కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాధలన్నీ త్వరలోనే మటుమాయమౌతాయి!

బాధలన్నీ త్వరలోనే మటుమాయమౌతాయి!

నేరాలు, యుద్ధాలు, రోగాలు, ప్రకృతి విపత్తులు వంటి బాధలేవీ లేని ప్రపంచంలో జీవిస్తున్నట్లు ఒకసారి ఊహించుకోండి. తరతమ భేదాలు, అణచివేత లేదా ఆర్థిక ఇబ్బందులు వంటివాటి గురించిన ఆందోళన లేకుండా హాయిగా నిద్రలేవడాన్ని ఊహించుకోండి. ఇవన్నీ కేవలం అపోహలు అనుకుంటున్నారా? నిజమే, అలాంటి పరిస్థితులు తీసుకురావడం ఏ మనిషి తరం కాదు లేదా ఏ మానవ సంస్థకు చేతకాదు. ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్నవాటితోసహా బాధలకు కారణమైన వాటన్నిటినీ తీసేస్తానని దేవుడు మాటిచ్చాడు. దేవుని వాక్యమైన బైబిలు చేస్తున్న ఈ కొన్ని వాగ్దానాల్ని పరిశీలించండి:

మంచి ప్రభుత్వ పాలన

‘పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు. దానికెన్నటికీ నాశనం కలుగదు, ఆ రాజ్యం దాన్ని పొందినవాళ్లకు గాక మరెవరికీ చెందదు; అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ పగులగొట్టి నిర్మూలం చేస్తుంది కానీ అది యుగాల వరకు నిలుస్తుంది.’—దానియేలు 2:44.

దేవుని రాజ్యం ఓ పరలోక ప్రభుత్వం. దాని పరిపాలకునిగా ఎంపికైన యేసుక్రీస్తు మనుషుల పరిపాలనంతటినీ తీసేసి తాను పరిపాలిస్తాడు. అప్పుడు పరలోకంలోనే కాక ఈ భూమ్మీద కూడా అన్నీ దేవుని ఇష్టప్రకారమే జరుగుతాయి. (మత్తయి 6:9, 10) మనుషుల ప్రభుత్వాలేవీ దేవుని రాజ్యాన్ని నిర్మూలించలేవు, ఎందుకంటే అది ‘మన ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు నిత్య రాజ్యం.’ ఆ రాజ్యంలో శాశ్వతంగా శాంతి విలసిల్లుతుంది.—2 పేతురు 1:11.

అబద్ధమతం మచ్చుకైనా కనిపించదు

‘సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకుంటున్నాడు గనుక, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. వాళ్ల క్రియల చొప్పున వాళ్లకు అంతం కలుగుతుంది.’—2 కొరింథీయులు 11:14, 15.

అబద్ధమతాన్ని సాతానే సృష్టించాడన్న నిజం బట్టబయలౌతుంది, అంతేకాక దేవుడు ఆ మతాన్ని భూమ్మీద లేకుండా రూపుమాపుతాడు. మతంపై దురభిమానం, మతం పేరిట జరిగిన రక్తపాతం వంటివన్నీ మటుమాయమౌతాయి. దాంతో, ‘జీవం గల సత్యవంతుడైన దేవుణ్ణి’ ప్రేమించే వాళ్లందరూ ‘ఒకే విశ్వాసం’ కలిగి ‘ఆత్మతో, సత్యంతో’ ఆయనను ఆరాధించే అవకాశం లభిస్తుంది. అప్పుడు మాటల్లో చెప్పలేనంత శాంతి, ఐక్యత నెలకొంటాయి!—1 థెస్సలొనీకయులు 1:9, 10; ఎఫెసీయులు 4:5; యోహాను 4:23.

మనుషులు ఇక అపరిపూర్ణులుగా ఉండరు

‘దేవుడు తానే వాళ్లకు తోడుగా ఉంటాడు. ఆయన వాళ్ల కన్నుల ప్రతీ బాష్పబిందువును తుడిచివేస్తాడు, మరణం ఇక ఉండదు, దుఃఖం, ఏడ్పు, వేదన ఇక ఉండవు. మొదటి సంగతులు గతించిపోయాయి.’—ప్రకటన 21:3, 4.

మనుషుల కోసం తన ప్రాణం పెట్టిన తన కుమారుడైన యేసును ఉపయోగించుకొని యెహోవా దేవుడు ఆ మాటల్ని నిజం చేస్తాడు. (యోహాను 3:16) యేసు నేతృత్వంలో మనుషులందరూ పరిపూర్ణులౌతారు. దేవుడు స్వయంగా తానే వాళ్లకు తోడునీడగా ఉంటూ మనుషుల ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు, కాబట్టి ఇక బాధలనేవే ఉండవు. అపరిపూర్ణత, బాధ అనే మాటల్నే మనుషులు మర్చిపోతారు. అప్పుడు, ‘నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వాళ్లు దాంట్లో నిత్యం నివసిస్తారు.’—కీర్తన 37:29.

దురాత్మలు ఉండవు

‘అతడు [యేసుక్రీస్తు] ఆదిసర్పాన్ని, అంటే అపవాది, సాతాను అనే ఆ ఘటసర్పాన్ని పట్టుకొని వెయ్యి సంవత్సరాలు వాణ్ణి బంధించి అగాధములో పడేసి, ఆ వెయ్యి సంవత్సరాలు గడిచేవరకు ఇక జనాల్ని మోసం చేయకుండా అగాధాన్ని మూసి దానికి ముద్ర వేశాడు; అటుపిమ్మట వాడు కొంతకాలం విడిచిపెట్టబడాలి.’—ప్రకటన 20:2, 3.

