కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

వివాహబంధానికి కట్టుబడి ఉండడం

వివాహబంధానికి కట్టుబడి ఉండడం

ఆమె ఇలా అంటోంది: “ఈ మధ్య నా భర్త మైకెల్‌ నన్నంతగా పట్టించుకోవడం లేదని, మా పిల్లలతో కూడా అంత సరదాగా ఉండడం లేదని గమనించాను. * మేము ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పటినుండి ఆయనలో ఈ మార్పు వచ్చింది. ఆయన కంప్యూటర్‌లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని నాకు అనుమానం వచ్చింది. ఒకరోజు రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత దీనిగురించి ఆయనను నిలదీస్తే, ఇంటర్నెట్‌లో అశ్లీల దృశ్యాలుండే సైట్లను చూస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నేను కుప్పకూలిపోయాను. నాకిలా జరిగిందని నేను నమ్మలేకపోతున్నాను. ఆయనమీద నాకు పూర్తిగా నమ్మకం లేకుండా పోయింది. దీనికి తోడు నా తోటి ఉద్యోగి నా మీద ఆసక్తి చూపించడం మొదలుపెట్టాడు.”

ఆయన ఇలా అంటున్నాడు: “కొన్నిరోజుల క్రితం నా భార్య మారియా మా కంప్యూటర్‌లో నేను పెట్టుకున్న ఒక చిత్రాన్ని కనిపెట్టి నన్ను నిలదీసింది. ఇంటర్నెట్‌లో అశ్లీల దృశ్యాలుండే సైట్లను నేను తరచూ చూస్తానని ఒప్పుకున్నప్పుడు ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. నేను సిగ్గుతో తలెత్తుకోలేకపోయాను, తప్పుచేశాననే భావంతో కృంగిపోయాను. నా భార్యతో నాకిక సంబంధం తెగిపోతుందని భయపడ్డాను.”

మైకెల్‌ మారియాల మధ్య ఏర్పడిన పరిస్థితికి కారణం ఏమైవుంటుందని మీరనుకుంటున్నారు? అసలు సమస్య మైకెల్‌ అశ్లీల చిత్రాలు చూడడంతోనే వచ్చిందని మీరనుకోవచ్చు. కానీ మైకెల్‌ గుర్తించినట్లుగా ఈ చెడ్డ అలవాటు ఒక పెద్ద సమస్యకు సూచన, అదేమిటంటే వివాహబంధానికి కట్టుబడి ఉండకపోవడం. * మైకెల్‌ మారియాలు పెళ్ళి చేసుకున్నప్పుడు, జీవితమంతా ప్రేమాసంతోషాలతో హాయిగా ఉంటామనుకున్నారు. అయితే చాలామంది దంపతుల్లాగే వారుకూడా వివాహబంధానికి కట్టుబడి ఉండడం రానురాను తగ్గిపోయి, అంతకంతకూ ఒకరికొకరు దూరమయ్యారు.

సంవత్సరాలు గడిచేకొద్దీ మీకు మీ భార్యపట్ల లేదా భర్తపట్ల ఉన్న ప్రేమ తగ్గుతున్నట్లు మీకనిపిస్తోందా? ఆ పరిస్థితిని మార్చుకోవాలని మీరనుకుంటున్నారా? అలా అయితే ఈ మూడు ప్రశ్నలకు మీరు సమాధానం తెలుసుకోవాలి. అవి, వివాహబంధానికి కట్టుబడి ఉండడం అంటే అర్థమేమిటి? అలా కట్టుబడి ఉండడంలో ఎదురయ్యే సవాళ్ళేమిటి? మీ వివాహ భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉండాలంటే మీరేమి చేయవచ్చు?

కట్టుబడి ఉండడం అంటే ఏమిటి?

