కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్ణయించుకునే అవకాశాన్నిచ్చి ఆయన మనల్ని గౌరవార్హుల్ని చేశాడు

నిర్ణయించుకునే అవకాశాన్నిచ్చి ఆయన మనల్ని గౌరవార్హుల్ని చేశాడు

దేవునికి దగ్గరవ్వండి

నిర్ణయించుకునే అవకాశాన్నిచ్చి ఆయన మనల్ని గౌరవార్హుల్ని చేశాడు

2 రాజులు 18:1-7

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు అలా ఉంటే, పిల్లలు మంచి లక్షణాలను అలవర్చుకోగలుగుతారు, జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయితే, చాలామంది తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పిపోవడం విచారకరం. మరి అలాంటి తల్లిదండ్రుల పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగలేరా? ఎంతో ధైర్యాన్నిచ్చే ఒక నిజం దీనికి జవాబునిస్తుంది. అదేమిటంటే, యెహోవా దేవుడు మనలో ప్రతీ ఒక్కరికీ నిర్ణయించుకునే అవకాశం ఇచ్చాడు. అలా ఆయన మనల్ని గౌరవార్హుల్ని చేశాడు. 2 రాజులు 18:1-7లో నమోదు చేయబడివున్న హిజ్కియా విషయాన్నే పరిశీలించండి.

హిజ్కియా ‘యూదారాజైన ఆహాజు కుమారుడు.’ (1వ వచనం) ఆహాజు తన రాజ్యంలోని ప్రజలు యెహోవాను సరైన విధంగా ఆరాధించకుండా వాళ్లను తప్పుదారి పట్టించాడు. ఈ దుష్ట రాజు బయలును ఆరాధిస్తూ, మానవులను బలి అర్పించాడు. అతను హిజ్కియా సొంత సహోదరుల్లో ఒకరినో, ఇంకా ఎక్కువమందినో బలి అర్పించాడు. మందిరం తలుపుల్ని మూయించివేసి, తనకోసం ‘యెరూషలేము అంతటా బలిపీఠాలను కట్టించుకున్నాడు.’ అలా చేసి అతను ‘యెహోవాకు కోపం పుట్టించాడు.’ (2 దినవృత్తాంతములు 28:3, 24, 25) హిజ్కియా తండ్రి చాలా చెడ్డవాడని స్పష్టమవుతోంది. అయితే, హిజ్కియా తన తండ్రి చేసిన తప్పుల్ని చేయకుండా ఉండగలడా?

ఆహాజు తర్వాత హిజ్కియా రాజయ్యాడు. త్వరలోనే ఆయన, తన తండ్రిలా చెడ్డ పనుల్ని చేయనని చూపించాడు. ఆయన ‘యెహోవా దృష్టిలో పూర్ణంగా నీతిని అనుసరించాడు.’ (3వ వచనం) హిజ్కియా యెహోవా మీద నమ్మకముంచాడు, ‘యూదా రాజులలో అతనితో సమమైనవాడు ఒకడు కూడా లేడు.’ (5వ వచనం) ఆయన పరిపాలన మొదటి సంవత్సరంలో, అన్య దేవతలు ఆరాధించబడే ఉన్నత స్థలాలను తీసివేసి ఈ యువరాజు సత్యారాధనను తిరిగి ప్రారంభించాడు. మందిర తలుపులు మళ్లీ తీయబడ్డాయి, యెహోవాను సరైన విధంగా ఆరాధించడం మళ్లీ మొదలైంది. (4వ వచనం; 2 దినవృత్తాంతములు 29:1-3, 27-31) హిజ్కియా ‘యెహోవాను హత్తుకొని ఉన్నాడు కాబట్టి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.’—6, 7 వచనాలు.

తన తండ్రిలా ఆయన ఎందుకు చెడ్డ పనులు చేయకుండా ఉండగలిగాడు? హిజ్కియా తల్లి అబీయా గురించి మనకు అంతగా తెలీదు. అయితే, హిజ్కియా తన తల్లిని చూసి మంచి వ్యక్తిగా ఎదిగాడా? ఈ యువరాజు పుట్టకముందే ప్రవచించడం మొదలుపెట్టిన యెషయా మంచి ప్రవర్తనను చూసి ఆయన మంచి వ్యక్తిగా ఎదిగివుంటాడా? a బైబిలు దాని గురించి ఏమీ చెప్పడం లేదు. విషయమేదైనా ఒకటి మాత్రం స్పష్టం: హిజ్కియా తన తండ్రిలా కాకుండా మంచి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు.

చెడ్డ పనులు చేసే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన వాళ్లకు హిజ్కియా ఉదాహరణ ప్రోత్సాహాన్నిస్తోంది. గతాన్ని మార్చలేము; గతంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలను మనం తీసివేయలేము. కానీ అలాంటి అనుభవాలు ఎదురైనంత మాత్రాన మనం కూడా అలాంటివాళ్లమే కావాలనేమీ లేదు. మంచి భవిష్యత్తుకు దారితీసే సరైన నిర్ణయాలు ఇప్పుడు మనం తీసుకోవచ్చు. హిజ్కియాలాగే మనం కూడా సత్యదేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఆరాధించాలని నిర్ణయించుకోవచ్చు. అలా చేస్తే, ఇప్పుడు మనం జీవితంలో సంతృప్తిని పొందవచ్చు, దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలో ఎప్పటికీ జీవించవచ్చు. (2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) ప్రేమగల దేవుడు మనలో ప్రతీ ఒక్కరికీ సొంతగా నిర్ణయించుకునే అవకాశాన్నిచ్చాడు. ఎంతో అమూల్యమైన ఆ బహుమతినిచ్చి మనల్ని గౌరవార్హుల్ని చేసినందుకు మనందరం ఆయనపట్ల ఎంతో కృతజ్ఞత కలిగివుండాలి. (w10-E 09/01)

[అధస్సూచి]

a యెషయా దాదాపు సా.శ.పూ. 778 నుండి సా.శ.పూ. 732 తర్వాత కొంతకాలం వరకు ప్రవచించాడు. హిజ్కియా సా.శ.పూ. 745లో పరిపాలన మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన వయస్సు 25 సంవత్సరాలు.