కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | భార్యాభర్తలు

ఎలా సర్దుకుపోవాలి?

ఎలా సర్దుకుపోవాలి?

సమస్య

మీకు, మీ భర్త లేదా భార్యకు ఒక విషయంలో వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీ ముందు మూడు అవకాశాలుంటాయి.

  1. నేను చెప్పిందే జరగాలి అని మీరు పట్టుపట్టవచ్చు.

  2. మౌనంగా మీ భర్త లేదా భార్య ఇష్టాన్ని ఒప్పుకోవచ్చు.

  3. మీరిద్దరు సర్దుకుపోవచ్చు.

‘సర్దుకుపోవడం నాకిష్టం లేదు, ఎందుకంటే ఇద్దరికీ కావాలనుకున్నది దొరకదు’ అని మీకనిపించవచ్చు.

సరిగ్గా సర్దుకుపోతే ఇద్దరికీ సంతోషం ఉంటుంది. కానీ ఎలా సర్దుకుపోవాలో తెలుసుకునేముందు దాని గురించి కొన్ని విషయాలు తెలిసుండాలి.

ఏమి తెలిసుండాలి?

ఇద్దరూ కలిసికట్టుగా ఉండాలి. పెళ్లికి ముందు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం మీకు అలవాటై ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీ సొంత ఇష్టాయిష్టాలకన్నా మీ ఇద్దరి అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. దాని వల్ల ఏదో నష్టపోయాం అనుకోకుండా వచ్చే లాభాల గురించి ఆలోచించండి. “ఒక్కరిచ్చే పరిష్కారం కన్నా ఇద్దరి అభిప్రాయాలు కలిసినప్పుడు వచ్చే పరిష్కారం చాలా మంచిది” అని ఆలెగ్జాండ్రా అంటుంది.

సర్దుకుపోవాలంటే ముందే మనసులో ఒక అభిప్రాయం పెట్టుకోకూడదు. “మీ భర్త లేదా భార్య చెప్పినవన్నీ, వాళ్లకు నచ్చినవన్నీ ఒప్పుకోవాలని లేదు కానీ నిజాయితీగా ఎందుకు అలా చెప్తున్నారో ఆలోచించాలి” అని భార్యాభర్తలకు సలహాలిచ్చే ప్రొఫెసర్‌ జాన్‌ ఎమ్‌. గాట్‌మెన్‌ రాశారు. “మీ భర్త లేదా భార్య ఒక సమస్య గురించి మాట్లాడుతుంటే మీరు చేతులు కట్టుకుని కూర్చుని ‘కాదు, కుదరదు’ అన్నట్టుగా తల ఊపుతున్నా లేదా అలా మనసులో అనుకుంటున్నా సమస్య పరిష్కారం అవ్వదు.” a

సర్దుకుపోడానికి త్యాగం చేయాలి. “నేను చెప్పిందే చెయ్యాలి, నాకే అంతా తెలుసు” అని ఎప్పుడూ అనే వాళ్లతో ఉండటం ఎవరికైనా కష్టమే. ఒకరికోసం ఒకరు త్యాగం చేసే మనస్తత్వం ఉంటే బాగుంటుంది. “కొన్నిసార్లు నా భర్తని సంతోషపెట్టడం కోసం ఆయన చెప్పినట్లు వింటాను, కొన్నిసార్లు ఆయన కూడా నేను చెప్పింది చేస్తారు,” అని జూన్‌ అనే ఆమె అంటుంది. “వివాహం అంటే అలానే ఉండాలి, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కానీ ఎప్పుడూ తీసుకోవడమే కాదు.”

ఏమి చేయవచ్చు

చక్కగా మొదలుపెట్టండి. మాట్లాడడం చక్కగా మొదలుపెడితే చివరి వరకు అలాగే మాట్లాడుకోవచ్చు. మొదట్లోనే బాధ పెట్టేలా మాట్లాడితే, ఇద్దరూ కలిసి ప్రశాంతంగా ఒక పరిష్కారానికి రావడం కష్టమవుతుంది. అందుకే బైబిల్లో ఒక సలహా ఉంది: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:12) ఇలాంటి మంచి లక్షణాలు ఉంటే గొడవ పడకుండా ఒక పరిష్కారానికి వస్తారు.—మంచి సలహా: కొలొస్సయులు 4:6.

ఇద్దరికీ నచ్చిన విషయాలతో మొదలు పెట్టండి. సర్దుకుపోవడానికి మీరు ఎంత ప్రయత్నిస్తున్నా మీ మాటలు గొడవలా మారుతున్నాయంటే, మీరిద్దరూ మీ అభిప్రాయాల్లో ఉన్న తేడాలనే ఎక్కువగా చూస్తున్నారేమో. కాబట్టి ఇద్దరికీ నచ్చే విషయాలనే చూడండి. ఇద్దరికీ ఏవి నచ్చుతాయో ఎలా తెలుసుకోవచ్చు:

ఇద్దరూ చెరొక పేపరు మీద రెండు వరుసలుగా రాసుకోండి. మొదటి వరుసలో మీరు మాట్లాడుకునే వాటిలో చాలా ముఖ్యం అనిపించిన విషయాలు రాయండి. రెండవ వరుసలో సర్దుకుపోవచ్చు అనిపించిన విషయాలు రాయండి. ఇద్దరూ రాసుకున్న వాటి గురించి మాట్లాడుకోండి. మీరు రాసిన చాలా విషయాలు ఇద్దరికీ ఇష్టమైనవేనని మీకు అర్థమవుతుంది. అప్పుడు సర్దుకుపోవడం పెద్ద కష్టంగా ఉండదు. ఒకవేళ మీరు రాసుకున్నవి కలవకపోయినా, రాసి పెట్టుకోవడం వల్ల మీ ఇద్దరికీ సమస్య ఎక్కడ వస్తుందో అర్థమవుతుంది.

ఇద్దరూ మాట్లాడుకుంటేనే పరిష్కారం వస్తుంది. కొన్ని సమస్యలు సులువుగానే పరిష్కారమవుతాయి. కానీ పెద్దపెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రం భార్యాభర్తలిద్దరూ కలిసి కూర్చుని ఇద్దరి అభిప్రాయాల గురించి మాట్లాడుకుంటే సొంత అభిప్రాయాల కన్నా మంచి పరిష్కారం వస్తుంది. అలా ఇద్దరి మధ్య బంధం కూడా పెరుగుతుంది.—మంచి సలహా: ప్రసంగి 4:9.

మార్చుకోడానికి ముందుండండి. “మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను” అని బైబిల్లో ఉంది. (ఎఫెసీయులు 5:33) ప్రేమ, గౌరవాలు ఉన్నప్పుడు భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాన్ని ఒకరు తెలుసుకుంటారు, అభిప్రాయాన్ని మార్చుకుంటారు కూడా. “కొన్ని చేయడం మీకు అంతగా ఇష్టం ఉండదు కానీ మీ భర్త లేదా భార్య కోసం చేస్తారు, తర్వాత వాటిని చేయడం మంచిదేనని మీకూ అనిపిస్తుంది, చేయడం నచ్చుతుంది కూడా” అని కామ్రాన్‌ అన్నాడు.—మంచి సలహా: ఆదికాండము 2:18. ◼ (g14-E 12)

a ద సెవెన్‌ ప్రిన్సిపిల్స్‌ ఫర్‌ మేకింగ్‌ మ్యారేజ్‌ వర్క్‌ పుస్తకంలో నుండి తీసుకున్నారు.