కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బ్రతకడం ఇక నావల్ల కాదని అనిపించినప్పుడు

బ్రతకడం ఇక నావల్ల కాదని అనిపించినప్పుడు

బ్రెజిల్‌కి చెందిన ఆడ్రీయానా ఇలా చెప్తోంది: “ఆ ఆలోచనలు పదేపదే నన్ను వేధించేవి. దాంతో చనిపోవాలనుకున్నాను.”

చనిపోవాలి అని అనుకునేంతగా మీరెప్పుడైనా నిరాశపడ్డారా? అయితే మీరు ఆడ్రీయానా భావాల్ని అర్థం చేసుకోగలరు. ఒకప్పుడు ఆమె తీవ్రమైన ఆందోళనతో, నిరాశానిస్పృహలతో బాధపడేది. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతుందని డాక్టరు చెప్పాడు.

జపాన్‌కి చెందిన కావోరూ పరిస్థితి కూడా గమనించండి. అతను అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రుల్ని చూసుకునేవాడు. అతనిలా అంటున్నాడు: “ఆ సమయంలో పనివల్ల తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను. ఆకలి ఉండేది కాదు, సరిగ్గా నిద్ర పట్టేది కాదు. చావే నా సమస్యలకు పరిష్కారం అనుకున్నాను.”

నైజీరియాకు చెందిన ఓజెబోడీ ఇలా అన్నాడు: “నాకెప్పుడూ ఎంత బాధగా ఉండేదంటే, నేను ఏడ్చేసేవాణ్ణి. ఎలా చనిపోవాలా అని ఆలోచించేవాణ్ణి.” సంతోషకరమైన విషయం ఏమిటంటే ఓజెబోడీ, కావోరూ, ఆడ్రీయానా ఆత్మహత్య చేసుకోలేదు. కానీ ప్రతీ సంవత్సరం లక్షలమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.

సహాయం ఎక్కడ దొరుకుతుంది?

ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్లలో చాలామంది మగవాళ్లే. వాళ్లలో ఎక్కువశాతం ఇతరుల సహాయం అడగడానికి సిగ్గుపడేవాళ్లే. రోగులకు వైద్యుడు అవసరం అని యేసు చెప్పాడు. (లూకా 5:31) కాబట్టి మీకు అలాంటి ఆలోచనలు వస్తే, దయచేసి ఇతరుల సహాయం అడగడానికి సిగ్గుపడకండి. డిప్రెషన్‌తో బాధపడే చాలామంది వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. ఓజెబోడీ, కావోరూ, ఆడ్రీయానా కూడా వైద్య సహాయం తీసుకొని ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.

డిప్రెషన్‌తో బాధపడేవాళ్లకు డాక్టర్లు మందుల ద్వారా లేదా కౌన్సెలింగ్‌ ద్వారా లేదా రెండింటి ద్వారా చికిత్స చేయవచ్చు. అలాంటివాళ్లకు తమను అర్థం చేసుకుని, ఓపిగ్గా శ్రద్ధ చూపించే కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు అవసరం. అందరికన్నా మంచి స్నేహితుడు యెహోవా దేవుడే, ఆయన తన వాక్యమైన బైబిలు ద్వారా ఎంతగానో సహాయం చేస్తున్నాడు.

శాశ్వత పరిష్కారం ఉందా?

తరచూ, డిప్రెషన్‌కు గురైనవాళ్లు ఎక్కువకాలం పాటు వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది, తమ అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు డిప్రెషన్‌తో పోరాడుతుంటే, ఓజెబోడీలా సంతోషకరమైన భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చు. అతనిలా చెప్తున్నాడు, “నేను యెషయా 33:24⁠లోని మాటలు నెరవేరే రోజు కోసం, అంటే భూమ్మీద ఏ ఒక్కరూ ‘నాకు దేహంలో బాలేదు’ అని చెప్పే పరిస్థితి ఉండని రోజు కోసం ఎదురుచూస్తున్నాను.” ఓజెబోడీలా, దేవుని వాగ్దానం నుండి ఊరట పొందండి. దేవుడు “నొప్పి” ఇక ఉండని “కొత్త భూమి” వస్తుందని మాటిచ్చాడు. (ప్రకటన 21:1, 4) అంటే మానసిక, భావోద్వేగ సమస్యలు కూడా ఇక ఉండవని దానర్థం. బాధపెట్టే ఆలోచనలు మీకు ఇక ఎప్పటికీ రావు. మిమ్మల్ని బాధపెట్టే ఆలోచనలు ‘మరువబడతాయి, జ్ఞాపకానికి రావు.’—యెషయా 65:17.