వివాహబంధానికి కట్టుబడి ఉండడం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు? అది తమ బాధ్యత అని అనుకున్నప్పుడే దానికి కట్టుబడి ఉండవచ్చని చాలామంది చెబుతారు. ఉదాహరణకు ఒక జంట తమ పిల్లల భవిష్యత్తు పాడవకూడదనో లేదా వివాహాన్ని ప్రారంభించిన దేవుడు అది తమకిచ్చిన బాధ్యత అనో దానికి కట్టుబడి ఉంటారు. (ఆదికాండము 2:​22-24) అవి మంచి ఉద్దేశాలే, దంపతుల మధ్య సమస్యలు వచ్చినప్పుడు వారు విడిపోకుండా ఉండడానికి అవి సహాయం చేస్తాయి. కానీ భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే వారు కేవలం ఒకరిపట్ల ఒకరికి బాధ్యత ఉంది అని అనుకుంటేనే సరిపోదు.

భార్యాభర్తలు ఎంతో సంతోషంతో సంతృప్తితో ఉండాలని యెహోవా దేవుడు పెళ్ళి ఏర్పాటు చేశాడు. భర్త ‘తన భార్యయందు సంతోషించాలని,’ భార్య తన భర్తను ప్రేమించాలని, భర్త తన సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లే తనను ప్రేమిస్తున్నాడన్న సంతోషం భార్యకు ఉండాలని యెహోవా కోరుకున్నాడు. (సామెతలు 5:18; ఎఫెసీయులు 5:28) ఇద్దరి మధ్య అలాంటి అనుబంధం ఏర్పడాలంటే ఆ దంపతులిద్దరూ ఒకరిమీద ఒకరు నమ్మకంతో ఉండడం నేర్చుకోవాలి. అలాగే వారిద్దరూ జీవితాంతం స్నేహితులుగా ఉండడానికి కృషిచేయడం కూడా చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తలిద్దరూ తమ వివాహబంధానికి మరింతగా కట్టుబడి ఉండాలంటే ఒకరిపై ఒకరు నమ్మకాన్ని సంపాదించుకొని, మంచి స్నేహితులుగా ఉండడానికి కృషిచేయాలి. అలాచేస్తే, బైబిలు వర్ణిస్తున్నట్లు, వారిద్దరూ వేర్వేరు వ్యక్తులే అయినప్పటికీ “ఏకశరీరము” అన్నంతగా ఒకరికొకరు దగ్గరవుతారు.—మత్తయి 19:5.

కాబట్టి కట్టుబడి ఉండడాన్ని పటిష్ఠమైన ఇంటిని కడుతున్నప్పుడు ఇటుకలను కలిపివుంచే మోర్టార్‌తో పోల్చవచ్చు. ఆ మోర్టారును ఇసుక, సిమెంట్‌, నీళ్ళు కలిపి చేస్తారు. అలాగే పెళ్ళి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలంటే బాధ్యత, నమ్మకం, స్నేహం మూడూ అవసరం. అయితే ఆ అనుబంధాన్ని ఏది పాడుచేయవచ్చు?

కట్టుబడి ఉండడంలో సవాళ్ళేమిటి?

కట్టుబడి ఉండాలంటే ఎంతో కృషి, త్యాగం అవసరం. మీ భర్తను లేదా మీ భార్యను సంతోషపెట్టడానికి మీరు మీ సొంత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టాలి. ఎదుటివారి ఇష్టాయిష్టాల ప్రకారం చేయడం, అంటే ‘నాకేంటి లాభం?’ అని ఆలోచించకుండా ఇతరుల కోసం ఏదైనా చేయడమనేది ఈ రోజుల్లో అందరికీ ఇష్టముండదు. కొంతమందైతే అలా చేయడం చిన్నతనమని కూడా అనుకుంటారు. కానీ మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నాకు తెలిసినంతలో ఎంతమంది స్వార్థపరులు తమ వివాహ జీవితంలో సంతోషంగా ఉంటున్నారు?’ ఎవరూ అలాలేరనే సమాధానమే రావచ్చు. ఎందుకు? సాధారణంగా స్వార్థపరులు త్యాగాలు చేయాల్సివస్తే, ప్రత్యేకంగా వాళ్ళు చేసిన చిన్న చిన్న త్యాగాలకు వెంటనే ప్రతిఫలం దొరక్కపోతే తమ వివాహబంధానికి కట్టుబడి ఉండరు. భార్యాభర్తలు, పెళ్ళికి ముందు ఎంత గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ ఒకరికొకరు కట్టుబడి ఉండకపోతే రానురాను వాళ్ళ మధ్య సంబంధం చెడిపోవచ్చు.

