనక్కి తిరిగి చూడొద్దని, లేకపోతే చనిపోతారని హెచ్చరించారు. (ఆదికాండము 19:17) అయితే లోతు భార్య వెనక్కి చూడడం మొదలుపెట్టింది, ‘ఉప్పు స్తంభం అయింది.’—ఆదికాండము 19:26.

   లోతు భార్య నుండి మనమేం నేర్చుకోవచ్చు? దేవుని ఆజ్ఞను పాటించలేనంతగా వస్తుసంపదల్ని ప్రేమిస్తే ఏమౌతుందో ఆమె కథ చూపిస్తుంది. ఆమె జీవితం ఒక హెచ్చరికగా ఉందని సూచిస్తూ యేసు, “లోతు భార్యను గుర్తుచేసుకోండి” అన్నాడు.—లూకా 17:32.

శారా

 శారా ఎవరు? ఆమె అబ్రాహాము భార్య, ఇస్సాకు తల్లి.

 ఆమె ఏం చేసింది? తన భర్తైన అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానాల మీద శారాకు విశ్వాసం ఉంది. దానివల్ల ఆమె, ఊరు అనే సంపన్న నగరంలో సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. ఊరు నగరాన్ని విడిచి కనాను దేశానికి వెళ్లమని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహామును దీవిస్తానని, గొప్ప జనంగా చేస్తానని దేవుడు మాటిచ్చాడు. (ఆదికాండము 12:1-5) అప్పటికి శారా 60వ పడిలో ఉండివుండవచ్చు. ఆ సమయం నుండి శారా, ఆమె భర్త సంచారకుల్లా డేరాల్లో నివసించారు.

 సంచారకుల్లా జీవించడం ప్రమాదకరమే అయినా, అబ్రాహాము దేవుని నిర్దేశాన్ని పాటిస్తుండగా శారా ఆయనకు మద్దతిచ్చింది. (ఆదికాండము 12:10, 15) చాలా ఏళ్లు శారాకు పిల్లల్లేరు, దానివల్ల ఆమె ఇంకా బాధపడివుంటుంది. అయితే దేవుడు అబ్రాహాము సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు. (ఆదికాండము 12:7; 13:15; 15:18; 16:1, 2, 15) ఆ తర్వాత శారా తల్లి అవుతుందని దేవుడు మాటిచ్చాడు. పిల్లలు పుట్టే వయసు దాటిపోయిన చాలా ఏళ్లకు ఆమె కొడుకును కన్నది. అప్పటికి ఆమెకు 90 ఏళ్లు, ఆమె భర్తకు 100 ఏళ్లు. (ఆదికాండము 17:17; 21:2-5) ఆ బాబుకు వాళ్లు ఇస్సాకు అని పేరు పెట్టారు.

 శారా నుండి మనమేం నేర్చుకోవచ్చు? దేవుడు తన వాగ్దానాలన్నిటినీ, చివరికి అసాధ్యంగా కనిపించేవాటిని కూడా నెరవేరుస్తాడని మనం నమ్మవచ్చని శారా ఉదాహరణ చూపిస్తుంది. (హెబ్రీయులు 11:11) భార్యగా ఆమె మంచి ఆదర్శం, దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్తుంది.—1 పేతురు 3:5, 6.

  •  శారా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “నువ్వు ఎంతో అందంగా ఉంటావు” (ఇంగ్లీష్‌) అలాగే “దేవుడు ఆమెను ‘రాకుమారి’ అని పిలిచాడు” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్స్‌ చూడండి.

  షూలమ్మీతీ

 షూలమ్మీతీ ఎవరు? ఆమె ఒక అందమైన పల్లెటూరి అమ్మాయి, బైబిల్లోని పరమగీతము అనే పుస్తకంలో ఆమె ముఖ్య పాత్రధారి. షూలేముకు చెందిన ఆ అమ్మాయి పేరును బైబిలు చెప్పట్లేదు.

 ఆమె ఏం చేసింది? తాను ఎంతో ప్రేమించిన గొర్రెల కాపరికి షూలమ్మీతీ నమ్మకంగా ఉంది. (పరమగీతము 2:16) ఆమె చాలా అందగత్తె కాబట్టి, సంపన్నుడైన సొలొమోను రాజు ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె ప్రేమానురాగాలు పొందాలని కోరుకున్నాడు. (పరమగీతము 7:6) సొలొమోనును ఎంచుకోమని ఇతరులు చెప్పినా, షూలమ్మీతీ ఒప్పుకోలేదు. తక్కువ స్థాయికి చెందిన గొర్రెల కాపరినే ప్రేమించింది, ఆయనకు నమ్మకంగా ఉంది.—పరమగీతము 3:5; 7:10; 8:6.

 షూలమ్మీతీ నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఆమెకు ఎంతో అందం ఉన్నా, ఇతరులు ఆమె గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నా అణకువ చూపించింది. ఇతరులు ఒత్తిడి చేసినా లేదా సంపదల్ని, హోదాను ఆశ చూపించినా ఆమె గొర్రెల కాపరిని ప్రేమించడం మానలేదు. తన భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకుంది, నైతికంగా పవిత్రంగా ఉంది.

హన్నా

 హన్నా ఎవరు? ఆమె ఎల్కానా భార్య, అలాగే ప్రాచీన ఇశ్రాయేలులో బాగా పేరు పొందిన సమూయేలు ప్రవక్తకు తల్లి.—1 సమూయేలు 1:1, 2, 4-7.

