కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనష్షే వంశంవాళ్లు ఎక్కడ జీవించారో తెలిపే పురావస్తు ఆధారాలు

మనష్షే వంశంవాళ్లు ఎక్కడ జీవించారో తెలిపే పురావస్తు ఆధారాలు

 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక, ఆ దేశాన్ని గోత్రాలవారీగా పంచుకున్నారని బైబిలు చెప్తుంది. ఆ సమయంలో, మనష్షే గోత్రంలోని పది వంశాలవాళ్లు యొర్దానుకు పశ్చిమాన ఉన్న ప్రాంతాలు పొందారు; మిగిలిన గోత్రాలవాళ్లు వేరే ప్రాంతాలు పొందారు. (యెహోషువ 17:1-6) ఇది నిజంగా జరిగిందని చెప్పడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా?

 1910 లో సమరయలో తవ్వకాలు జరిపినప్పుడు, కొన్ని వివరాలు చెక్కి ఉన్న కుండపెంకులు బయటపడ్డాయి. వాటిమీదున్న వివరాలు హీబ్రూ భాషలో చెక్కి ఉన్నాయి. రాజధాని నగరంలో ఉన్న రాజభవనానికి ద్రాక్షారసం, నూనెతోపాటు, ఇంకొన్ని ఖరీదైన వస్తువులు పంపినట్టు ఆ వివరాలు తెలియజేస్తున్నాయి. ఆ తవ్వకాల్లో సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన 102 కుండపెంకులు దొరికినప్పటికీ, వాటిలో 63 పెంకుల మీదున్న సమాచారం మాత్రమే చదవడానికి వీలుగా ఉంది. ఆ సమాచారం అంతటినీ జతచేసి చూస్తే కొన్ని తేదీలు, వంశాల పేర్లతోపాటు, వస్తువులను పంపినవాళ్ల వివరాలు, వాటిని తీసుకున్నవాళ్ల వివరాలు తెలుస్తున్నాయి.

 సమరయ కుండపెంకుల మీద నమోదు చేయబడిన వివరాలన్నీ మనష్షే గోత్రంవాళ్లవే అవ్వడం విశేషం. NIV ఆర్కియోలాజికల్‌ స్టడీ బైబిలు ఇచ్చిన నివేదికలో ఇలా ఉంది, “మనష్షే వంశంవాళ్లు స్థిరపడ్డారని బైబిలు చెప్తున్న ప్రాంతాల్లోనే వాళ్లు నిజంగా జీవించారని ఈ ఆధారాలు రుజువు చేస్తున్నాయి.”

మనష్షే వంశస్థురాలైన నోవహు అనే స్త్రీ పేరు దీని మీద చెక్కి ఉంది

 అంతేకాదు బైబిలు రచయిత అయిన ఆమోసు, తన కాలంలోని ధనవంతుల గురించి చెప్పిన మాటలు ఖచ్చితమైనవని కూడా ఈ కుండపెంకులు రుజువు చేస్తున్నాయి. ఆమోసు ఇలా రాశాడు: “పాత్రలలో ద్రాక్షారసముపోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు.” (ఆమోసు 6:1, 6) ఆయన ప్రస్తావించిన లాంటి సరుకులను మనష్షే గోత్రంలోని పది వంశాలవాళ్లు నివసించిన ప్రాంతానికి దిగుమతి చేసేవాళ్లని సమరయ కుండపెంకులు ధృవీకరిస్తున్నాయి.