వివాహ జీవితం సవ్యంగా సాగాలంటే చాలా కష్టపడాలన్నది నిజమని బైబిలు ఒప్పుకుంటోంది. “పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు,” అలాగే “పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 7:​33, 34) బాధకలిగించే విషయమేమిటంటే, మామూలుగా నిస్వార్థంగా ఉండే భార్యాభర్తలు కూడా కొన్నిసార్లు ఒకరిబాధను మరొకరు అర్థం చేసుకోరు, తమ భర్త లేదా భార్య చేసిన త్యాగాలకు విలువివ్వరు. భార్యాభర్తలిద్దరూ ఒకరిలోని మంచిని మరొకరు గుర్తించలేకపోతే “శరీరసంబంధమైన శ్రమలు” ఇంకా ఎక్కువవుతాయి.​—⁠1 కొరింథీయులు 7:⁠28.

మీ వివాహ జీవితంలో కష్టాలను తట్టుకోవాలన్నా, పరిస్థితులు బాగున్నప్పుడు ఆనందించాలన్నా ఆ బంధం కలకాలం నిలిచేదని మీరు జ్ఞాపకముంచుకోవాలి. అలాంటి ఆలోచన మీ మనసులో నాటుకోవాలంటే మీరేమి చేయవచ్చు? మీ భార్య లేదా భర్త మీకు కట్టుబడి ఉండేలా మీరెలా ప్రోత్సహించవచ్చు?

మీ వివాహ బంధాన్ని ఎలా పటిష్ఠం చేసుకోవచ్చు?

అలా చేయడానికి ముఖ్యంగా దేవుని వాక్యమైన బైబిలు ఇస్తున్న సలహాలను వినయంగా పాటించాలి. అలా పాటిస్తే మీకూ మీ వివాహజతకూ ‘ప్రయోజనము కలుగుతుంది.’ (యెషయా 48:​17) మీరు చేయగలవాటిలో కేవలం రెండు విషయాలను పరిశీలించండి.

1. మీ వివాహ జీవితానికి ప్రాముఖ్యతనివ్వండి.

‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఫిలిప్పీయులు 1:​9, 10) భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారన్నదాన్ని దేవుడు చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుతాడు. తన భార్యకు విలువిచ్చే భర్తను దేవుడు విలువైనవాడిగా చూస్తాడు. అలాగే తన భర్తను గౌరవించే భార్య “దేవుని దృష్టికి మిగుల విలువగలది.”​—⁠1 పేతురు 3:​1-4, 7.

మీ వివాహ బంధం మీకెంత ప్రాముఖ్యమైనది? ఒక విషయం మీకు ఎంత ప్రాముఖ్యమైనదైతే మీరు దానికోసం అంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘పోయిన నెలలో కేవలం నా భార్యతో లేదా భర్తతో గడపడానికి ఎంత సమయాన్ని కేటాయించాను? మనమిప్పటికీ మంచి స్నేహితులమే అని భరోసా ఇవ్వడానికి నేను ప్రత్యేకంగా ఏమి చేశాను?’ మీరు చాలా తక్కువ సమయాన్ని కేటాయించినా లేక అసలు సమయాన్ని కేటాయించకపోయినా మీరు వివాహ బంధానికి కట్టుబడి ఉన్నారని నమ్మడం మీ వివాహ జతకు కష్టమవుతుంది.

మీరు మీ వివాహబంధానికి కట్టుబడి ఉన్నారని మీ భార్య లేదా భర్త నమ్ముతున్నారా? అది మీరెలా తెలుసుకోవచ్చు?

