కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని గురించి తెలుసుకునే అవకాశం అందరికీ దొరుకుతుందా?

దేవుని గురించి తెలుసుకునే అవకాశం అందరికీ దొరుకుతుందా?

మా పాఠకుల ప్రశ్న

దేవుని గురించి తెలుసుకునే అవకాశం అందరికీ దొరుకుతుందా?

▪ అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు, యేసు ఇలా చెప్పాడు, ‘నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణమనస్సుతో, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.’ (మత్తయి 22:37) ఎవరైనా దేవుణ్ణి ప్రేమించాలంటే వాళ్లు ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. (యోహాను 17:3) మరి ఆ అవకాశం అందరికీ దొరుకుతుందా?

దేవుని గురించి ముఖ్యంగా తెలియజేసేది బైబిలే. (2 తిమోతి 3:16, 17) చాలా ప్రాంతాల్లోని ప్రజలకు బైబిలు అందుబాటులో ఉంది. వాళ్లకు దేవుని గురించి తెలుసుకోవడానికి బైబిలు అధ్యయనం చేసే అవకాశం చాలాసార్లు దొరికి ఉండవచ్చు. (మత్తయి 28:19) కొంతమంది దేవుని గురించి ప్రతిరోజూ నేర్పించే ప్రేమగల క్రైస్తవ తల్లిదండ్రులున్న కుటుంబాల్లో పెరిగారు.—ద్వితీయోపదేశకాండము 6:6, 7; ఎఫెసీయులు 6:4.

అయితే కొంతమందికి అలాంటి అవకాశాలు ఉండవు. తమ మీద ఏమాత్రం ప్రేమానురాగాలు చూపించని తల్లిదండ్రుల పెంపకంలో కొంతమంది పెరిగివుంటారు. (2 తిమోతి 3:1-5) అలాంటి వాళ్లకు దేవుడు ఒక ప్రేమగల పరలోక తండ్రి అని నమ్మడం కష్టమవుతుండవచ్చు. చాలామందికి స్కూళ్లకు వెళ్లి చదువుకునే అవకాశం దొరకనందుకు వాళ్లకు బైబిలు చదవడం కష్టమవుతుండవచ్చు. ఇంకొంతమంది అబద్ధమత బోధలను నమ్ముతున్నారు లేదా బైబిలు సత్యం నేర్పించడాన్ని ఇష్టపడని కుటుంబాల్లో, సమాజాల్లో లేదా దేశాల్లో నివసిస్తున్నారు. (2 కొరింథీయులు 4:4) అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు దేవుని గురించి తెలుసుకునే అవకాశం దొరకదా, ఆయన్ని ప్రేమించే అవకాశం ఉండదా?

కొంతమందికి జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల వాళ్లకు దేవుణ్ణి ప్రేమించడం, ఆయన చెప్పినట్టు చేయడం కష్టమవుతుందని యేసు అంగీకరించాడు. (మత్తయి 19:23, 24) కొన్ని సమస్యల్ని అధిగమించడం మనుష్యులకు అసాధ్యం అనిపించినా ‘దేవునికి సమస్తం సాధ్యమే’ అని యేసు తన శిష్యులకు గుర్తు చేశాడు.—మత్తయి 19:25, 26.

ఈ వాస్తవాలను పరిశీలించండి: యెహోవా దేవుడు తన వాక్యమైన బైబిలు విరివిగా అందుబాటులో ఉండేలా చూశాడు. దేవుని గురించిన, భూమి పట్ల ఆయన సంకల్పం గురించిన సువార్త ‘లోకమంతటా’ ప్రకటించబడుతుందని బైబిలు ముందే తెలియజేసింది. (మత్తయి 24:14) ఈ రోజుల్లో, యెహోవాసాక్షులు 230 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారు, దాదాపు 500 భాషల్లో బైబిలు ప్రచురణల్ని ప్రచురిస్తున్నారు. తమ భాషలో బైబిలు లేని వాళ్లు కూడా, దేవుడు సృష్టించిన వాటిని గమనించి ఆయన గురించి ఎంతో నేర్చుకోవచ్చు.—రోమీయులు 1:20.

బైబిలు ఇంకా ఇలా చెబుతోంది, ‘యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తాడు, ఆలోచనల్లో ఉన్న ఉద్దేశాలన్నిటినీ గ్రహిస్తాడు. ఆయనను వెదికితే ఆయన మీకు దొరుకుతాడు.’ (1 దినవృత్తాంతములు 28:9, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కాబట్టి, ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన అవకాశాన్ని ఇస్తానని యెహోవా వాగ్దానం చేయకపోయినా, మంచి మనసున్న వాళ్లందరికీ ఒక అవకాశం దొరికేలా చూస్తాడు. ఆయన గురించి తెలుసుకునే అవకాశం దొరకక ముందే చనిపోయిన వాళ్లను నీతియుక్తమైన కొత్త లోకంలోకి పునరుత్థానం చేయడం ద్వారా తన గురించి తెలుసుకునే అవకాశం వాళ్లకు కూడా దొరికేలా చూస్తాడు.—అపొస్తలుల కార్యములు 24:14, 15. (w10-E 08/01)