కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహం—దాని ఆరంభం, ఉద్దేశం

వివాహం—దాని ఆరంభం, ఉద్దేశం

“దేవుడైన యెహోవా—నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.”ఆది. 2:18.

పాటలు: 36, 11

1, 2. (ఎ) వివాహ ఏర్పాటు ఎలా మొదలైంది? (బి) వివాహం గురించి మొట్టమొదటి స్త్రీ-పురుషులు ఏమి గ్రహించి ఉంటారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 వివాహం జరగడం సాధారణమైన విషయమే. అయితే వివాహం ఎలా మొదలైంది? దాని ఉద్దేశం ఏమిటి? వీటికి జవాబులు తెలుసుకోవడంవల్ల వివాహం గురించి, అది తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి సరైన అభిప్రాయానికి రాగలుగుతాం. దేవుడు చేసిన మొదటి మనిషి ఆదాము. జంతువులన్నిటికి పేర్లు పెట్టే పనిని దేవుడు అతనికి అప్పగించాడు. అయితే జంతువులన్నిటికీ ఒక జత ఉండడాన్ని ఆదాము గమనించాడు. కానీ, ‘ఆదాముకు సాటియైన సహాయము లేదు.’ కాబట్టి దేవుడు ఆదాముకు, “గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి” స్త్రీని చేశాడు. ఆ తర్వాత ఆమెను ఆదాముకు భార్యగా ఇచ్చాడు. (ఆదికాండము 2:20-24 చదవండి.) ఆ విధంగా దేవుడే వివాహ ఏర్పాటును ప్రారంభించాడు.

2 ఏదెను తోటలో యెహోవా చెప్పిన మాటల్నే చాలా ఏళ్ల తర్వాత యేసు మళ్లీ చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురు.” (మత్త. 19:4, 5) ఆదాము పక్కటెముక నుండి దేవుడు మొట్టమొదటి స్త్రీని చేశాడు కాబట్టి ఆ దంపతులు తమ మధ్య ఎంత సన్నిహిత బంధం ఉందో గ్రహించి ఉంటారు. భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలని గానీ, ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవాలని గానీ యెహోవా ఎన్నడూ కోరుకోలేదు.

వివాహం యెహోవా సంకల్పంలో భాగం

3. వివాహం ముఖ్య ఉద్దేశం ఏమిటి?

3 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు, అతను ఆమెతో సంతోషంగా ఉన్నాడు. ఆమె అతనికి తోడుగా, సహకారిగా ఉండేది. వాళ్లిద్దరూ భార్యాభర్తలుగా తమ జీవితాన్ని ఆనందించి ఉండేవాళ్లు. (ఆది. 2:18) భూమంతా మనుషులతో నిండాలనే ఉద్దేశంతో యెహోవా వివాహాన్ని ఏర్పాటు చేశాడు. (ఆది. 1:28) కొడుకులు, కూతుళ్లు తమ అమ్మానాన్నల్ని ప్రేమిస్తారు కానీ కొంతకాలానికి పెళ్లి చేసుకుని వాళ్లను విడిచిపెట్టి తమకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలా మనుషులు భూమంతా విస్తరించి, దాన్ని పరదైసుగా మారుస్తారు.

4. మొట్టమొదటి వివాహానికి ఏమి జరిగింది?

4 అయితే ఆదాముహవ్వలు యెహోవాకు అవిధేయత చూపించినప్పుడు ఆ మొట్టమొదటి వివాహబంధంలో ఘోరమైన సమస్యలు వచ్చాయి. “మంచి చెడ్డల తెలివినిచ్చు” చెట్టు పండును తింటే ప్రత్యేకమైన జ్ఞానం వస్తుందని చెప్పి “ఆది సర్పమైన” సాతాను హవ్వను మోసం చేశాడు. మంచేదో చెడేదో సొంతగా నిర్ణయించుకునేంత జ్ఞానం వస్తుందని కూడా చెప్పాడు. అయితే ఆమె దానిగురించి ఆదాముతో మాట్లాడకుండా ఆ పండును తినడం ద్వారా అతని శిరసత్వాన్ని అగౌరవపరిచింది. అదేవిధంగా హవ్వ ఇచ్చిన పండును తిని ఆదాము దేవునికి అవిధేయత చూపించాడు.—ప్రక. 12:9; ఆది. 2:9, 16, 17; 3:1-6.