ఇలా చేసి చూడండి: ఒక పేపరు మీద డబ్బు, ఉద్యోగం, వివాహ జీవితం, వినోదం, స్నేహితులు అని రాయండి. మీ భార్య లేదా భర్త ఈ ఐదింటిలో దేనికి ఏ స్థానమిస్తున్నారని మీరనుకుంటున్నారో రాయండి. మీ గురించి వారేమనుకుంటున్నారో వారిని కూడా అలాగే రాయమనండి. పూర్తయిన తర్వాత ఒకరు రాసింది మరొకరు చూడండి. మీరు వివాహ జీవితానికి సరిపడేంత సమయాన్ని కేటాయించడం లేదనీ, ఇంటికివచ్చేసరికి బాగా అలసిపోయి ఓపిక లేకుండా ఉంటున్నారనీ మీ భార్య లేదా మీ భర్త అనుకుంటే మీ మధ్య అనుబంధాన్ని పటిష్ఠం చేసుకోవడానికి ఎలాంటి మార్పులు చేసుకోవడం అవసరమో వారితో చర్చించండి. ఇంకా మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘ఆమె/ఆయన ప్రాముఖ్యమైనవిగా ఎంచే విషయాల పట్ల నేను ఆసక్తి పెంచుకోవడానికి ఏమి చేయవచ్చు?’

2. ఏ రకంగానూ నమ్మకద్రోహం చేయకండి.

“ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని యేసుక్రీస్తు అన్నాడు. (మత్తయి 5:​28) వివాహ భాగస్వామితో కాక మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వివాహబంధానికి చాలా గట్టి దెబ్బ తగులుతుంది, అది విడాకులు తీసుకోవడానికి ఆధారమని బైబిలు చెబుతోంది. (మత్తయి 5:​32) నిజానికి, ఒక వ్యక్తి వ్యభిచారం చేయడానికి చాలాకాలం ముందే అతని మనసులో తప్పుడు కోరికలు మొదలవుతాయని యేసు చెప్పిన ఆ మాటలు చూపిస్తున్నాయి. తప్పుడు కోరికలు మనసులో ఉంచుకోవడం కూడా ఒక విధమైన నమ్మకద్రోహమే.

మీరు మీ వివాహానికి కట్టుబడి ఉండాలంటే అశ్లీల చిత్రాలు చూడకూడదని గట్టిగా నిర్ణయించుకోండి. అశ్లీల చిత్రాలు చూడడం గురించి ఎంతోమంది ఏమి చెప్పినా, అలా చూడడం వివాహ బంధానికి హానిచేస్తుంది. ఒక భార్య తన భర్త చూసేవాటి గురించి చెబుతూ తన భావాలను ఎలా వ్యక్తం చేస్తోందో గమనించండి, “అశ్లీల చిత్రాలు చూడడం మన వైవాహిక జీవితాన్ని రసవత్తరం చేస్తుందని నా భర్త అంటాడు. కానీ అది నేనెందుకూ పనికిరానని, నేనతనికి సరిపోనని అనుకునేలా చేస్తుంది. అతను వాటిని చూస్తుంటే నేను ఏడ్చి ఏడ్చి నిద్రపోతాను.” ఇతను తన వివాహ బంధాన్ని పటిష్ఠపర్చుకుంటున్నాడా లేక దానికి హానిచేస్తున్నాడా? తన భార్య వివాహబంధానికి కట్టుబడి ఉండడం సులభమయ్యేలా చేస్తున్నాడా? ఆమెను తన ఆప్తురాలిగా చూస్తున్నాడా?

నమ్మకస్థుడైన యోబు ‘తన కన్నులతో నిబంధన చేసుకొని’ తన వివాహబంధానికి, దేవునికి కట్టుబడి ఉన్నానని చూపించాడు. ఆయన ‘కన్యకను చూడకూడదని’ నిర్ణయించుకున్నాడు.’ (యోబు 31:⁠1) యోబు చేసినట్లే మీరూ ఎలా చేయవచ్చు?

