కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

“ఇదే సత్యమని నేను నమ్మకం కుదుర్చుకున్నాను”

“ఇదే సత్యమని నేను నమ్మకం కుదుర్చుకున్నాను”
  • పుట్టిన సంవత్సరం: 1982

  • దేశం: డొమినికన్‌ రిపబ్లిక్‌

  • ఒకప్పుడు: మోర్మన్‌గా పెరిగాను

నా గతం:

నేను డొమినికన్‌ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగోలో పుట్టాను. మేము నలుగురు పిల్లలం, నేను అందరికన్నా చిన్నవాణ్ణి. మా అమ్మానాన్నలు బాగా చదువుకున్నవాళ్లు, కాబట్టి తమ పిల్లల్ని మంచివాళ్లు-నిజాయితీపరుల మధ్య పెంచాలనుకున్నారు. నేను పుట్టడానికి నాలుగేళ్ల ముందు వాళ్లకు మోర్మన్‌ మిషనరీలు పరిచయమయ్యారు. వాళ్లలో యువకులు ఎంతో నీటుగా రెడీ అయ్యేవాళ్లు, చాలా మర్యాదగా నడుచుకునేవాళ్లు. అది అమ్మానాన్నలకు ఎంత నచ్చిందంటే, ఆ దీవిలో మోర్మన్‌ చర్చిలో చేరే తొలి కుటుంబాల్లో తమ కుటుంబం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారు. దానికి ఇంకో పేరు, చర్చ్‌ ఆఫ్‌ జీసస్‌ క్రైస్ట్‌ ఆఫ్‌ లేటర్‌-డే సెయింట్స్‌.

నేను ఎదుగుతుండగా, చర్చీలో జరిగే సరదా కార్యకలాపాల్ని ఇష్టపడేవాడిని. కుటుంబ జీవితానికి, నైతిక విలువలకు వాళ్లిచ్చే ప్రాముఖ్యత చూసి వాళ్లమీద గౌరవం ఏర్పడింది. నేను ఒక మోర్మన్‌గా ఉన్నందుకు గర్వపడేవాడిని, ఏదో ఒకరోజు మిషనరీ అవ్వాలనేది నా లక్ష్యం.

నాకు 18 ఏళ్లప్పుడు, నేనొక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలని మా కుటుంబమంతా అమెరికాకు వచ్చాం. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, ఫ్లోరిడాలో ఉంటున్న మమ్మల్ని కలవడానికి మా పిన్ని-బాబాయి వచ్చారు. వాళ్లు యెహోవాసాక్షులు, ఒక సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ నా చుట్టు ఉన్నవాళ్లంతా లేఖనాలు తీసి చూడడం, నోట్స్‌ రాసుకోవడం నాకు బాగా నచ్చింది. దాంతో నేను కూడా ఒక పెన్ను, పేపరు అడిగి నోట్స్‌ రాయడం మొదలుపెట్టాను.

సమావేశం తర్వాత, నేను ఎలాగూ మిషనరీ అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి బైబిలు గురించి తెలుసుకోవడానికి నాకు సహాయం చేస్తామని పిన్ని-బాబాయి చెప్పారు. ఆ సమయంలో నాకు బైబిలు కన్నా మోర్మన్‌ పుస్తకమే బాగా తెలుసు, కాబట్టి వాళ్లతో సరే అన్నాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

మేము ఫోన్లో బైబిలు గురించి మాట్లాడుకునేటప్పుడు, నా నమ్మకాలు బైబిలు ప్రకారం ఉన్నాయో లేదో పోల్చి చూసుకోమని పిన్ని-బాబాయి ఎప్పుడూ చెప్పేవాళ్లు. ఇదే సత్యమని నేనే స్వయంగా నమ్మకం కుదుర్చుకోవాలని చెప్పారు.

మోర్మన్‌ మతంలోని ఎన్నో విషయాలను నేను నమ్ముతున్నాను, కానీ అవి లేఖనాల ప్రకారం ఉన్నాయో లేదో నాకు సరిగ్గా తెలీదు. మా పిన్ని నాకు యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఇంగ్లీషు) నవంబరు 8, 1995 సంచిక పంపించింది. అందులో మోర్మన్‌ మతం గురించి కొన్ని ఆర్టికల్స్‌ ఉన్నాయి. అది చదివాక, నాకు మోర్మన్‌ మతంలోని చాలా బోధల గురించి అంతగా తెలీదని అర్థమైంది, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ పత్రికలో చెప్పిన విషయాలు నిజమో కాదో రూఢి చేసుకోవడానికి మోర్మన్‌ అధికారిక వెబ్‌సైట్‌ చూశాను. అవన్నీ నిజమే. నేను యూటాలో ఉన్న మోర్మన్‌ మ్యూజియంలకు వెళ్లినప్పుడు అవన్నీ నిజాలని ఇంకా బలంగా రుజువైంది.