5. ఆదాముహవ్వలు యెహోవాకు చెప్పిన జవాబు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

5 పండు ఎందుకు తిన్నారని యెహోవా వాళ్లను ప్రశ్నించినప్పుడు, తప్పును హవ్వ మీద మోపుతూ ఆదాము ఇలా అన్నాడు, “నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిని.” అలాగే హవ్వ, పాము తనను మోసం చేసిందని చెప్పింది. (ఆది. 3:12, 13) ఆదాముహవ్వలు తాము చేసిన తప్పును ఒప్పుకోకుండా కుంటిసాకులు చెప్పారు. అవిధేయత చూపించినందుకు యెహోవా ఆ తిరుగుబాటుదారులకు తీర్పుతీర్చాడు. నిజానికి వాళ్లు మనకు ఓ హెచ్చరికగా ఉన్నారు. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే యెహోవాకు విధేయత చూపించాలి, వాళ్లు చేసిన పనులకు వాళ్లే బాధ్యత వహించాలి.

6. ఆదికాండము 3:15లోని ప్రవచనాన్ని వివరించండి.

6 ఏదెను తోటలో సాతాను ఆదాముహవ్వలను మోసం చేసినప్పటికీ, భవిష్యత్తు విషయంలో యెహోవా మనుషులకు ఓ నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ గురించి బైబిల్లోని మొట్టమొదటి ప్రవచనంలో చదువుతాం. (ఆదికాండము 3:15 చదవండి.) ‘స్త్రీ సంతానం,’ సాతానును నాశనం చేస్తాడని ఆ ప్రవచనం చెప్తుంది. పరలోకంలో సేవచేస్తున్న ఎంతోమంది నమ్మకమైన అదృశ్య ప్రాణులకు దేవునితో సన్నిహిత సంబంధం ఉంది. వాళ్లు యెహోవాకు భార్యలా ఉన్నారు. ఆయన వాళ్లలో ఒకరిని సాతానును నాశనం చేయడానికి పంపిస్తాడు. మొట్టమొదటి దంపతులు కోల్పోయిన జీవితాన్ని విధేయులైన మనుషులు ఆనందించేందుకు “ఆ సంతానం” మార్గం సుగమం చేస్తాడు. కాబట్టి యెహోవా ఉద్దేశించినట్లే విధేయులైన మనుషులకు భూమ్మీద నిత్యం జీవించే అవకాశం ఉంది.—యోహా. 3:16.

7. (ఎ) ఆదాముహవ్వల తిరుగుబాటు వివాహాల మీద ఎలాంటి ప్రభావం చూపించింది? (బి) భార్యాభర్తలు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

7 ఆదాముహవ్వల తిరుగుబాటు, వాళ్ల వివాహబంధం మీదే కాదు ఆ తర్వాత జరిగిన అన్నీ వివాహాల మీద ప్రభావం చూపించింది. ఉదాహరణకు హవ్వ, ఆమె కూతుళ్లందరూ పిల్లల్ని కనేటప్పుడు తీవ్రమైన ప్రసవవేదన అనుభవించాలి. స్త్రీలకు భర్తమీద “వాంఛ” కలుగుతుంది. భర్తలు భార్యల మీద అధికారం చెలాయిస్తారు, ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లు క్రూరంగా ప్రవర్తిస్తారు కూడా. (ఆది. 3:16) కానీ భర్తలు తమ కుటుంబాల్ని ప్రేమగా చూసుకోవాలని, భార్యలు తమ భర్తలకు లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. (ఎఫె. 5:33) క్రైస్తవ భార్యాభర్తలు కలిసికట్టుగా పనిచేస్తే చాలా సమస్యల్ని తప్పించుకోవచ్చు.

ఆదాము కాలంనుండి జలప్రళయం వరకు జరిగిన వివాహాలు

8. ఆదాము కాలంనుండి జలప్రళయం వరకు జరిగిన వివాహాల చరిత్ర చెప్పండి.