అశ్లీల చిత్రాలను చూడకూడదని నిర్ణయించుకోవడంతో పాటు తమ వివాహజత కాని వారికి అవసరమైన దానికన్నా ఎక్కువ దగ్గరవ్వకుండా జాగ్రత్తపడాలి. సరదా కోసం ఇతర స్త్రీపురుషులపై ఆసక్తి ఉన్నట్లు మాట్లాడినంత మాత్రాన వివాహబంధానికి వచ్చిన నష్టమేమీలేదని చాలామంది అనుకుంటారన్నది నిజం. కానీ బైబిలు ఇలా హెచ్చరిస్తుంది, “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీయా 17:⁠9) మీ హృదయం మిమ్మల్ని మోసం చేసిందా? మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను ఎవరిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాను, నా భార్య/భర్త పైనా లేక మరొకరి పైనా? ఏదైనా మంచి వార్త ఉంటే ఎవరికి ముందు చెప్తాను నా భార్య/భర్తకా లేక మరొకరికా? ఇతర స్త్రీ/పురుషునితో మరీ అంత చనువుగా ఉండవద్దని ఒకవేళ నా భార్య/భర్త చెప్తే నేనేమి చేస్తాను? కోపగించుకుంటానా లేక మార్పు చేసుకోవడానికి ఇష్టపడతానా?

ఇలా చేసి చూడండి: మీకు మీ భాగస్వామిపై కాక మరొకరిపై ఆసక్తి కలుగుతున్నట్లు అనిపిస్తే వారికి దగ్గరవకుండా జాగ్రత్తపడండి, ఉద్యోగ స్థలంలో వాళ్ళతో కలిసి పనిచేయవలసి వచ్చినప్పుడు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడండి. మీ భార్య/భర్తతో పోలిస్తే ఆమె/అతడు మెరుగ్గా ఉన్నారని మీరనుకుంటున్నవాటి గురించి అదే పనిగా ఆలోచించకండి. దానికి బదులు మీ భార్య/భర్తలో ఉన్న మంచి లక్షణాల గురించే ఎక్కువగా ఆలోచించండి. (సామెతలు 31:​29) పెళ్ళికి ముందు మీ భాగస్వామిని ఎందుకంతగా ఇష్టపడ్డారో ఒక్కసారి గుర్తుచేసుకోండి. ‘నా భాగస్వామి ఇప్పుడు ఆ లక్షణాలను నిజంగానే పోగొట్టుకున్నారా, లేక నేనే వాటిని గమనించలేకపోతున్నానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

చొరవ తీసుకోండి

ముందు చెప్పిన మైకెల్‌ మారియాలు వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి సలహా అడగాలని నిర్ణయించుకున్నారు. సలహా అడగడం ఆరంభం మాత్రమే. వారు తమ సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించుకునేందుకు సహాయం తీసుకోవడానికి ఇష్టపడ్డారు. అలా తమ వివాహబంధానికి కట్టుబడి ఉండడానికీ, వైవాహిక జీవితాన్ని సంతోషదాయకం చేసుకునేలా కృషిచేయడానికీ ఇష్టపడుతున్నామని స్పష్టంగా చూపించారు.

మీ సంసారం సాఫీగా సాగుతున్నా ఒడుదుడుకులున్నా మీరు మీ వివాహాన్ని సంతోషదాయకం చేసుకోవడానికే ఇష్టపడుతున్నారని మీ వివాహజతకు తెలియాలి. మీరలా ఇష్టపడుతున్నారని మీ జతను ఒప్పించడానికి అవసరమయ్యే సరైనవన్నీ చేయండి. అలా చేయడం మీకిష్టమేనా? (w08 11/1)

^ పేరా 3 పేర్లు మార్చబడ్డాయి.

^ పేరా 5 ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ అశ్లీల చిత్రాలు చూసిన పురుషుని గురించి చెబుతున్నప్పటికీ అలాచేసే స్త్రీలు కూడా తాము వివాహబంధానికి కట్టుబడి ఉండడం లేదని చూపిస్తారు.

మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి . . .

  •  ను నా భార్య/భర్తతో ఎక్కువ సమయం గడపడానికి ఏ సర్దుబాట్లు చేసుకోవాలి?

  • నేను మా వివాహబంధానికి కట్టుబడి ఉన్నానని నా భార్య/భర్తను ఒప్పించడానికి నేనేమి చేయవచ్చు?