కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

టీనేజీలోవున్న మీ పిల్లలతో గొడవపడకుండా మాట్లాడండి

టీనేజీలోవున్న మీ పిల్లలతో గొడవపడకుండా మాట్లాడండి

“మా అమ్మాయికి 14 ఏళ్లు వచ్చేసరికి ఎదురుచెప్పడం మొదలుపెట్టింది. ‘భోంచేద్దువు రా’ అని పిలిస్తే, ‘తినాలనిపించినప్పుడు తింటాలే’ అని బదులిచ్చేది. ‘నీ పనులన్నీ అయిపోయాయా?’ అని అడిగితే, ‘అస్తమానం విసిగించకు!’ అనేది. చాలాసార్లు మేమిద్దరం పెద్దపెద్దగా అరుచుకునేవాళ్లం.”​—మాకీ, జపాన్‌. a

మీ పిల్లవాడు టీనేజీలో ఉన్నాడా? b అయితే, మీ పిల్లవాడితో గొడవ తలెత్తిన ప్రతీసారి తల్లిదండ్రులుగా మీ నేర్పు, ఓర్పు పరీక్షకు గురౌతాయి. బ్రెజిల్‌లోని మారీయకు 14 ఏళ్ల కూతురు ఉంది. మారీయ ఇలా అంటుంది: “మా అమ్మాయి నాకు ఎదురుతిరిగిన ప్రతీసారి నా రక్తం మరిగిపోతుంది. చిరాకులో మేమిద్దరం గట్టిగట్టిగా అరుచుకుంటాం.” ఇలాంటి సవాలునే ఎదుర్కొంటున్న ఇటలీలోని కార్మెలా ఏమంటోందంటే, “మా అబ్బాయితో జరిగే గొడవలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. దాంతో వాడు కోపంగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకుంటాడు.”

కొందరు టీనేజర్లు ఎందుకు కలహప్రియుల్లా కనిపిస్తారు? దానికి వాళ్ల స్నేహితులే కారణమా? బహుశా కావచ్చు. మంచికైనా, చెడుకైనా స్నేహితుల ప్రభావం మనమీద చాలా ఉంటుందని బైబిలు చెబుతుంది. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33) నేడు యువతకు నచ్చే వినోదం ఎక్కువగా ఎలా ఉందంటే, అది యౌవనుల్లో తిరుగుబాటు స్ఫూర్తి, గౌరవం లేకపోవడం వంటి పోకడలు పెద్ద తప్పేమీ కాదన్నట్లు చూపిస్తుంది.

టీనేజర్లు అలా ఉండడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవి మీ పిల్లవాడి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ముందు మీరు అర్థం చేసుకుంటే, వాటితో వ్యవహరించడం మీకు తేలికౌతుంది. కొన్ని ఉదాహరణలు గమనించండి.

‘మేలు కీడులను వివేచించడం’ నేర్చుకుంటున్నాడు

అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలా మాట్లాడాను, పిల్లవానిలా తలంచాను, పిల్లవానిలా యోచించాను. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానేశాను.’ (1 కొరింథీయులు 13:11) పిల్లల ఆలోచనాతీరు, పెద్దవాళ్ల ఆలోచనాతీరు ఒకేలా ఉండదని ఆ మాటలు చూపిస్తున్నాయి. ఏవిధంగా?

పిల్లలు, ‘ఇది తప్పు, అది ఒప్పు’ అని మాత్రమే ఆలోచిస్తారు. అదే పెద్దవాళ్లయితే, కాస్త కష్టమైన విషయాల గురించి కూడా లోతుగా ఆలోచించి, వాటిని అర్థంచేసుకొని, ఒక అభిప్రాయానికి రాగలుగుతారు లేదా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఉదాహరణకు, పెద్దవాళ్లు ఏదైనా పని చేసేముందు, తప్పొప్పుల విషయంలో ప్రజల్లోవున్న నమ్మకాలను, ఆ పని ఇతరులమీద చూపించే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలా ఆలోచించడానికి వాళ్లు అలవాటుపడిపోయారు. కానీ టీనేజర్లు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు.

యౌవనులు ‘వివేచనను’ లేదా ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోవాలని బైబిలు చెబుతుంది. (సామెతలు 1:4) నిజానికి, ప్రతీ క్రైస్తవుడు ‘మేలు కీడులను వివేచించడం’ నేర్చుకోవాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. (హెబ్రీయులు 5:14) టీనేజీలో ఉన్న మీ పిల్లవాడు అలా వివేచించడం మొదలుపెట్టినప్పుడు, కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలకు కూడా మీతో గొడవపడవచ్చు లేదా ఏదైనా విషయంలో తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. (సామెతలు 14:12) అలాంటప్పుడు మీరు గొడవపడకుండా, విషయం అర్థమయ్యేలా ఎలా వివరించవచ్చు?

ఇలా చేసి చూడండి: ఎలా తర్కించాలో మీ పిల్లవాడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడని, తను వ్యక్తం చేసింది అభిప్రాయాన్నే కానీ నిర్ణయాన్ని కాదని మర్చిపోకండి. తను నిజంగా ఏమి నమ్ముతున్నాడో తెలుసుకోవడానికి ముందు, తను అలా ఆలోచించడం నేర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉందని మెచ్చుకోండి. (“నువ్వు చెప్పే ప్రతీది సరైనదని ఒప్పుకోకపోయినా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నేను అర్థంచేసుకున్నాను.”) తర్వాత, తన ఆలోచనను సరిచూసుకోవడానికి సహాయం చేయండి. (“నువ్వు చెప్పింది ప్రతీ సందర్భానికి వర్తిస్తుందని నీకనిపిస్తుందా?”) మీ పిల్లవాడు తన అభిప్రాయాలను ఎలా సరిచూసుకుంటున్నాడో, ఎలా సరిచేసుకుంటున్నాడో చూసి బహుశా మీరే ఆశ్చర్యపోతారు.

ఈ విషయంలో జాగ్రత్త వహించండి: మీ పిల్లవాడితో తర్కిస్తున్నప్పుడు, మీదే పైచేయి కావాలని అనుకోకండి. మీరు చెప్పేది మీ పిల్లవాడు ఒప్పుకోవడంలేదని మీకు అనిపించవచ్చు. అయినా, అలా చర్చించడంవల్ల బహుశా మీరు ఊహించిన దానికన్నా, మీ కంటికి కనిపించే దానికన్నా తను ఎక్కువే నేర్చుకుంటాడు. కొన్ని రోజుల్లోనే మీ పిల్లవాడు మీ అభిప్రాయాన్ని ఒప్పుకొని, అది తన అభిప్రాయమేనని చెప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

“కొన్నిసార్లు నేనూ మా అబ్బాయీ చిన్నచిన్న విషయాల గురించి అంటే దేన్నైనా వృథా చేయడం, చెల్లిని ఆటపట్టించడం వంటివాటి గురించి గొడవపడుతుంటాం. చాలా సందర్భాల్లో, అసలు మా అబ్బాయి మనసులో ఏముందో నేను తెలుసుకోవాలనీ, తనను అర్థంచేసుకోవాలనీ, ‘ఓహో, అదా సంగతి,’ ‘నువ్వు అలా అనుకుంటున్నావ్‌ అన్నమాట’ అని అనాలనీ తను కోరుకుంటున్నట్లు అనిపించేది. అప్పట్లో నేను కనీసం అలాంటిది ఏదోకటి అన్నా మా మధ్య అన్ని గొడవలు జరిగివుండేవికావు.”—కెన్జీ, జపాన్‌.

తన అభిప్రాయాలను ఏర్పర్చుకుంటున్నాడు

తెలివైన తల్లిదండ్రులు పిల్లలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పగలిగే వాతావరణం కల్పిస్తారు

టీనేజీ పిల్లల్ని పెంచుతున్నప్పుడు తల్లిదండ్రులకున్న ఒక ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే, పెద్దయ్యాక వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేయడమే. (ఆదికాండము 2:24) దానికోసం, వాళ్లు తమదైన వ్యక్తిత్వాన్ని అంటే, తమవైన పద్ధతుల్ని, నమ్మకాల్ని, విలువల్ని ఏర్పర్చుకునేలా సహాయం చేయాలి. తప్పు చేయాలనే ఒత్తిడి ఎదురైనప్పుడు అలాంటి పిల్లలు కేవలం పర్యవసానాల గురించే కాక ఇలా కూడా ఆలోచిస్తారు: ‘నేను ఎలాంటి వ్యక్తిని? నాకు ఎలాంటి విలువలు ఉన్నాయి? నాలాంటి విలువలున్న వ్యక్తి ఈ పరిస్థితిలో ఏమి చేస్తాడు?’—2 పేతురు 3:11, 12.