నేను ఎప్పుడూ మోర్మన్‌ పుస్తకం, బైబిలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా లేవని నమ్మాను. కానీ బైబిల్ని ఇంకాస్త జాగ్రత్తగా చదివినప్పుడు, మోర్మన్‌ బోధల్లో కొన్ని బైబిలు చెప్పేదానికి విరుద్ధంగా ఉన్నాయని గమనించాను.

సిద్ధాంతపరమైన తేడాలే కాక, మోర్మన్‌లు బోధించే జాతీయవాద ఆలోచనలు కూడా నన్ను ఇబ్బందిపెట్టాయి. ఉదాహరణకు, ఏదెను తోట అమెరికాలోని మిస్సోరీకి చెందిన జాక్సన్‌ కౌంటీలో ఉందని మోర్మన్‌లకు బోధిస్తారు. అంతేకాదు, “దేవుని రాజ్యం పరిపాలన మొదలుపెట్టినప్పుడు, స్వేచ్ఛ-సమాన హక్కులు అనే జెండాకర్ర మీద అమెరికా జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది” అని ఆ చర్చీ ప్రవక్తలు బోధిస్తారు.

మరి నేను పుట్టిన దేశం సంగతి, వేరే దేశాల సంగతి ఏంటని ఆలోచించాను. మోర్మన్‌ మిషనరీగా ట్రైనింగ్‌ తీసుకుంటున్న ఒక యువకుడి నుండి ఒక రోజు సాయంత్రం నాకు ఫోన్‌ వచ్చింది, అప్పుడు నేను ఆ విషయం గురించి ప్రస్తావించాను. మీ దేశానికి వేరే దేశానికి యుద్ధం జరిగితే, ఆ దేశానికి చెందిన తోటి మోర్మన్‌లతో పోరాడతావా అని సూటిగా అడిగాను. అతను “పోరాడతాను” అని చెప్పేసరికి ఆశ్చర్యపోయాను! నేను మోర్మన్‌ బోధల్ని ఇంకా లోతుగా పరిశోధించాను, బాధ్యతగల స్థానాల్లో ఉన్న మోర్మన్‌ చర్చి నాయకులతో మాట్లాడాను. నా ప్రశ్నలకు సంబంధించిన జవాబుల్లో మర్మాలు దాగి ఉన్నాయని, వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుండగా ఒకరోజు అవి వెల్లడౌతాయని నాకు చెప్పారు.

వాళ్లు ఇచ్చిన వివరణ విని నేను నిరుత్సాహపడ్డాను. దాంతో నా గురించి, నేను మోర్మన్‌ మిషనరీ ఎందుకు అవ్వాలనుకున్నాను అనేదాని గురించి తీవ్రంగా ఆలోచించాను. నేను మిషనరీ అవ్వాలని కోరుకోవడానికి ఒక కారణం, ప్రజలకు సహాయం చేయవచ్చని. ఇంకో కారణం, అందరూ నన్ను గౌరవిస్తారని. కానీ దేవుని విషయానికొస్తే, ఆయన గురించి నాకు అంతగా తెలీదనే చెప్పాలి. గతంలో నేను చాలాసార్లు బైబిల్ని తిరగేశాను కానీ దాని విలువను నిజంగా గుర్తించలేదు. భూమిని, మనుషుల్ని దేవుడు ఎందుకు చేశాడో నాకు అస్సలు తెలీదు.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అందులో కొన్ని: దేవుని పేరు ఏంటి, చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది, దేవుని సంకల్పం నెరవేర్చడంలో యేసు పాత్ర ఏంటి అనేవి. అలా చివరికి బైబిలు అనే అద్భుతమైన పుస్తకంలో ఏముందో తెలుసుకుంటూ, నేర్చుకున్న సత్యాల్ని ఉత్సాహంగా ఇతరులతో పంచుకోవడం మొదలుపెట్టాను. దేవుడు ఉన్నాడని నేను ఎప్పుడూ నమ్మేవాణ్ణి, అయితే ఇప్పుడు ఒక మంచి స్నేహితునితో మాట్లాడినట్టు ప్రార్థనలో ఆయనతో మాట్లాడగలను. 2004 జూలై 12వ తేదీన నేను ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాను. ఆరు నెలల తర్వాత పూర్తికాల క్రైస్తవ పరిచర్య మొదలుపెట్టాను.

నేను న్యూయార్క్‌ బ్రూక్లిన్‌లోని యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఐదేళ్లు సేవ చేశాను. భూమంతటా ఉన్న ప్రజలకు ఉపయోగపడే బైబిళ్లు, బైబిలు పుస్తకాలు ప్రచురించే పనిలో అక్కడ సహాయం చేశాను. అందులో చెప్పలేనంత సంతోషం పొందాను. ఇప్పటికీ దేవుని గురించి నేర్చుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాను.