కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజైన దావీదు నిజమైన వ్యక్తని నిరూపించే పురావస్తుశాస్త్ర ఆధారం

రాజైన దావీదు నిజమైన వ్యక్తని నిరూపించే పురావస్తుశాస్త్ర ఆధారం

 బైబిలు ప్రకారం, ఇశ్రాయేలు రాజైన దావీదు క్రీ.పూ. 11వ శతాబ్దంలో జీవించాడు. ఆయన వంశస్థులు వందల సంవత్సరాలపాటు పరిపాలించారు. కానీ, కొంతమంది విమర్శకులు, దావీదు కేవలం కట్టుకథల్లోని వ్యక్తని, ఎన్నో సంవత్సరాల తర్వాత మనుషులు సృష్టించిన ఒక కథానాయకుడని వాదించారు. మరి దావీదు ఒక నిజమైన వ్యక్తా?

 1993లో పురావస్తు శాస్త్రజ్ఞుడైన అవ్రహామ్‌ బిరాన్‌, ఆయన టీమ్‌ ఉత్తర ఇశ్రాయేలులోని టెల్‌ డాన్‌లో ఒక రాతి ముక్కను కనుగొన్నారు. దానిమీద “దావీదు సంతతి”ని సూచించే మాటలు చెక్కి ఉన్నాయి. యూదుల ప్రాచీన కాలపు భాషలోని ఆ మాటలు క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో చెక్కబడ్డాయి. అరామీయులు ఇశ్రాయేలీయుల్ని యుద్ధంలో ఎన్నోసార్లు ఓడించినందుకు కట్టుకున్న ఒక స్మారక నిర్మాణం నుండి ఆ రాయి వచ్చిందని స్పష్టమౌతుంది.

 బైబిల్‌ హిస్టరీ డైలీలో వచ్చిన ఒక ఆర్టికల్‌ ఇలా అంటుంది: “‘దావీదు సంతతి’ అనే మాటలున్న రాయిని చాలామంది విమర్శించారు ... కానీ, టెల్‌ డాన్‌లో దొరికిన ఆ రాయి బైబిల్లోని రాజైన దావీదు నిజమైన వ్యక్తని నిరూపిస్తున్న మొదటి తిరుగులేని ఆధారమని చాలామంది బైబిలు పండితులు, పురావస్తుశాస్త్రజ్ఞులు ఒప్పుకున్నారు. బి.ఏ.ఆర్‌ [బిబ్లికల్‌ ఆర్కియాలజీ రివ్యూ అనే వైజ్ఞానిక పత్రిక] పత్రికలో నివేదించిన బైబిలు పురావస్తు ఆవిష్కరణల్లో ఇది చాలా ముఖ్యమైనది.”