అలా తన వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకున్న యోసేపు అనే యువకుని గురించి బైబిలు చెబుతుంది. ఒక సందర్భంలో, పోతీఫరు భార్య “తనతో శయనించుమని” యోసేపును బలవంతపెట్టినప్పుడు ఆయనిలా అన్నాడు: ‘నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?’ (ఆదికాండము 39:9) వ్యభిచారం చేయవద్దనే ఆజ్ఞను దేవుడు అప్పటికింకా ఇవ్వకపోయినా, ఆ విషయంలో దేవుని ఆలోచనను యోసేపు అర్థంచేసుకున్నాడు. అంతేకాదు, “నేనెట్లు” అనే మాట యోసేపు దేవుని ఆలోచననే తన ఆలోచనగా అంటే, తన వ్యక్తిత్వంలో భాగంగా చేసుకున్నాడని చూపిస్తుంది.—ఎఫెసీయులు 5:1.

టీనేజీలో ఉన్న మీ పిల్లవాడు కూడా తన వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకునే దశలో ఉన్నాడు. అది మంచిదే. ఎందుకంటే, దానివల్ల తోటివాళ్లు తప్పు చేయమని ఒత్తిడి చేసినప్పుడు మీ పిల్లవాడు తట్టుకొని నిలబడగలుగుతాడు. (సామెతలు 1:10-15) అయితే కొన్నిసార్లు అదే వ్యక్తిత్వం వల్ల మీ పిల్లవాడు మీకు విరుద్ధంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే మీరేమి చేయవచ్చు?

ఇలా చేసి చూడండి: మీరు గొడవకి దిగే బదులు మీ పిల్లవాడు ఏమనుకుంటున్నాడో దాన్నే మళ్లీ చెప్పండి. (“నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. నువ్వనేది . . . ”) తర్వాత, ప్రశ్నలు అడిగి మీ పిల్లవాడి మనసులో ఏముందో తెలుసుకోండి. (“నీకు అలా ఎందుకు అనిపిస్తుంది?” లేదా “నువ్వు ఆ నిర్ణయానికి ఎలా వచ్చావ్‌?”) ఆయన అభిప్రాయాలను చెప్పనివ్వండి. కొన్నిసార్లు, మీ అబ్బాయి అభిప్రాయం మీ అభిప్రాయానికి వేరుగా ఉన్నా అది కూడా సరైనదే కావచ్చు. అలాంటప్పుడు, మీరు తన అభిప్రాయాన్ని పూర్తిగా ఒప్పుకోకపోయినా దాన్ని గౌరవిస్తారని మీ పిల్లవాడికి తెలిసేలా చేయండి.

అలా సొంత అభిప్రాయాలను, వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకోవడం సహజమే కాదు ప్రయోజనకరం కూడా. నిజానికి, క్రైస్తవులు ‘గాలికి కొట్టుకొనిపోయేలా కల్పింపబడిన ప్రతీ ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొనిపోతూ అలలచేత ఎగురగొట్టబడే’ పిల్లల్లా ఉండకూడదని బైబిలు చెబుతుంది. (ఎఫెసీయులు 4:14) కాబట్టి, మీ పిల్లవాడు సొంత అభిప్రాయాలను, వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకుంటున్నప్పుడు అతణ్ణి అడ్డుకునే బదులు ప్రోత్సహించండి.

“మా అమ్మాయిలు చెప్పేది వినడానికి నేను శ్రద్ధ చూపించినప్పుడు, నా అభిప్రాయం వాళ్ల అభిప్రాయానికి వేరుగా ఉన్నా సరే దాన్ని అర్థంచేసుకోవడానికి వాళ్లు ఆసక్తి చూపిస్తారు. వాళ్లు నాలాగే ఆలోచించాలని బలవంతం చేయకుండా జాగ్రత్తపడతాను, తమ సొంత అభిప్రాయాలను ఏర్పర్చుకోనిస్తాను.”—ఇవాన, జెక్‌ రిపబ్లిక్‌.

