కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3

ఏదైనా తట్టుకునే శక్తి ఎలా వస్తుంది?

ఏదైనా తట్టుకునే శక్తి ఎలా వస్తుంది?

ఏదైనా తట్టుకోవడం అంటే ఏంటి?

ఏదైనా తట్టుకునే శక్తి ఉన్నవాళ్లు అడ్డంకులను అధిగమించి, నిరాశానిస్పృహలను వదిలేసి ముందుకెళ్తారు. ఈ సామర్థ్యం అనుభవంతో వస్తుంది. పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు పడుతూ లెగుస్తూ నడవడం నేర్చుకుంటారు. అలాగే జీవితంలో అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగలకపోతే వాళ్లు విజయం సాధించడం నేర్చుకోలేరు.

దేన్నైనా తట్టుకొని నిలబడడం ఎందుకు ముఖ్యం?

ఓటమి, ప్రతికూల పరిస్థితులు లేదా విమర్శలు ఎదురైనప్పుడు కొంతమంది పిల్లలు నిరుత్సాహపడిపోతారు. ఇంకొంతమంది పూర్తిగా చేతులెత్తేస్తారు. అయితే, వాళ్లు ఈ కిందున్న విషయాలను అర్థం చేసుకోవాలి:

  • మనం చేసే ప్రతీ పనిలో ప్రతీసారి విజయం సాధించడం సాధ్యం కాదు.—యాకోబు 3:2.

  • ప్రతీఒక్కరూ జీవితంలో ఎప్పుడోకప్పుడు కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందే.—ప్రసంగి 9:11.

  • తప్పుల్ని సరిచేసేవాళ్లు ఉంటేనే దేన్నైనా బాగా నేర్చుకుంటాం.—సామెతలు 9:9.

పిల్లలకు దేన్నైనా తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉంటే, వాళ్లు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కుంటారు.

ఏదైనా తట్టుకోవడం పిల్లలకు ఎలా నేర్పించవచ్చు?

మీ పిల్లవాడికి ఓటమి ఎదురైనప్పుడు . . .

మంచి సూత్రాలు: “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును.”—సామెతలు 24:16.

ఏ సమస్య పెద్దదో ఏ సమస్య చిన్నదో తెలుసుకోగలిగేలా మీ పిల్లలకు నేర్పించండి. ఉదాహరణకు, మీ పిల్లవాడు స్కూల్లో ఒక పరీక్షలో ఫెయిల్‌ అయితే ఏం చేస్తాడు? “నేను ఏదీ సరిగ్గా చేయలేను!” అని చేతులెత్తేస్తాడా?

మీ పిల్లలకు దేన్నైనా తట్టుకోవడం నేర్పించాలంటే, ఈసారి ఆ పని ఇంకా బాగా చేయగలిగేలా ప్రణాళిక వేసుకోవడానికి సహాయం చేయండి. అలా చేస్తే, బాధపడుతూ కూర్చొనే బదులు వాళ్లు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో నేర్చుకుంటారు.

అదే సమయంలో, మీ పిల్లల సమస్యలను మీరే పరిష్కరించకండి. దానికి బదులు, మీ పిల్లలు వాళ్ల సమస్యలను పరిష్కరించుకునే మార్గాలను వాళ్లే తెలుసుకునేలా సహాయం చేయండి. మీరు వాళ్లని ఇలా అడగవచ్చు, “నువ్వు నేర్చుకుంటున్న సబ్జెక్ట్‌ నీకు ఇంకా బాగా అర్థం కావడానికి నువ్వు ఏం చేయవచ్చు?”

ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు . . .

మంచి సూత్రాలు: “రేపు మీకు ఏమౌతుందో మీకు తెలియదు.”—యాకోబు 4:14.

జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్లే ఉండదు. ఈ రోజు ధనవంతుడిగా ఉన్న అతను రేపు పేదవాడైపోవచ్చు. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్న అతను రేపు జబ్బు పడవచ్చు. “వేగం గలవాళ్లు అన్నిసార్లూ పందెంలో గెలవరు, బలవంతులు అన్నిసార్లూ యుద్ధంలో గెలవరు, . . . ఎందుకంటే అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు వాళ్లందరికీ ఎదురౌతాయి” అని బైబిలు చెప్తుంది.—ప్రసంగి 9:11, NW.

