కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

జీవిత ఉద్దేశం

జీవిత ఉద్దేశం

మనుషులకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనం రాయగలం, బొమ్మలు వేయగలం, కొత్త వాటిని తయారు చేయగలం, జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నల గురించి ఆలోచించగలం: ఈ విశ్వం ఎందుకు ఉంది? మనం ఎలా వచ్చాం? జీవిత ఉద్దేశం ఏంటి? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

వాటి సమాధానాలు చాలా కష్టమని ఆ ప్రశ్నల్ని కొంతమంది పట్టించుకోరు. ఇంకొంతమంది జీవితం అనుకోకుండా జరిగిన పరిణామం కాబట్టి ఆ ప్రశ్నల గురించి ఆలోచించడంలో అర్థం లేదు అని అంటారు. “ఏ దేవుడు లేడు, ఏ సంకల్పం లేదు,” అని బయాలజీ, హిస్టరీ ప్రొఫెసర్‌ అయిన విలియమ్‌ ప్రొవైన్‌ చెప్తున్నారు. ఆయన ఇంకా: “నీతినియమాలకు అసలు ఆధారం లేదు, జీవితానికి అసలు ఉద్దేశం లేదు” అని చెప్తున్నారు.

కానీ కొంతమంది అలాంటి ప్రమాదకరమైన అభిప్రాయాన్ని ఒప్పుకోలేరు. ఎందుకంటే ఈ విశ్వం ఎంతో స్పష్టమైన, ఉన్నతమైన, క్రమబద్ధంగా ఉన్న నియమాల ద్వారా నడుస్తుందని వాళ్లు గ్రహించారు. ప్రకృతిలో ఉన్న అద్భుతమైన నమూనాలను చూసి కొంతమంది కొన్ని వస్తువులను తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇంత సంశ్లిష్టత ఉండి ఎంతో బాగా పనిచేసే ఈ నమూనాలను చూస్తున్నప్పుడు ఒక తెలివైన సృష్టికర్త ఉన్నాడని, అవి ఏ నిర్దేశం లేకుండా అనుకోకుండా రాలేదని ప్రతిరోజూ ఎదురయ్యే అనుభవాలు వాళ్లకు చూపిస్తున్నాయి.

ఇలాంటి కారణాలే కొంతమంది పరిణామవాదులు వాళ్ల అభిప్రాయాల గురించి ఇంకొకసారి ఆలోచించుకునేలా చేశాయి. ఈ రెండు ఉదాహరణలు గమనించండి.

న్యూరోసర్జన్‌ డా. ఆలిక్సై మార్నవ్‌. “నేను చదువుకున్న స్కూళ్లలో నాస్తికవాదాన్ని, పరిణామ సిద్ధాంతాన్ని నేర్పించేవాళ్లు, ఎవరైనా దేవుణ్ణి నమ్మితే వాళ్లను తెలివితక్కువ వాళ్లుగా చూసేవాళ్లు” అని అతను అంటున్నాడు. 1990వ సంవత్సరం నుండి అతని ఆలోచనలు మారడం మొదలైంది.

“నేను ఎప్పుడూ ప్రతి విషయానికి ఉన్న రుజువులను చూడడానికి ప్రయత్నిస్తాను, మనిషి మెదడు గురించి కూడా అలాగే ఆలోచించాను. ఈ అద్భుతమైన అవయవాన్ని విశ్వంలోనే అత్యంత సంశ్లిష్టమైన నిర్మాణం అనడంలో సందేహం లేదు. కానీ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించి చనిపోవడానికే ఈ మెదడు ఉందా? అందులో అర్థం లేదు, అది సమంజసం కాదు. అందుకే నేను ఇలా ఆలోచించడం మొదలుపెట్టాను: ‘మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? మన జీవితానికి ఉన్న ఉద్దేశం ఏమిటి?’ ఎంతో జాగ్రత్తగా పరిశోధన చేసిన తర్వాత, ఖచ్చితంగా సృష్టికర్త ఉన్నాడనే నిర్ణయానికి నేను వచ్చాను” అని అతను వివరిస్తున్నాడు.

జీవితానికి ఉన్న ఉద్దేశం తెలుసుకోవడానికి ఆలిక్సై చేసిన అన్వేషణ అతను బైబిల్ని పరిశీలించేలా చేసింది. తర్వాత అతను అనుకునేది తప్పు అని నిరూపించడానికి నాస్తికవాది, డాక్టర్‌ అయిన అతని భార్య కూడా బైబిల్ని స్టడీ చేసింది. కానీ ఇప్పుడు వాళ్లు ఇద్దరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటో బైబిలు చెప్తున్న వాటిని అర్థం చేసుకున్నారు.

ప్లాస్మా సైన్‌టిస్ట్‌ డా. హ్వాబి యిన్‌. హ్వాబి యిన్‌ ఫిజిక్స్‌ చదివి, ఎన్నో సంవత్సరాలు ప్లాస్మా గురించి పరిశోధన చేసింది. పదార్థాల నాల్గవ స్థితిగా పరిగణించబడుతున్న ప్లాస్మాలో (సూర్యుడిలో ఉంటుంది) ఎక్కువగా ఎలక్ట్రాన్‌లు, పాజిటివ్‌ అయాన్‌లు ఉంటాయి.

“సైన్‌టిస్టులు సహజ ప్రక్రియలను అధ్యయనం చేసిన ప్రతిసారీ అవి ఉన్నతమైన క్రమంలో ఉన్నాయని, ఇది స్పష్టమైన నియమాల ఫలితమని తెలుసుకుంటాం” అని ఆమె చెప్తుంది. ‘ఈ నియమాలు ఎలా వచ్చాయి?’ అని ఆశ్చర్యపోతుంటాను. ‘వంట చేసుకునే చిన్న మంటను కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్‌ చేయాలి, అలాంటిది సూర్యుణ్ణి కంట్రోల్‌ చేయడానికి ఎవరు ఉన్నారు?’ కొంతకాలానికి, బైబిల్లో ఉన్న మొదటి మాటలు నాకు చాలా నమ్మదగినవిగా అనిపించాయి: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.”—ఆదికాండము 1:1.

నిజంగా సైన్స్‌ “ఎలా” అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మెదడు కణాలు ఎలా పని చేస్తాయి? సూర్యుడి నుండి వెలుగు, వేడి ఎలా వస్తాయి? లాంటి ప్రశ్నలు. కానీ ఆలిక్సై, హ్వాబి తెలుసుకున్నట్లు బైబిలు అంతకన్నా ముఖ్యమైన “ఎందుకు” అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ విశ్వం ఎందుకు ఉంది? అది నియమాల ద్వారా ఎందుకు నడుస్తుంది? మనం ఎందుకు ఉన్నాం? లాంటి ప్రశ్నలు.

భూమి గురించి బైబిలు ఇలా చెప్తుంది: ‘ఆయన [దేవుడు] భూమిని . . . నిరాకారముగానుండునట్లు సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.’ (యెషయా 45:18) అవును, దేవుడు భూమిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ఆ ఉద్దేశానికి భవిష్యత్తు గురించిన మన నిరీక్షణకు ఎలాంటి సంబంధం ఉందో తర్వాత ఆర్టికల్‌ చూపిస్తుంది.