కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ భాగం

మీ బంధువులతో సత్సంబంధాలను కాపాడుకోవడం ఎలా?

మీ బంధువులతో సత్సంబంధాలను కాపాడుకోవడం ఎలా?

‘దయను, వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి.’—కొలొస్సయులు 3:12.

పెళ్లితో ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది. అయితే మీ తల్లిదండ్రుల మీద మీకు ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటాయి. అయినా, ఇప్పుడు భూమ్మీద మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మీ జీవిత భాగస్వామే. ఈ విషయాన్ని అంగీకరించడం మీ తల్లిదండ్రులకు కాస్త కష్టమనిపించవచ్చు. అయితే, ఈ విషయంలో సమతుల్యంగా ఉండడానికి బైబిలు సూత్రాలు సహాయం చేయగలవు. మీరిద్దరు ఓ చక్కని బంధాన్ని ఏర్పర్చుకోవడానికి కృషి చేస్తూనే మీ అమ్మానాన్నలతో, అత్తామామలతో సత్సంబంధాలు కాపాడుకోవడానికి ఆ సూత్రాలు మీకు తోడ్పడతాయి. అయితే ఈ ఆర్టికల్‌లోని సూత్రాలను మీరు మీ అక్కాచెల్లెళ్లతో, అన్నాదమ్ముళ్లతో, బావామరిదులతో, వదినామరదళ్లతో, బాబాయి పిన్నీలతో, తాతమామ్మలతో, మరితర కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఉపయోగించవచ్చు.

1 ఇరువైపులా ఉన్న ఆప్తుల పట్ల సదభిప్రాయంతో ఉండండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “నీ తండ్రిని తల్లిని సన్మానింపుము.” (ఎఫెసీయులు 6:2) మీరు ఎంత పెద్దవాళ్లయినా మీ తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించాలి, వాళ్లకు మర్యాద ఇవ్వాలి. అయితే మీ జీవిత భాగస్వామి కూడా తన తల్లిదండ్రులను పట్టించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని అర్థంచేసుకోండి. “ప్రేమ మత్సరపడదు” కాబట్టి తనకు వాళ్లతో ఉన్న బంధాన్ని చూసి మీలో అభద్రతా భావాలు కలగకుండా చూసుకోండి.—1 కొరింథీయులు 13:4; గలతీయులు 5:26.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • “మీవాళ్లు ఎప్పుడూ నన్ను అవమానిస్తారు” లేదా “నేను చేసేది మీ అమ్మకు ఎప్పుడూ నచ్చదు” వంటి పెద్దపెద్ద మాటలు అనకండి

  • విషయాలను మీ జీవిత భాగస్వామి వైపు నుండి ఆలోచించడానికి ప్రయత్నించండి

2 అవసరమైనప్పుడు నిక్కచ్చిగా ఉండండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ‘పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమై ఉంటారు.’ (ఆదికాండము 2:24) మీ పెళ్లయ్యాక కూడా మీ బాధ్యత ఇంకా తమదేనని బహుశా మీ తల్లిదండ్రులు అనుకోవచ్చు. అందుకే మీ విషయాల్లో అవసరానికి మించి కల్పించుకోవాలనుకోవచ్చు.

ఈ విషయంలో వాళ్లకు ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలనేది భార్యాభర్తలుగా మీరిద్దరే నిర్ణయించుకోవాలి. దాన్ని ప్రేమగా వాళ్లకు తెలియజేయాలి. వాళ్లను నొప్పించకుండానే నిర్మొహమాటంగా, సూటిగా విషయాన్ని వాళ్లకు చెప్పవచ్చు. (సామెతలు 15:1) వినయం, మృదు స్వభావం, సహనం ఉంటే మీరు మీవాళ్లతో సత్సంబంధాలను పెంపొందించుకోగలుగుతారు, ఎప్పటికీ ‘ప్రేమతో ఒకరినొకరు సహించగలుగుతారు.’—ఎఫెసీయులు 4:1, 2.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీ అత్తామామలు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారనే విషయం మిమ్మల్ని ఆందోళనపెడుతుంటే, మీ జీవిత భాగస్వామి ప్రశాంతంగా ఉన్నప్పుడు తనతో ఆ విషయాన్ని చర్చించండి

  • ఏమి చేస్తే బాగుంటుందనే దాని గురించి ఇద్దరూ ఏకాభిప్రాయానికి రండి