కంటెంట్‌కు వెళ్లు

తమ మీద వేసిన నిందలన్నిటికి యెహోవాసాక్షులు ఎందుకు జవాబు చెప్పరు?

తమ మీద వేసిన నిందలన్నిటికి యెహోవాసాక్షులు ఎందుకు జవాబు చెప్పరు?

అపహాసకులు వేసే ప్రతీ నిందకు, వాళ్లు అనే ప్రతీ మాటకు స్పందించాల్సిన అవసరం లేదని బైబిలు ఇస్తున్న సలహాను యెహోవాసాక్షులు పాటిస్తారు. ఉదాహరణకు, బైబిలు ఇలా చెప్తుంది, “అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును.” (సామెతలు 9:​7, 8; 26:4) ఇతరులు వేసే అబద్ధపు నిందల్ని పట్టించుకొని గొడవకు దిగడం కన్నా, దేవున్ని సంతోషపెట్టడానికే మేము ప్రాముఖ్యతను ఇస్తాం.​—కీర్తన 119:69.

నిజమే, ‘మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి’ సమయం ఉంది. (ప్రసంగి 3: 7) సత్యం తెలుసుకోవాలనే నిజమైన ఆసక్తి ఉన్నవాళ్లకు మేము జవాబు చెప్తాం, కానీ అర్థంపర్థంలేని వాదనలకు మేము దూరంగా ఉంటాం. ఆవిధంగా మేము యేసు అలాగే తొలి క్రైస్తవుల బోధల్ని, ఆదర్శాన్ని పాటిస్తాం.

  • పిలాతు ముందు ఇతరులు తన మీద అన్యాయంగా నింద వేసినప్పుడు యేసు ఏమీ మాట్లాడలేదు. (మత్తయి 27:11-​14; 1 పేతురు 2:​21-​23) అంతేకాదు తనను తాగుబోతని తిండిబోతని నిందించినప్పుడు కూడా యేసు ఏమీ మాట్లాడలేదు. బదులుగా “ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి” అనే సూత్రానికి అనుగుణంగా ఆయన తన ప్రవర్తన బట్టే తానేమిటో ఇతరులకు అర్థమయ్యేలా చేశాడు. (మత్తయి 11:19) అయితే సందర్భం వచ్చినప్పుడు మాత్రం తనను అవమానించిన వాళ్లకు యేసు ధైర్యంగా జవాబిచ్చాడు.—మత్తయి 15:​1-3; మార్కు 3:​22-​30.

    లేనిపోని నిందలు వేసినప్పుడు నిరుత్సాహపడవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “మీరు నా శిష్యులనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ గురించి అబద్ధాలు చెప్తూ మీకు వ్యతిరేకంగా అన్నిరకాల చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.” (మత్తయి 5:​11, 12) అయితే, కొన్ని సందర్భాల్లో నింద వేస్తున్నవాళ్లకు సాక్ష్యమిచ్చే అవకాశాలు తన అనుచరులకు వస్తాయని కూడా ఆయన చెప్పాడు. అప్పుడు, “మీ వ్యతిరేకులందరు కలిసినా ఎదిరించలేని, తిప్పికొట్టలేని జ్ఞానాన్ని, మాటల్ని నేను మీకు ఇస్తాను” అని ఆయన ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు.—లూకా 21:12-​15.

  • వ్యతిరేకులతో అనవసరమైన గొడవలకు దిగొద్దని సలహా ఇస్తూ అలాంటి వాదనలవల్ల “ఏ లాభమూ ఉండదు, అవి వట్టి పనికిమాలినవి” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.​—తీతు 3:9; రోమీయులు 16:17, 18.

  • వీలైతే తమ విశ్వాసం గురించి ప్రశ్నించేవాళ్లకు జవాబు చెప్పమని అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను ప్రోత్సహించాడు. (1 పేతురు 3:​15) అయితే, మాటలకన్నా ప్రవర్తనే చక్కగా జవాబివ్వగలదని పేతురు గుర్తించాడు. ఆయన ఇలా రాశాడు, “మీరు మంచి చేయడం ద్వారా మూర్ఖంగా మాట్లాడే తెలివితక్కువ మనుషుల నోళ్లు మూయించాలి.”​—1 పేతురు 2:​12-​15.