కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకృతి విపత్తులతో దేవుడు మానవులను శిక్షిస్తాడా?

ప్రకృతి విపత్తులతో దేవుడు మానవులను శిక్షిస్తాడా?

మా పాఠకుల ప్రశ్న

ప్రకృతి విపత్తులతో దేవుడు మానవులను శిక్షిస్తాడా?

ప్రకృతి విపత్తులతో దేవుడు అమాయక ప్రజలను శిక్షించడు. ఆయనెప్పుడూ అలా చేయలేదు, అలా చేయడు కూడా. ఎందుకు? ఎందుకంటే “దేవుడు ప్రేమాస్వరూపి” అని 1 యోహాను 4:8లో బైబిలు చెబుతోంది.

దేవుడు ప్రతీదీ ప్రేమతోనే చేస్తాడు. ప్రేమ ఎప్పుడూ అమాయక ప్రజలను బాధపెట్టదు, ఎందుకంటే “ప్రేమ పొరుగువానికి కీడుచేయదు” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 13:​10) “దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు” అని యోబు 34:⁠12లో బైబిలు చెబుతోంది.

నిజమే, మన కాలంలో ‘గొప్ప భూకంపాల’ వంటివి సంభవిస్తాయని బైబిలు ముందే చెప్పింది. (లూకా 21:​11) వాతావరణ వివరాలు తెలియజేసే వ్యక్తి తుఫాను వస్తుందని ముందే హెచ్చరించినంత మాత్రాన తుఫాను రావడానికి ఆయన ఎలాగైతే బాధ్యుడు కాదో అలాగే ప్రకృతి విపత్తులవల్ల కలిగే నష్టానికి యెహోవా దేవుడు బాధ్యుడుకాదు. ప్రకృతి విపత్తులవల్ల మానవులకు కలిగే బాధలకు దేవుడు బాధ్యుడు కాకపోతే మరి ఎవరు బాధ్యులు?

‘లోకమంతయు’ అపవాదియైన సాతాను అనే ‘దుష్టుని యందున్నది’ అని బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. (1 యోహాను 5:​19) సాతాను మానవజాతి ప్రారంభంలో తిరుగుబాటు చేసినప్పటినుండి ఇప్పటివరకూ నరహంతకుడిగా ఉన్నాడు, అంటే మానవుల మరణానికి కారణమవుతూనే ఉన్నాడు. (యోహాను 8:​44) అతడు మానవ ప్రాణాన్ని ఏమాత్రం విలువైనదిగా ఎంచడంలేదు. అతడు ఏది చేసినా స్వార్థంతోనే చేస్తాడు కాబట్టి, ప్రపంచాన్నంతటినీ అలాంటి వైఖరితోనే నింపేశాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ లోకంలోని స్వార్థ​పరుల మూలంగా అమాయక ప్రజలు, ప్రకృతివల్ల కలిగే లేదా మానవులవల్ల కలిగే విపత్తులు ఎదురయ్యే ప్రాంతాల్లో జీవించాల్సి వస్తోంది. (ఎఫెసీయులు 2:⁠2; 1 యోహాను 2:​16) కాబట్టి, మానవులు ఎదుర్కొంటున్న కొన్ని విపత్తులకు స్వార్థపరులైన మానవులే బాధ్యులు. (ప్రసంగి 8:⁠9) అదెలా?

అనేక విపత్తులకు మానవులే కొంతవరకు బాధ్యులు. ఉదాహరణకు అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌ నగరాన్ని హరికేన్‌ ముంచెత్తడంతో అక్కడి నివాసులు, వెనిజ్యులాలో సముద్రతీరానవున్న కొండచరియలు విరిగిపడడంవల్ల విధ్వంసమైపోయిన ఇళ్ళ నివాసులు ఎదుర్కొన్న కష్టాలను పరిశీలించండి. ఆ సంఘటనల్లోనేకాక, అలాంటి ఇతర సంఘటనల్లో కూడా ప్రకృతిసహజమైన గాలి, వర్షం వంటివి పెను ముప్పుగా పరిణమించడానికి, మానవులకు ప్రకృతి సంఘటనలపట్ల సరైన అవగాహన లేకపోవడం, నిర్మాణ ప్రణాళికలు సరిగ్గా లేకపోవడం, హెచ్చరికలను పెడ​చెవిన పెట్టడం, అధికారుల పొరపాట్లే ఎక్కువగా కారణం.

బైబిలు కాలాల్లో సంభవించిన ఒక ప్రమాదం గురించి పరిశీలించండి. యేసు కాలంలో ఒక గోపురం కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. (లూకా 13:⁠4) ఆ ప్రమాదం మానవ పొరపాటువల్ల, ‘కాలవశముచేత, అనూహ్యంగా’ జరిగే సంఘటనలవల్ల లేదా ఆ రెండిటి వల్ల సంభవించివుండవచ్చు, అంతేకానీ అది దేవుడు తీర్పుతీర్చడంవల్ల సంభవించింది మాత్రం ఖచ్చితంగా కాదు.​—⁠ప్రసంగి 9:​11.

ముందెప్పుడైనా దేవుడు విపత్తులను తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు, అయితే అవి ప్రకృతిసహజంగా లేదా మానవులవల్ల సంభవించిన విపత్తుల్లాంటివి కావు. అవి మంచివాళ్ళను రక్షించి, చెడ్డవాళ్ళను శిక్షించాలనే ప్రత్యేక సంకల్పంతో తీసుకొచ్చిన విపత్తులు, అవెంతో అరుదుగానే సంభవించాయి. దానికి రెండు ఉదాహరణలేమిటంటే, పూర్వీకుడైన నోవహు కాలంలో భూవ్యాప్తంగా వచ్చిన జల​ప్రళయం, లోతు కాలంలో సొదొమ, గొమొఱ్ఱా నగరాల నాశనం. (ఆదికాండము 6:⁠7-9, 13; 18:​20-32; 19:⁠24) దేవుడు తీర్చిన ఆ తీర్పులు పశ్చాత్తాపం చూపించని దుష్టులను తుడిచిపెట్టి, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నవారిని కాపాడాయి.

నిజానికి, ప్రకృతి విపత్తులవల్ల కలిగే బాధనంతటినీ తీసివేసే సామర్థ్యం, అలా తీసివేయాలనే కోరిక, అలా చేయడానికి తగిన శక్తి యెహోవా దేవునికి ఉన్నాయి. కీర్తన 72:⁠12 దేవుడు నియమించిన రాజైన యేసుక్రీస్తు గురించి ఇలా చెబుతోంది: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.” (w 08 5/1)