కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎలా ఎదుర్కోవచ్చు?

ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎలా ఎదుర్కోవచ్చు?

ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎలా ఎదుర్కోవచ్చు?

ప్రకృతి విపత్తులు అంతకంతకు ఎక్కువౌతున్నాయి, వాటివల్ల జరిగే నష్టం కూడా ఎక్కువగానే ఉంటోంది. మరి వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఏమి చేయాలి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రమాదభరిత ప్రాంతాల్లో ఉండకండి. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 22:3) జ్ఞానవంతమైన ఈ సలహా విపత్తులు సంభవించినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అగ్నిపర్వతం బద్దలు కాబోతోందని లేదా వరదలు, తుఫాను రాబోతున్నాయని హెచ్చరికలు విన్నప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడం తెలివైన పని. ఎంతైనా ఇల్లు, వస్తువులకన్నా ప్రాణం ఎంతో విలువైనది.

ప్రమాదభరిత ప్రాంతాల్లో కాకుండా సురక్షిత ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకునే అవకాశం కొంతమందికి ఉండవచ్చు. ఒక అధికారిక సంస్థ ఇలా చెబుతోంది: “విపత్తుల ముప్పు కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ముందుముందు, పెద్ద విపత్తులు సంభవించేది కూడా అక్కడే.” ఉదాహరణకు, సముద్రమట్టం దిగువనున్న తీర ప్రాంతాల్లో లేదా భూ ఉపరితలంలో బీటలున్న ప్రాంతాల్లో ఇలా జరిగే అవకాశం ఉంది. మీరు అలాంటి ప్రమాదభరిత ప్రాంతాల్లో నివసించకుండా జాగ్రత్తపడితే, చాలావరకు విపత్తుల బారినపడకుండా ఉంటారు.

ముందుచర్యలు తీసుకోండి. మనం అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా, కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదంలో పడే అవకాశముంది. మీరు ముందే కొన్ని చర్యలు తీసుకుంటే, ఇలాంటి పరిస్థితులను సులువుగా ఎదుర్కోగలుగుతారు. మనం సామెతలు 22:3లో చూసిన సలహా కూడా ఈ విషయాన్నే చెబుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన వస్తువులను ఒక బ్యాగులో సర్దిపెట్టుకున్నారా? ప్రథమ చికిత్సకు కావాల్సినవి, నీళ్ల బాటిల్‌, నిలవవుండే ఆహారం, ముఖ్యమైన దస్తావేజులు పెట్టుకోమని 1-2-3 డిసాస్టర్‌ ఎడ్యుకేషన్‌ అనే ప్రచురణ సిఫారసు చేస్తోంది. మీ ప్రాంతంలో ఎలాంటి విపత్తులు సంభవించే అవకాశముందో, అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో కుటుంబమంతా కలిసి మాట్లాడుకోవడం మంచిది.

దేవునికి దగ్గరగా ఉండండి. అప్పుడు మీరు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలుగుతారు. ఆయన గురించి బైబిలు, ‘మన శ్రమంతట్లో మనల్ని ఆదరించే కనికరం చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు’ అని, ‘దీనులను ఆదరించే దేవుడు’ అని చెబుతోంది.—2 కొరింథీయులు 1:3, 4; 7:6.

తన మీద విశ్వాసముంచే వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి దేవునికి బాగా తెలుసు. ఆయన ప్రేమగల దేవుడు, కోలుకోవడానికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తాడు. (1 యోహాను 4:8) అద్భుతాల కోసం కాకుండా దేవుని శక్తివంతమైన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తే, ఎలాంటి పరిస్థితులనైనా తాళుకోగలుగుతాం. కష్టాలు ఎదుర్కొనే వారికి ఓదార్పును, ఊరటను ఇచ్చే బైబిలు లేఖనాలను పరిశుద్ధాత్మ గుర్తుచేస్తుంది. నిజానికి, నేటి దేవుని నమ్మకమైన సేవకులకు కూడా ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుకు అనిపించినట్లే అనిపిస్తుంది. ఆయన ఈ ధీమా వ్యక్తంచేశాడు: ‘గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయానికీ భయపడను. నువ్వు నాకు తోడైవుంటావు. నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయి.’—కీర్తన 23:4.

క్రైస్తవులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మొదటి శతాబ్దంలో అగబు అనే క్రైస్తవ ప్రవక్త, ‘భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుంది’ అని సూచించాడు. ‘అది క్లౌదియ చక్రవర్తి కాలంలో సంభవించింది.’ దానివల్ల యూదయలో ఉన్న చాలామంది యేసు శిష్యులు ఎన్నో బాధలుపడ్డారు. వేరే ప్రాంతాల్లోని శిష్యులు వాళ్ల దీనావస్థ గురించి విన్నప్పుడు ఏమి చేశారు? లేఖనాలు ఇలా చెబుతున్నాయి: ‘శిష్యుల్లో ప్రతివాడు తనతన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపడానికి నిశ్చయించుకున్నాడు.’ (అపొస్తలుల కార్యములు 11:28, 29) శిష్యులు ప్రేమతో బాధితులకు అవసరమైనవి పంపించారు.

తీవ్రమైన విపత్తులు సంభవించినప్పుడు నేటి దేవుని సేవకులు కూడా అలాగే చేస్తారు. తోటి విశ్వాసులకు సహాయపడతారని యెహోవాసాక్షులకు మంచి పేరుంది. ఉదాహరణకు, 2010 ఫిబ్రవరి 27న చిలీలో భారీ భూకంపం వచ్చినప్పుడు, బాధితులకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు వెంటనే స్పందించారు. సునామీ వచ్చినప్పుడు కార్లా అనే ఒక యెహోవాసాక్షి ఇల్లు కొట్టుకుపోయింది, ఆమె ఇలా అంటోంది: “ఆ మరుసటి రోజే మాకు సహాయం చేయడానికి వేరే ప్రాంతాల నుండి [తోటి యెహోవాసాక్షులు] రావడం చూసినప్పుడు ఎంతో ఊరట కలిగింది, ధైర్యమొచ్చింది. ఆ స్వచ్ఛంద సేవకులు చూపించిన మంచితనంతో నిజంగా యెహోవాయే మమ్మల్ని ఓదార్చాడు. నేను యెహోవా ప్రేమను, కాపుదలను చవిచూశాను.” యెహోవాసాక్షికాని వాళ్ల తాత ఇదంతా గమనించి, “ఇన్నేళ్లలో మా చర్చివాళ్లు ఇలా చేయడం నేను ఎప్పుడూ చూడలేదు” అన్నాడు. అంతేకాదు, తనతో బైబిలు అధ్యయనం చేయమని యెహోవాసాక్షులను అడిగాడు.

దేవుణ్ణి ప్రేమించే వాళ్లతో సహవసిస్తే గొప్ప విపత్తులు సంభవించినప్పుడు ఎంతో సహాయం దొరుకుతుంది. అయితే, ప్రకృతి విపత్తులు ఉండని రోజు ఎప్పటికైనా వస్తుందా? దీని గురించి బైబిలు ఏమి చెబుతుందో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం. (w11-E 12/01)

[6వ పేజీలోని చిత్రం]

అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన వస్తువులను ఒక బ్యాగులో సర్దిపెట్టుకున్నారా?

[7వ పేజీలోని చిత్రం]

అద్భుతాల కోసం కాకుండా దేవుని శక్తివంతమైన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తే, ఎలాంటి పరిస్థితులనైనా తాళుకోగలుగుతాం

[7వ పేజీలోని చిత్రం]

విపత్తుల వల్ల వచ్చే కష్టాలను తాళుకోవడానికి క్రైస్తవులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు

[7వ పేజీలోని చిత్రం]

“నేను యెహోవా ప్రేమను, కాపుదలను చవిచూశాను”