8 ఆదాముహవ్వలు చనిపోకముందు వాళ్లకు కొడుకులు, కూతుళ్లు ఉన్నారు. (ఆది. 5:4) వాళ్ల పెద్దకొడుకు కయీను తన కుటుంబంలో ఒక స్త్రీని పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత కయీను కొడుకైన లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లిచేసుకున్నాడు, అలా ఇద్దర్ని పెళ్లిచేసుకున్న వాళ్లలో అతనే మొదటివాడు. (ఆది. 4:17, 19) ఆదాము కాలంనుండి నోవహు కాలం వరకు కేవలం కొద్దిమందే యెహోవాను ఆరాధించారు. ఆ నమ్మకమైన ఆరాధకుల్లో హేబెలు, హనోకు, నోవహు-అతని కుటుంబసభ్యులు ఉన్నారు. నోవహు కాలంలో, “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి” అని బైబిలు చెప్తుంది. కానీ అది సృష్టి విరుద్ధం. వాళ్లకు పుట్టిన కొడుకులు భారీకాయులు, పైగా క్రూరంగా ప్రవర్తించేవాళ్లు. వాళ్లనే బైబిలు నెఫీలులు అని పిలుస్తుంది. ఆ కాలంలో, ‘నరుల చెడుతనం భూమిమీద గొప్పదని, వారి హృదయ తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడుగా’ ఉండేదని బైబిలు చెప్తుంది.—ఆది. 6:1-5.

9. నోవహు కాలంలోని చెడ్డ వాళ్లందరినీ యెహోవా ఏమి చేశాడు? దాన్నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

9 భూమ్మీద ఉన్న చెడ్డ ప్రజలందరినీ నాశనం చేయడానికి జలప్రళయం తీసుకొస్తానని యెహోవా చెప్పాడు. “నీతిని ప్రకటించిన నోవహు” రాబోతున్న జలప్రళయం గురించి ప్రజల్ని హెచ్చరించాడు. (2 పేతు. 2:5) కానీ అతను చెప్పింది వాళ్లు వినలేదు. ఎందుకంటే రోజువారీ పనులు, పెళ్లిళ్లు చేసుకుంటూ వాళ్లు తీరిక లేకుండా ఉన్నారు. యేసు మనం జీవిస్తున్న కాలాన్ని నోవహు కాలంతో పోల్చాడు. (మత్తయి 24:37-39 చదవండి.) నేడు కూడా ఈ దుష్టలోక అంతం రాకముందే మనం ప్రకటిస్తున్న రాజ్యసువార్తను చాలామంది వినట్లేదు. అయితే నోవహు జలప్రళయం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? యెహోవా దినం దగ్గర్లో ఉందనే విషయాన్ని మర్చిపోయేంతగా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటివాటి మీదే మనం మనసుపెట్టకూడదు.

జలప్రళయం నుండి యేసు కాలం వరకు జరిగిన వివాహాలు

10. (ఎ) చాలా సంస్కృతుల్లో ఏది సర్వసాధారణమైపోయింది? (బి) అబ్రాహాము-శారాలు భార్యాభర్తలుగా ఎలాంటి చక్కని ఆదర్శాన్ని ఉంచారు?

10 నోవహుకు, అతని ముగ్గురు కొడుకులకు ఒక్కొక్క భార్యే ఉండేది. అయితే జలప్రళయం తర్వాత చాలామంది పురుషులకు ఒకరికన్నా ఎక్కువమంది భార్యలు ఉండేవాళ్లు. చాలా సంస్కృతుల్లో లైంగిక అనైతికత సర్వసాధారణమైపోయింది, మతపరమైన ఆచారాల్లో కూడా అది భాగంగా ఉండేది. అబ్రాహాము-శారా కనానుకు వెళ్లినప్పుడు, వివాహ ఏర్పాటుపట్ల ఏమాత్రం గౌరవంలేని అనైతిక ప్రజల మధ్య జీవించాల్సి వచ్చింది. అందుకే యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాల్ని నాశనం చేశాడు. కానీ అబ్రాహాము మాత్రం వాళ్లలా కాదు. అతను ఓ మంచి కుటుంబ పెద్ద, శారా కూడా తన భర్తకు లోబడుతూ చక్కని ఆదర్శాన్ని ఉంచింది. (1 పేతురు 3:3-6 చదవండి.) అబ్రాహాము తన కొడుకైన ఇస్సాకుకు యెహోవా ఆరాధకురాలినే ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఇస్సాకు కూడా తన కొడుకైన యాకోబుకు అలానే చేశాడు. ఆ యాకోబు కొడుకులే ఇశ్రాయేలు 12 గోత్రాలకు పూర్వీకులయ్యారు.

11. మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల్ని ఎలా సంరక్షించింది?

11 తర్వాత, యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో ఓ ఒప్పందం చేసుకున్నాడు. వివాహ ఆచారాలకు, ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడానికి సంబంధించి ధర్మశాస్త్రంలో యెహోవా వాళ్లకు కొన్ని నియమాలు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు అబద్ధ ఆరాధకులను పెళ్లి చేసుకోకూడదనే నియమాన్ని ఇవ్వడం ద్వారా ఆయన వాళ్లను ఆధ్యాత్మికంగా సంరక్షించాడు. (ద్వితీయోపదేశకాండము 7:3, 4 చదవండి.) అంతేకాదు భార్యాభర్తల మధ్య పెద్దపెద్ద సమస్యలు వచ్చినప్పుడు సహాయం చేయడానికి పెద్దల్ని ఏర్పాటు చేశాడు. భార్యాభర్తల మధ్య నమ్మకద్రోహం, ఈర్ష్యలు, అనుమానాలు తలెత్తినప్పుడు చేయాల్సిన వాటిగురించి కూడా ధర్మశాస్త్రంలో ఉంది. విడాకులు తీసుకోవడాన్ని ధర్మశాస్త్రం అనుమతించినప్పటికీ దానికి సంబంధించి కొన్ని షరతులు అందులో ఉండేవి. ఉదాహరణకు, పురుషునికి తన భార్యలో ఏదైనా “అవలక్షణం” కనిపిస్తేనే విడాకులు ఇవ్వవచ్చు. (ద్వితీ. 24:1, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఆ “అవలక్షణం” కిందకు ఏమేమి వస్తాయో బైబిలు వివరించట్లేదు గానీ, భర్త చిన్నచిన్న పొరపాట్లను సాకుగా చూపించి భార్యకు విడాకులు ఇవ్వకూడదు.—లేవీ. 19:18.

మీ భర్తకు/భార్యకు నమ్మకద్రోహం చేయకండి

12, 13. (ఎ) మలాకీ కాలంలోని యూదులు భార్య విషయంలో ఎలా ప్రవర్తించేవాళ్లు? (బి) నేడు ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి వ్యభిచారం చేస్తే అతనికి ఏమి జరుగుతుంది?

12 మలాకీ ప్రవక్త జీవించిన కాలంలో, చాలామంది యూదులు తమ భార్యలకు విడాకులు ఇవ్వడానికి రకరకాల కుంటిసాకులు చెప్పేవాళ్లు. యౌవనంలో ఉన్న స్త్రీలను లేదా యెహోవాను ఆరాధించని స్త్రీలను పెళ్లిచేసుకోవడానికే అలా చేసేవాళ్లు. యేసు కాలంలోని యూదులు కూడా “ఏదో ఒక కారణం” చెప్పి తమ భార్యలకు విడాకులు ఇచ్చేవాళ్లు. (మత్త. 19:3, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌వర్షన్‌) కానీ వాళ్లు చేసినదాన్ని యెహోవా అసహ్యించుకున్నాడు.—మలాకీ 2:13-16 చదవండి.

13 నేడు కూడా యెహోవా సేవకులు తమ భర్తకు/భార్యకు నమ్మకద్రోహం చేయడం తప్పు. నిజానికి దేవుని సేవకులు అలా నమ్మకద్రోహానికి పాల్పడడం చాలా అరుదు. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న భర్త/భార్య వ్యభిచారం చేసి, వాళ్లను పెళ్లి చేసుకోవడానికి విడాకులు తీసుకున్నారు అనుకోండి. అలా చేసినవాళ్లు పశ్చాత్తాపం చూపించకపోతే సంఘాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచడానికి వాళ్లను బహిష్కరిస్తారు. (1 కొరిం. 5:11-13) అయితే బహిష్కరించబడిన వ్యక్తి తిరిగి సంఘంలోకి చేర్చుకోబడాలంటే “మారుమనస్సునకు తగిన ఫలములు” చూపించాలి. (లూకా 3:8; 2 కొరిం. 2:5-10) ఆ వ్యక్తి తిరిగి చేర్చుకోబడడానికి నిర్దిష్టమైన సమయం ఏమీ లేదు. వాస్తవానికి, తప్పుచేసిన వ్యక్తి తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నానని నిరూపించుకోవడానికి, సంఘంలోకి తిరిగి చేర్చుకోబడడానికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టవచ్చు. అయితే తిరిగి చేర్చుకోబడిన తర్వాత కూడా ఆ వ్యక్తి “దేవుని న్యాయ పీఠము ఎదుట” నిలబడాల్సి ఉంటుంది.—రోమా. 14:10-12; కావలికోట నవంబరు 15, 1979 సంచికలోని (ఇంగ్లీషు) 31-32 పేజీలు చూడండి.