స్థిరంగా ఉండండి, కానీ కఠినంగా ఉండకండి

చిన్నపిల్లల్లాగే కొందరు టీనేజర్లు కూడా తాము అనుకున్నది జరిగే వరకూ పట్టుబడుతూ ఉంటారు. మీ పిల్లలు కూడా అలా చేస్తుంటే జాగ్రత్త వహించండి. వాళ్లు అడిగింది ఇస్తే అప్పటికి పోరు పెట్టడం ఆపేస్తారు, కానీ కావాల్సింది పొందాలంటే అలా గొడవపడడమే దారి అనే నిర్ణయానికి వచ్చేస్తారు. మరైతే దీనికి పరిష్కారం ఏమిటి? “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను” అనే యేసు సలహాను పాటించండి. (మత్తయి 5:37) మీరు మీ మాటకు ఎప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిస్తే, మీ పిల్లవాడు గొడవచేయడం తగ్గించేస్తాడు.

అదే సమయంలో, మీరు మరీ కఠినంగా కూడా ఉండకండి. ఉదాహరణకు, ఫలానా కట్టుబాటును ఈ సందర్భంలో సవరించాలని మీ పిల్లవానికి ఎందుకు అనిపిస్తుందో అడగండి. దానర్థం, మీరు మీ పిల్లవాడి పోరుకు తలొగ్గినట్లు కాదుగానీ “మీ సాత్వికం తెలియనివ్వండి” అనే బైబిలు ఉపదేశాన్ని పాటిస్తున్నట్లు.—ఫిలిప్పీయులు 4:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

ఇలా చేసి చూడండి: మీ ఇంటి కట్టుబాట్ల గురించి, నిబంధనల గురించి మీ పిల్లలందర్నీ ఒక చోట కూర్చోబెట్టి చర్చించండి. వాళ్లు చెప్పేది వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని, నిర్ణయం తీసుకునే ముందు మిగతా విషయాల గురించి కూడా ఆలోచిస్తారని చూపించండి. బ్రెజిల్‌లో ఉంటున్న రోబర్టూ అనే ఒక తండ్రి ఇలా అంటున్నాడు: “తాము అడిగింది బైబిలు సూత్రాలకు విరుద్ధంగా లేకపోతే, తల్లిదండ్రులు దాన్ని వెంటనే ఒప్పేసుకుంటారని టీనేజీ పిల్లలకు అర్థంకావాలి.”

నిజమే, తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటారు. “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని బైబిలు చెబుతుంది. (యాకోబు 3:2) గొడవకు మీరు కూడా కొంతవరకు కారణం అనిపిస్తే, సిగ్గుపడకుండా మీ పిల్లవానికి క్షమాపణ చెప్పండి. మీ వినయాన్ని చూసి మీ పిల్లవాడు కూడా మీలాగే నడుచుకోవడానికి ప్రయత్నిస్తాడు.

“ఒకసారి గొడవ జరిగినప్పుడు, నా కోపం తగ్గాక మా అబ్బాయి దగ్గరకు వెళ్లి, అనవసరంగా తనమీద అరిచినందుకు క్షమాపణ చెప్పాను. దానివల్ల తన కోపం పోయి, నేను చెప్పింది సావధానంగా వినగలిగాడు.”—కెన్జీ, జపాన్‌. (w13-E 11/01)

a ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.

b ఈ ఆర్టికల్‌ “పిల్లవాడు” అని మాట్లాడుతున్నా, ఇందులోని సూత్రాలు ఆడపిల్లలకు కూడా వర్తిస్తాయి.

వీటి గురించి ఆలోచించండి . . .

  • మా పిల్లవాడికీ నాకూ మధ్య జరుగుతున్న గొడవలకు నేను ఏరకంగా కారణమౌతున్నాను?

  • మా అబ్బాయిని ఇంకా బాగా అర్థంచేసుకోవడానికి ఈ ఆర్టికల్‌లోని సమాచారం నాకెలా ఉపయోగపడుతుంది?

  • గొడవపడకుండా మా పిల్లవాడితో మాట్లాడడానికి నేను ఏమి చేయవచ్చు?