   ఆమె ఏం చేసింది? హన్నాకు పిల్లలు లేని సమయంలో ఓదార్పు కోసం దేవుని మీద ఆధారపడింది. ఆమె భర్తకు పెనిన్నా అనే ఇంకో భార్య కూడా ఉంది. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు మాత్రం పెళ్లైన చాలాకాలం వరకు పిల్లల్లేరు. దాంతో పెనిన్నా ఆమెను వేధించేది. అప్పుడు హన్నా ఓదార్పు కోసం దేవునికి ప్రార్థించింది. తనకు ఒక కొడుకును అనుగ్రహిస్తే, గుడారంలో సేవ చేసేలా అతన్ని అప్పగిస్తానని మొక్కుబడి చేసుకుంది. గుడారం అంటే ఇశ్రాయేలీయులు ఆరాధన కోసం ఉపయోగించే ఒక డేరా, దాన్ని ఒకచోటు నుండి ఇంకోచోటుకు తీసుకెళ్లవచ్చు.—1 సమూయేలు 1:11.

 దేవుడు హన్నా ప్రార్థనకు జవాబివ్వడంతో ఆమె సమూయేలును కన్నది. హన్నా మొక్కుబడి చేసుకున్నట్టు, సమూయేలు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే గుడారంలో సేవచేసేలా అక్కడికి తీసుకెళ్లింది. (1 సమూయేలు 1:27, 28) ప్రతీ సంవత్సరం ఆమె ఒక చేతుల్లేని అంగీ తయారుచేసి అతని కోసం తీసుకెళ్లేది. ఆ తర్వాత దేవుడు హన్నాను మరో ఐదుగురు పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదించాడు. వాళ్లలో ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు.—1 సమూయేలు 2:18-21.

 హన్నా నుండి మనమేం నేర్చుకోవచ్చు? హన్నా హృదయపూర్వకంగా ప్రార్థించేది కాబట్టి పరీక్షల్ని సహించగలిగింది. 1 సమూయేలు 2:1-10 లో ఆమె కృతజ్ఞతతో చేసిన ప్రార్థనను చదివితే, దేవుని మీద ఆమెకు ఎంత బలమైన విశ్వాసం ఉందో తెలుస్తుంది.

  •  హన్నా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “ఆమె ప్రార్థనలో దేవుని ముందు తన హృదయాన్ని కుమ్మరించింది” అనే ఆర్టికల్‌ చూడండి.

  •    ప్రాచీనకాలంలోని తన ప్రజలు చాలామందిని పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసుకోవడానికి, కావలికోట 2003, ఆగస్టు ”ప్రశ్నలు పాఠకుల“ సంచికలోని“ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు అంగీకరిస్తాడా?” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్స్‌ చూడండి.

హవ్వ

 హవ్వ ఎవరు? ఆమె మొట్టమొదటి స్త్రీ, అలాగే బైబిల్లో మొట్టమొదట ప్రస్తావించబడిన స్త్రీ.

 ఆమె ఏం చేసింది? దేవుడు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞకు హవ్వ లోబడలేదు. తన భర్త ఆదాములాగే హవ్వ కూడా లోపం లేకుండా, సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వచ్ఛతో, దేవునికున్న ప్రేమ, తెలివి లాంటి లక్షణాలు అలవర్చుకునే సామర్థ్యంతో సృష్టించబడింది. (ఆదికాండము 1:27) వాళ్లు ఒక చెట్టు పండు తింటే చనిపోతారని దేవుడు ఆదాముతో చెప్పిన మాట హవ్వకు తెలుసు. అయితే, ఆ చెట్టు పండు తింటే చనిపోరని సాతాను చెప్పిన మాయమాటల్ని ఆమె నమ్మింది. నిజానికి, యెహోవా మాట వినకపోతేనే ఆమె జీవితం బాగుంటుందని సాతాను ఆమెను నమ్మించాడు. దాంతో ఆమె ఆ చెట్టు పండు తింది, తర్వాత తన భర్త కూడా తినేలా చేసింది.—ఆదికాండము 3:1-6; 1 తిమోతి 2:14.

 హవ్వ నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం హవ్వలా చెడ్డ కోరికల గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఉండకూడదు, అది చాలా ప్రమాదకరం. దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించినప్పటికీ, హవ్వ తనదికాని దాని మీద విపరీతమైన కోరిక పెంచుకుంది.—ఆదికాండము 3:6; 1 యోహాను 2:16.

 బైబిల్లోని స్త్రీలు జీవించిన కాలం

  1.  హవ్వ

  2. జలప్రళయం (క్రీ.పూ. 2370)

    1.  శారా

    2.  లోతు భార్య

    3.  రిబ్కా

    4.  లేయా

    5.  రాహేలు

  3. ఐగుప్తు నుండి బయటికి (క్రీ.పూ. 1513)

    1.  మిర్యాము

    2.  రాహాబు

    3.  రూతు

    4.  దెబోరా

    5.  యాయేలు

    6.  దెలీలా

    7.  హన్నా

  4. ఇశ్రాయేలు మొదటి రాజు (క్రీ.పూ. 1117)

    1.  అబీగయీలు

    2.  షూలమ్మీతీ

    3.  యెజెబెలు

    4.  ఎస్తేరు

    5.  మరియ (యేసు తల్లి)

  5. యేసు బాప్తిస్మం (క్రీ.శ. 29)

    1.  మార్త

    2.  మరియ (మార్త, లాజరుల తోబుట్టువు)

    3.  మగ్దలేనే మరియ

  6. యేసు చనిపోయాడు (క్రీ.శ. 33)