క్రైస్తవుల మధ్య జరిగే వివాహాలు

14. ధర్మశాస్త్రం ఏ ఉద్దేశాన్ని నెరవేర్చింది?

14 ఇశ్రాయేలీయులు 1500 కన్నా ఎక్కువ సంవత్సరాలు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. అది వాళ్లకు ఎన్నో విధాలుగా సహాయం చేసింది. ఉదాహరణకు, కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కావాల్సిన సూత్రాలు అందులో ఉండేవి. అంతేకాదు ధర్మశాస్త్రం వాళ్లను మెస్సీయ దగ్గరకు నడిపించింది. (గల. 3:23, 24) అయితే యేసు మరణంతో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఆ తర్వాత దేవుడు ఓ కొత్త ఏర్పాటు చేశాడు. (హెబ్రీ. 8:6) కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని నియమాలు ఇప్పుడు అమలులో లేవు.

15. (ఎ) వివాహం విషయంలో క్రైస్తవులు ఏ ప్రమాణాన్ని పాటించాలి? (బి) ఓ క్రైస్తవుడు విడాకులు తీసుకోవాలనుకుంటే ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి?

15 ఓ రోజు పరిసయ్యులు, వివాహం గురించి యేసును ఒక ప్రశ్న అడిగారు. అయితే భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం యెహోవా ఏర్పాటు చేసిన ప్రమాణం కాకపోయినా మోషే ధర్మశాస్త్రం ప్రకారం విడాకులు తీసుకోవడాన్ని ఆయన అనుమతించాడని యేసు జవాబిచ్చాడు. (మత్త. 19:6-8) వివాహానికి సంబంధించి దేవుడు ఏదెను తోటలో ఏర్పాటు చేసిన ప్రమాణాన్నే ఇప్పుడు క్రైస్తవులు పాటించాలని యేసు జవాబులో తెలుస్తోంది. (1 తిమో. 3:2-3, 12) భార్యాభర్తలు “ఏకశరీముగా” కలసి ఉండాలనేదే యెహోవా ప్రమాణం. అలా కలిసి ఉండడానికి దేవుని మీదున్న ప్రేమ, భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమే సహాయం చేస్తుంది. వ్యభిచారం కాకుండా వేరే ఏ ఇతర కారణంతో విడాకులు తీసుకున్నా మళ్లీ పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉండదు. (మత్త. 19:9) లైంగిక అనైతికతకు పాల్పడి పశ్చాత్తాపం చూపించిన తమ వివాహజతను క్షమించాలని భర్త/భార్య నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు, లైంగిక అనైతికతకు పాల్పడిన తన భార్య గోమెరును హోషేయ ప్రవక్త క్షమించాడు. అలాగే పశ్చాత్తాపం చూపించిన ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా క్షమించాడు. (హోషే. 3:1-5) అయితే, తమ భర్త/భార్య వ్యభిచారం చేశారని తెలిసినా వాళ్లతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తే ఆ తప్పును క్షమించినట్లే. ఇక వాళ్లిద్దరూ లేఖనాధారంగా విడాకులు తీసుకోవడానికి వీలుపడదు.

16. ఒంటరిగా ఉండేవాళ్ల గురించి యేసు ఏమి చెప్పాడు?

