కంటెంట్‌కు వెళ్లు

క్రీస్తు రాకడ అంటే ఏమిటి?

క్రీస్తు రాకడ అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 భవిష్యత్తులో భూమ్మీది ప్రజలకు తీర్పు తీర్చడానికి క్రీస్తు వస్తాడని లేఖనాలు చాలాచోట్ల ప్రస్తావిస్తున్నాయి. a ఉదాహరణకు మత్తయి 25:31-33 వచనాల్లో ఇలా ఉంది:

 “తన మహిమతో మనుష్యకుమారుడును [యేసుక్రీస్తు] ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.”

 ఆ తీర్పు, మానవ చరిత్రలో ఇప్పటివరకు కలగని మహా “శ్రమ” కాలంలో జరుగుతుంది. హార్‌మెగిద్దోను యుద్ధంతో ఆ శ్రమ ముగుస్తుంది. (మత్తయి 24:21; ప్రకటన 16:15, 16) ఉపమానంలోని మేకలు, అంటే క్రీస్తు శత్రువులు “నిత్యనాశనమను దండన పొందుదురు.” (2 థెస్సలొనీకయులు 1:9; ప్రకటన 19:11, 15) అయితే గొర్రెలు, అంటే ఆయన నమ్మకమైన సేవకులు “నిత్యజీవము” పొందుతారు.—మత్తయి 25:46.

క్రీస్తు ఎప్పుడు వస్తాడు?

 ‘ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి ... ఏ మనిషీ ... ఎరుగడు’ అని యేసు చెప్పాడు. (మత్తయి 24:36, 42; 25:13) అయితే, తాను వచ్చే కాలాన్ని గుర్తించడానికి మనకు కనిపించే ఒక గుర్తు ఆయన ఇచ్చాడు. అది వివిధ అంశాలతో కూడిన గుర్తు.—మత్తయి 24:3, 7-14; లూకా 21:10, 11.

యేసు కనిపించే శరీరంతో వస్తాడా, కనిపించని శరీరంతో వస్తాడా?

 చనిపోయిన యేసు బ్రతికి వచ్చినప్పుడు, దేవదూతలకుండే శరీరంతో వచ్చాడు, కాబట్టి ఆయన మానవ శరీరంతో రాడు, పరలోక ప్రాణిగానే వస్తాడు. (1 కొరింథీయులు 15:45; 1 పేతురు 3:18) అందుకే, తాను చనిపోవడానికి ముందు యేసు తన అపొస్తలులతో ఇలా చెప్పాడు: “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు.”—యోహాను 14:18.

క్రీస్తు రావడం గురించి సాధారణంగా ఉన్న అపోహలు

 అపోహ: యేసు “ఆకాశ మేఘారూఢుడై” రావడం ప్రజలు చూస్తారని బైబిలు చెప్తుంది కాబట్టి, యేసు రావడం అందరికీ కనిపిస్తుంది.—మత్తయి 24:30.

 వాస్తవం: కంటికి కనిపించని దాని గురించి చెప్పిన చాలా సందర్భాల్లో బైబిలు మేఘాలను ప్రస్తావించింది. (లేవీయకాండము 16:2; సంఖ్యాకాండము 11:25; ద్వితీయోపదేశకాండము 33:26) ఉదాహరణకు, దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదను.” (నిర్గమకాండము 19:9) మోషే నిజానికి దేవుణ్ణి చూడలేదు. అలాగే, క్రీస్తు “మేఘారూఢుడై” వస్తాడంటే, ప్రజలు నిజానికి ఆయనను చూడకపోయినా, ఆయన వచ్చాడని గ్రహిస్తారని అర్థం.

 అపోహ: క్రీస్తు రాకడ గురించి మాట్లాడుతున్న ప్రకటన 1:7 లోని “ప్రతి నేత్రము ఆయనను చూచును” అనే మాటను మామూలుగానే అర్థం చేసుకోవాలి.

 వాస్తవం: బైబిల్లోని “కన్ను,” “చూపు” అనే పదాలను గ్రీకు భాషలో కొన్నిసార్లు మామూలు కంటిచూపు అనే అర్థంతో కాకుండా ‘అర్థం చేసుకోవడం,’ ‘గ్రహించడం’ అనే అర్థాలతో వాడారు. b (మత్తయి 13:13-15; లూకా 19:42; రోమీయులు 15:20, 21; ఎఫెసీయులు 1:17-19) చనిపోయి బ్రతికిన యేసు గురించి మాట్లాడుతూ, ఆయన “సమీపింపరాని తేజస్సులో ... యున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను ... చూడనేరడు” అని బైబిలు చెప్తోంది. (1 తిమోతి 6:16) కాబట్టి, “ప్రతి నేత్రము ఆయనను చూచును” అంటే యేసే దేవుని తీర్పును తీసుకొస్తాడనే విషయాన్ని ప్రజలంతా గ్రహిస్తారని అర్థం.—మత్తయి 24:30.

 అపోహ: 2 యోహాను 7 వ వచనంలోని మాటలు, యేసు మానవ శరీరంతో వస్తాడని చూపిస్తున్నాయి.

 వాస్తవం: ఆ వచనంలో ఇలా ఉంది: “యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.”

 అపొస్తలుడైన యోహాను జీవించిన కాలంలో కొంతమంది, యేసు ఈ భూమ్మీదకు మానవ శరీరంతో మనిషిగా వచ్చాడనే విషయాన్ని అంగీకరించలేదు. వాళ్లను అతీంద్రియ జ్ఞానవాదులు అన్నారు. వాళ్లు చెప్పేవి అబద్ధాలని నిరూపించడానికే యోహాను తన రెండవ ఉత్తరంలోని 7 వ వచనాన్ని రాశాడు.

a చాలా మంది క్రీస్తు రాకడకు సంబంధించి, “రెండో రాకడ”, “రెండో ఆగమనం” వంటి పదాలు వాడతారు, కానీ బైబిలులో అవి ఎక్కడా కనిపించవు.

b ద న్యూ థేయర్స్‌ గ్రీక్‌-ఇంగ్లీష్‌ లెక్సికాన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌లో (1981) 451, 470 పేజీలు చూడండి.