తల్లిగా లేదా తండ్రిగా మీ పిల్లల్ని ప్రమాదం నుండి కాపాడడానికి మీరు చేయగలిగినదంతా చేస్తారు. కానీ వాస్తవం ఏంటంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్య నుండి మీరు మీ పిల్లల్ని కాపాడలేరు.

నిజమే, మీ పిల్లలు ఉద్యోగం పోవడం లేదా ఆర్థికంగా దెబ్బతినడం లాంటి సమస్యలు ఎదుర్కునేంత పెద్దవాళ్లు కాకపోవచ్చు. అయినప్పటికీ, ఇతర సమస్యలను, అంటే ఒక మంచి స్నేహితుడు దూరమవడం లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోవడం లాంటి వాటిని తట్టుకునేలా మీరు మీ పిల్లలకు సహాయం చేయవచ్చు. *

మీ పిల్లలకు మంచి ఉద్దేశంతో ఎవరైనా సలహాలు ఇచ్చినప్పుడు . . .

మంచి సూత్రాలు: “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని . . . అంగీకరించుము.”—సామెతలు 19:20.

మంచి ఉద్దేశంతో ఎవరైనా మనల్ని సరిచేస్తే అది బాధపెట్టినట్లు కాదు. నిజానికి, అలాంటి సలహాలు మన పనుల్ని లేదా మనస్తత్వాన్ని సరిచేసుకోవడానికి సహాయపడతాయి.

దిద్దుబాటును తీసుకోవడం మీ పిల్లలకు నేర్పిస్తే, మీరూ మీ పిల్లలు ప్రయోజనం పొందుతారు. జాన్‌ అనే ఒక తండ్రి ఇలా అంటున్నాడు, “పిల్లల్ని ఎప్పుడూ వాళ్లు చేసిన తప్పుల నుండి కాపాడుతూ ఉంటే, వాళ్లు ఎప్పటికీ నేర్చుకోరు. వాళ్లు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు తెచ్చుకుంటూనే ఉంటారు, మీరు మీ జీవితమంతా వాళ్ల వెంట పడుతూ వాళ్లు సృష్టించిన సమస్యల్ని తీరుస్తూనే ఉంటారు. దానివల్ల అటు తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకు ఇద్దరికీ జీవితం చాలా కష్టమైపోతుంది.”

మార్చుకోవాల్సిన వాటి గురించి మంచి ఉద్దేశంతో ఎవరైనా చెప్పినప్పుడు, దాని నుండి ప్రయోజనం పొందేలా మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? స్కూల్లో లేదా ఇంకెక్కడైనా మీ పిల్లల్ని సరిదిద్దినప్పుడు, అది చాలా అన్యాయం అని అనకుండా జాగ్రత్తపడండి. బదులుగా మీరు మీ పిల్లవాణ్ణి ఇలా అడగవచ్చు:

  • “నిన్ను ఎందుకు సరిచేసి ఉంటారు అనుకుంటున్నావ్‌?”

  • “నువ్వెలా మెరుగవ్వవచ్చు?”

  • “ఇంకోసారి ఇలాంటి పరిస్థితే వస్తే నువ్వేమి చేస్తావు?”

మంచి ఉద్దేశంతో ఎవరైనా మీ పిల్లల తప్పుల్ని ఎత్తి చూపిస్తే దానివల్ల మేలే జరుగుతుంది, ఇప్పుడే కాదు పెద్దయ్యాక కూడా వాళ్లకు అది మేలు చేస్తుందని గుర్తుపెట్టుకోండి.

^ పేరా 21 జూలై 1, 2008 కావలికోట (ఇంగ్లీష్‌) సంచికలో “హెల్ప్‌ యువర్‌ చైల్డ్‌ కోప్‌ విత్‌ గ్రీఫ్‌” అనే ఆర్టికల్‌ చూడండి.