16 లైంగిక అనైతికత కారణం తప్ప మరే కారణంతో కూడా నిజక్రైస్తవులు విడాకులు తీసుకోకూడదని యేసు చెప్పాడు. ఆ తర్వాత ఆయన పెళ్లిచేసుకోకుండా ఉండే ‘బహుమానం’ గురించి చెప్తూ, ‘ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉండగలరో వాళ్లను అలాగే ఉండనివ్వండి’ అని అన్నాడు. (మత్త. 19:10-12, NW) ఎలాంటి ఆటంకం లేకుండా యెహోవాను సేవించాలనే ఉద్దేశంతో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. అలాంటివాళ్లను మనం మెచ్చుకోవాలి.

17. పెళ్లి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవడానికి ఓ క్రైస్తవునికి ఏది సహాయం చేస్తుంది?

17 ఒంటరిగా ఉండాలా లేక పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవడానికి ఓ వ్యక్తికి ఏది సహాయం చేస్తుంది? తాము ఒంటరిగా ఉండగలమో లేదో ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఒంటరిగా ఉండమని ప్రోత్సహించినప్పటికీ ఇలా అన్నాడు, ‘లైంగిక పాపాలు ఎక్కువౌతున్నాయి కాబట్టి, ప్రతీ పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతీ స్త్రీకి సొంత భర్త ఉండాలి. కానీ నిగ్రహం లేకపోతే పెళ్లిచేసుకోండి. లైంగిక కోరికలతో రగిలిపోవడంకన్నా పెళ్లిచేసుకోవడమే మంచిది.’ పెళ్లి చేసుకుంటే ఓ వ్యక్తి తనకున్న లైంగిక కోరికల వల్ల హస్తప్రయోగం లేదా లైంగిక అనైతికతకు పాల్పడడం వంటివి చేయకుండా ఉండగలుగుతాడు. అయితే తమకు పెళ్లి చేసుకునేంత వయసు ఉందో లేదో పెళ్లికానివాళ్లు ఆలోచించుకోవాలి. పౌలు ఇంకా ఇలా అన్నాడు, ‘తన లైంగిక కోరికల్ని అణచుకోలేకపోతున్నానని ఓ పెళ్లికాని వ్యక్తికి అనిపిస్తే, మరి ముఖ్యంగా అతనికి యౌవనప్రాయం దాటిపోయుంటే, అలాంటి పరిస్థితిలో అతను పెళ్లిచేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు; అతను పాపం చేసినట్టు కాదు.’ (1 కొరిం. 7:2, 9, 36, 37, NW; 1 తిమో. 4:1-3) అయితే యౌవనంలో సహజంగా కలిగే బలమైన లైంగిక కోరికల్నిబట్టి మాత్రమే పెళ్లిచేసుకోవాలని అనుకోకూడదు. ఎందుకంటే పెళ్లితో వచ్చే బాధ్యతల్ని నిర్వర్తించేంత పరిణతి ఆ వయసులో ఉండకపోవచ్చు.

18, 19. (ఎ) క్రైస్తవులు ఎవర్ని పెళ్లి చేసుకోవాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

18 బాప్తిస్మం తీసుకుని యెహోవాను పూర్ణహృదయంతో ప్రేమించేవాళ్లనే క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలి. అలా పెళ్లిచేసుకున్న వాళ్ల మధ్య జీవితాంతం కలిసి బ్రతకాలన్నంత ప్రేమ ఉండాలి. అలా “ప్రభువునందు మాత్రమే” పెళ్లిచేసుకోవాలనే సలహాను పాటించిన వాళ్లను యెహోవా దీవిస్తాడు. (1 కొరిం. 7:39) అంతేకాదు బైబిలు సలహాల్ని పాటిస్తే వాళ్ల వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.

19 నేడు మనం “అంత్యదినములలో” జీవిస్తున్నాం. పైగా వివాహ జీవితాన్ని సంతోషంగా గడపడానికి కావాల్సిన లక్షణాలు చాలామంది ప్రజల్లో లేవు. (2 తిమో. 3:1-5) ఎన్ని సవాళ్లు చుట్టుముట్టినా, వివాహ జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఏ విలువైన బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. భార్యాభర్తలిద్దరూ నిత్యజీవ మార్గంలో నడుస్తూ ఉండడానికి ఆ సూత్రాలు సహాయం చేస్తాయి.—మత్త. 7:13, 14.