కంటెంట్‌కు వెళ్లు

రోమ్‌లోని ది ప్యాలెస్‌ ఆఫ్‌ జస్టిస్‌, ఇక్కడే ఇటలీలోని అత్యున్నత అప్పీల్‌ కోర్టు ఉంది.

2021, ఫిబ్రవరి 9
ఇటలీ

యెహోవాసాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఇటలీలోని అత్యున్నత అప్పీల్‌ కోర్టు

యెహోవాసాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఇటలీలోని అత్యున్నత అప్పీల్‌ కోర్టు

ఇటలీలోని అత్యున్నత అప్పీల్‌ కోర్టు, వైద్య చికిత్సను ఎంచుకునే విషయంలో పేషెంట్‌కి ఉండే హక్కులను సమర్థిస్తూ ఒక యెహోవాసాక్షికి అనుకూలంగా తీర్పిచ్చింది. 2020, డిసెంబరు 23న అత్యున్నత అప్పీల్‌ కోర్టు ఏం చెప్పిందంటే, ప్రతీ పేషెంట్‌కు తాను ఇష్టపడే చికిత్సను అంటే, తన మత నమ్మకాలకు వ్యతిరేకంగా లేని చికిత్సను ఎంచుకునే హక్కు ఉంటుంది.

ఇది 2005 లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన కేసు. మన సహోదరి తన సర్జరీకి ముందే రక్తం ఎక్కించుకోనని డాక్టర్లకి స్పష్టంగా చెప్పింది, తన డిపిఎ కార్డును కూడా చూపించింది. కానీ డాక్టర్లు తన హక్కును గౌరవించలేదు, ఆమె ఇష్టాన్ని పట్టించుకోకుండా చాలాసార్లు రక్తం ఎక్కించారు.

రక్తం ఎక్కించుకోకపోవడం అనేది, తమ ఇష్టాయిష్టాల ప్రకారం తీసుకునే ఒక మామూలు నిర్ణయం కాదని, పేషెంట్‌కున్న మత నమ్మకాల కారణంగా, మనస్సాక్షికి అనుగుణంగా తీసుకునే చాలా ముఖ్యమైన నిర్ణయం అని కోర్టు గుర్తించింది. ఈ స్వేచ్ఛను రాజ్యాంగమే కల్పిస్తుందని, ఎవ్వరూ ఈ హక్కుని మీరకూడదని, దాన్ని చాలా పవిత్రంగా చూస్తామని కోర్టు చెప్పింది.

ఇటలీలోని అత్యున్నత అప్పీల్‌ కోర్టు, 2015 నుంచి యెహోవాసాక్షులకు అనుకూలంగా ఇచ్చిన వరుస తీర్పుల్లో ఇది పదోది. ప్రతీ కేసులో, మన మత స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను కోర్టు సమర్థిస్తూ వచ్చింది. ఆ కేసుల్లో చర్చించుకున్న కొన్ని విషయాలు ఇవి:

  • రక్త మార్పిడులను నిరాకరించడం: యెహోవాసాక్షులు వీలైనంత మంచి వైద్యాన్ని తీసుకోవాలని అనుకుంటారు. కొన్నిటిని తప్ప, చాలా రకాల ట్రీట్‌మెంట్‌లను తీసుకుంటారు. యెహోవాసాక్షులైన పేషెంట్‌లకు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని బట్టి చికిత్సను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని కోర్టులు నిర్ధారించాయి. ఎవరైనా రక్తం ఎక్కించుకోనని చెప్తే, వాళ్ల నిర్ణయాన్ని డాక్టర్లు గౌరవించాలి. తమ మత నమ్మకాలకు అనుగుణంగా అలాంటి నిర్ణయం తీసుకునే చట్టపరమైన హక్కు పేషెంట్లకు ఉంది.

  • పిల్లల సంరక్షణ: సాక్షులుకాని తల్లిదండ్రులకు ఉన్నట్టే, సాక్షులైన తల్లిదండ్రులకు కూడా తమ మత నమ్మకాల గురించి పిల్లలకు చెప్పే హక్కు ఉంది.

  • బహిష్కరణ: బహిష్కరించబడిన వాళ్లతో యెహోవాసాక్షులు అన్యాయంగా ప్రవర్తించరు. వాళ్ల సంఘాల్లో ఎవరైనా బహిష్కరించబడితే, వాళ్లతో సహవసించకూడదని సాక్షులు నిర్ణయించుకోవచ్చు. అది వాళ్ల మత స్వేచ్ఛలో భాగమే. దాన్ని ఇతరులు గౌరవించాలి.

  • పన్నులు: యెహోవాసాక్షులు పన్నులు చెల్లిస్తారు. ఆరాధనా స్థలాలపై విధించే పన్నుల విషయంలో ఇటలీలోని ఇతర మతాలలాగే, యెహోవాసాక్షులు కూడా తగిన హక్కులు, మినహాయింపులు పొందడానికి అర్హులు.

స్వేచ్ఛగా ఆరాధించుకునే విషయంలో యెహోవా ప్రజలకు ఉండే హక్కుల్ని సమర్థిస్తూ అధికారులు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మేమెంతో సంతోషిస్తాం.—సామెతలు 21:1.