కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 26

భూమి మళ్లీ ఒక పరదైసులా మారుతుంది

భూమి మళ్లీ ఒక పరదైసులా మారుతుంది

క్రీస్తు పరిపాలించే రాజ్యం ద్వారా యెహోవా తన పేరును పరిశుద్ధపర్చుకొని, మనుషులను పరిపాలించే హక్కు తనకుందని నిరూపించుకొని, దుష్టత్వాన్ని తీసేస్తాడు

బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము లేక దర్శన గ్రంథం మనుషులందరిలో భవిష్యత్తు మీద ఆశను చిగురింపజేస్తుంది. అపొస్తలుడైన యోహాను రాసిన ఈ పుస్తకంలో దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుందో చూపించే దర్శనాలు నమోదు చేయబడ్డాయి.

మొదటి దర్శనంలో, పునరుత్థానమైన యేసు కొన్ని సంఘాలను మెచ్చుకొని, కావాల్సిన దిద్దుబాటును ఇచ్చాడు. తర్వాతి దర్శనంలో, పరలోకంలోని దేవుని సింహాసనం ముందు ఆత్మ ప్రాణులు ఆయనను స్తుతిస్తూ ఉండడం యోహాను చూశాడు.

దేవుని సంకల్ప నెరవేర్పులో భాగంగా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు ఏడు ముద్రలతోవున్న గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఆయన నాలుగు ముద్రలను విప్పినప్పుడు సూచనార్థకమైన గుర్రపురౌతులు ప్రపంచ తెరమీదికి వచ్చారు. తెల్లని గుర్రం మీద కిరీటాన్ని ధరించిన యేసుక్రీస్తే మొదటి గుర్రపురౌతు. తర్వాత వచ్చిన రౌతులు వేర్వేరు రంగుల్లోవున్న గుర్రాలపై వచ్చారు. వాళ్లు, ఈ లోక విధానపు చివరి రోజుల్లో జరిగే యుద్ధాలకు, కరువులకు, తెగుళ్లకు సూచనగా ఉన్నారు. ఏడవ ముద్ర విప్పినప్పుడు దేవదూతలు దేవుని తీర్పులకు ప్రతీకగావున్న ఏడు బూరలు ఊదారు. దాంతో దేవుని కోపానికి సూచనగావున్న ఏడు తెగుళ్లు వచ్చాయి.

అప్పుడే పుట్టిన మగశిశువుతో పోల్చబడిన దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడింది. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది, సాతాను అతని దయ్యాలు భూమ్మీదికి పడద్రోయబడ్డారు. దాంతో ఒక పెద్ద స్వరం ‘భూమికి శ్రమ’ అని చెప్పింది. అపవాది తనకు కొంచెం కాలమే ఉందని తెలిసి కోపంతో ఉన్నాడు.—ప్రకటన 12:12.

యోహాను పరలోకంలో యేసుక్రీస్తుకు సూచనగా ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాడు. ఆయనతోపాటు భూమ్మీదినుంచి దేవుడు ఎంపిక చేసిన 1,44,000 మందిని కూడా చూశాడు. వీళ్లు యేసుతో కలిసి ‘రాజ్యం చేస్తారు’ అంటే పరిపాలిస్తారు. ప్రకటన గ్రంథం, దేవుడు వాగ్దానం చేసిన సంతానంలో 1,44,000 మంది కూడా ఉంటారని తెలియజేసింది.—ప్రకటన 14:1; 20:6.

భూపాలకులంతా హార్‌మెగిద్దోను యుద్ధానికి అంటే ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరిగే’ యుద్ధానికి సమకూడతారు. పరలోక సైన్యాలను నడిపిస్తూ తెల్లని గుర్రం మీద కూర్చొనివున్న యేసుతో వాళ్లు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో భూపాలకులంతా నాశనమవుతారు. యేసు సాతానును బంధిస్తాడు. ఆయన, ఆయనతోపాటు 1,44,000 మంది ఈ భూమిని ‘వెయ్యి సంవత్సరాలు’ పరిపాలిస్తారు. వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో సాతాను పూర్తిగా నాశనం చేయబడతాడు.—ప్రకటన 16:14; 20:4.

క్రీస్తు తన సహపరిపాలకులతో కలిసి చేసే వెయ్యేండ్ల పరిపాలనలో, విధేయత చూపించే మనుషులకు ఎలాంటి మంచి జరుగుతుంది? “[యెహోవా] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను” అని యోహాను రాశాడు. (ప్రకటన 21:4) భూమి అప్పుడొక పరదైసులా మారుతుంది!

ప్రకటన గ్రంథంతో బైబిల్లోని సందేశం ముగుస్తుంది. మెస్సీయ రాజ్యం యెహోవా నామంపైవున్న అపనిందను పూర్తిగా తీసేసి, ఆయనకు మాత్రమే పరిపాలించే హక్కు ఉందని శాశ్వతంగా నిరూపిస్తుంది.

ప్రకటన గ్రంథము.