సాతానును, అతని దయ్యాల్ని బంధించి, పూర్తిగా నిష్క్రియా స్థితిలో ఉండే ‘అగాధంలో’ పడేసినప్పుడు ఇక సాతాను ఆటలు సాగవు. ఆ దయ్యాలు ఇక మనుషులతో చెడ్డ పనులు చేయించలేరు. సాతానుకు, దురాత్మలకు మనుషులపై అసలేమాత్రం పట్టు ఉండని ప్రపంచంలో జీవించడం మనకెంతటి ఉపశమనాన్ని ఇస్తుందో కదా!

‘చివరి రోజులకు’ తెరపడుతుంది

యేసు ప్రస్తావించిన ‘మహాశ్రమలతో’ ‘చివరి రోజులకు’ తెరపడుతుంది. ఆయన ఇలా అన్నాడు: ‘లోకారంభం నుండి ఇప్పటివరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు.’—మత్తయి 24:21.

కనీవినీ ఎరుగని స్థాయిలో ఉపద్రవాలు ముంచుకొస్తాయి కాబట్టి, వాటిని మహాశ్రమలు అని అనడం సబబే. “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” లేదా చాలామందికి సుపరిచితమైన మాటల్లో చెప్పాలంటే, “హార్‌మెగిద్దోను” యుద్ధం మహాశ్రమలకు చరమగీతం పాడుతుంది.—ప్రకటన 16:14-16.

ప్రపంచ నలుమూలలా, మంచిని ప్రేమించే ప్రతీ ఒక్కరు ఈ దుష్టత్వం అంతమవ్వాలని ఎదురుచూస్తున్నారు. అలాంటి వాళ్లు దేవుని రాజ్య పరిపాలనలో రుచిచూడనున్న కొన్ని దీవెనలేంటో గమనించండి.

యెహోవా కుమ్మరించే దీవెనలకు లెక్కే ఉండదు

‘ఓ గొప్ప సమూహం’ నాశనాన్ని తప్పించుకొని శాంతి విలసిల్లే కొత్తలోకంలోకి ప్రవేశిస్తారు: ఎవ్వరూ లెక్కించలేనంత ‘గొప్ప సమూహం’ “మహాశ్రమల నుండి” తప్పించుకొని సజీవంగా నీతి రాజ్యమేలే కొత్తలోకంలోకి అడుగుపెడతారు. (ప్రకటన 7:9, 10, 14; 2 పేతురు 3:13) ‘లోక పాపాన్ని మోసికొనిపోయే దేవుని గొర్రెపిల్ల’ అయిన యేసుక్రీస్తే తమకు రక్షణ కలుగజేశాడని ప్రజలు చెప్పుకుంటారు.—యోహాను 1:29.

దైవిక విద్య వల్ల ఎనలేని ప్రయోజనాలు చేకూరుతాయి: కొత్తలోకంలో ఈ భూమి అంతా ‘యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండివుంటుంది.’ (యెషయా 11:9) దైవిక విద్యలో భాగంగా, మన చుట్టూ ఉన్న ప్రజలతో శాంతిగా, సామరస్యంగా ఎలా మెలగాలో కూడా దేవుడు నేర్పిస్తాడు. దేవుడు ఇలా మాటిచ్చాడు: ‘నీకు ప్రయోజనం కలిగేలా నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన త్రోవలో నిన్ను నడిపిస్తాను.’—యెషయా 48:17.

చనిపోయిన మన ప్రియమైనవాళ్లు తిరిగి బ్రతుకుతారు: భూమ్మీద ఉన్నప్పుడు యేసు తన మిత్రుడైన లాజరును తిరిగి బ్రతికించాడు. (యోహాను 11:1, 5, 38-44) దేవుని రాజ్యంలో యేసు ఇంకా భారీ స్థాయిలో చేయనున్న దానికి అది కేవలం మచ్చుతునకే.—యోహాను 5:28, 29.

నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు తరతరాలు రాజ్యమేలతాయి: క్రీస్తు నాయకత్వాన అక్రమాల ఊసే ఉండదు. అలాగని మనకెలా తెలుసు? హృదయాల్ని చదివే తన సామర్థ్యాన్ని ఉపయోగించి యేసు నీతిమంతులెవరో, దుష్టులెవరో తేల్చేస్తాడు. తమ తీరుతెన్నుల్ని మార్చుకోని వాళ్లను ఆయన దేవుని కొత్తలోకంలో ఉండనివ్వడు.—కీర్తన 37:9, 10; యెషయా 11:3, 4; 65:20; మత్తయి 9:4.

మనుషుల బంగారు భవిష్యత్తు గురించి బైబిలు చెబుతున్న విషయాల్లో ఇవి కొన్ని మాత్రమే. దేవుని రాజ్యం భూమిని పరిపాలిస్తున్నప్పుడు, ఎన్ని యుగాలైనా మనుషుల ‘క్షేమానికి’ కొదువే ఉండదు. (కీర్తన 37:11, 29) మానవకోటిని పట్టిపీడిస్తున్న బాధలకు, వేదనలకు ఆజ్యంపోసిన ప్రతీది మటుమాయమౌతుంది. ఆరునూరైనా అవన్నీ జరిగి తీరతాయని మనం నిశ్చయంగా నమ్మవచ్చు. ఎందుకంటే దేవుడే స్వయంగా ఇలా మాటిచ్చాడు: ‘ఇదిగో, సమస్తం కొత్తగా చేస్తున్నాను. ఈ మాటలు సత్యమైనవి, నమ్మదగినవి.’—ప్రకటన 21:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం. (w13-E 09/01)