కంటెంట్‌కు వెళ్లు

క్రిస్మస్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

క్రిస్మస్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 యేసు పుట్టిన తేదీ గురించి గానీ, మనం ఆయన పుట్టిన రోజును జరుపుకోవాలని గానీ బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. మెక్‌ క్లిన్‌టాక్‌, స్ట్రాంగ్‌ల సైక్లోపీడియాలో ఇలా ఉంది: ‘క్రిస్మస్‌ను ఆచరించమని దేవుడు చెప్పలేదు, కొత్త నిబంధనలో కూడా ఆ ఆచరణ గురించి ఏమీ లేదు.’

 క్రిస్మస్‌ పుట్టుపూర్వోత్తరాలను పరిశీలిస్తే, అది అన్యమతాచారాల నుండి వచ్చిందని తెలుస్తోంది. దేవున్ని ఆయనకు ఇష్టంలేని పద్ధతిలో ఆరాధిస్తే ఆయన ఇష్టపడడని బైబిలు చెప్తుంది.—నిర్గమకాండము 32:5-7.

క్రిస్మస్‌ ఆచారాలకు సంబంధించిన చరిత్ర

  1.   యేసు పుట్టిన రోజును జరుపుకోవడం: “తొలి క్రైస్తవులు యేసు పుట్టినరోజును పండుగలా జరుపుకోలేదు, ఎందుకంటే పుట్టినరోజును పండుగలా జరుపుకోవడాన్ని వాళ్లు అన్యమత ఆచారంగా భావించేవాళ్లు.”—ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా.

  2.   డిసెంబర్‌ 25: యేసు ఆ రోజున పుట్టాడనడానికి ఏ ఆధారమూ లేదు. అన్యమతాలవాళ్లు, చలికాలంలో పగలు అతి తక్కువగా ఉండే రోజును పండుగగా జరుపుకునే వాళ్లు. కాబట్టి ఆ తేదీ లేదా దానికి దగ్గరున్న రోజు వచ్చేలా చర్చి నాయకులు డిసెంబరు 25ను యేసు పుట్టినరోజుగా ఎన్నుకున్నారు.

  3.   బహుమతులు ఇచ్చుకోవడం, విందులు, పార్టీలు చేసుకోవడం: ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఇలా చెప్తుంది: “రోమన్లు డిసెంబరు మధ్యలో సాటర్నేలియా అనే పండుగ చేసుకునేవాళ్లు. ఆ పండుగను ఆచరించే పద్ధతిలోనే క్రిస్మస్‌ను కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు ఈ పండుగ నుంచే పెద్దపెద్ద విందులు చేసుకోవడం, బహుమతులు ఇచ్చుకోవడం, కొవ్వొత్తులు వెలిగించడం వంటివి వచ్చాయి.” సాటర్నేలియా పండుగ రోజున “అన్ని రకాల పనులకు, వ్యాపారాలకు సెలవు ప్రకటించేవాళ్లు” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది.

  4.   క్రిస్మస్‌ లైట్లు: ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలీజియన్‌ ప్రకారం, పగలు అతి తక్కువగా ఉండి వేడుక జరుపుకునే రోజున, దుష్ట శక్తులతో పోరాడడానికి యూరోపియన్లు తమ ఇళ్లను “లైట్లతో, సంవత్సరమంతా పచ్చగా ఉండే ఓ రకమైన చెట్లతో” అలంకరించుకునేవాళ్లు.

  5.   మిసల్‌టో, హోల్లీ: ఇవి క్రిస్మస్‌ అలంకరణల్లో ఎక్కువగా ఉపయోగించే మొక్కలు. “ఈ మిసిల్‌టో మొక్కలకు అద్భుత శక్తులు ఉంటాయని కొంతమంది మతగురువులు చెప్పేవాళ్లు. హోల్లీ చెట్లను వెచ్చదనానిచ్చే సూర్యుడు తప్పకుండా వస్తాడనడానికి గుర్తుగా ఆరాధించేవాళ్లు.”—ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా.

  6.   క్రిస్మస్‌ చెట్టు: “యూరప్‌ దేశాల్లోని అన్యమతాల వాళ్లు చెట్లను ఎక్కువగా ఆరాధించేవాళ్లు. క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా వాళ్లు ఆ పద్ధతిని కొనసాగించారు.” “చలికాలం మధ్యలో వచ్చే సెలవుల్లో యూల్‌ చెట్టును (క్రిస్మస్‌ చెట్టు) గుమ్మం దగ్గర గానీ, ఇంట్లో గానీ పెట్టుకోవడం” ద్వారా చెట్లను ఆరాధించే ఆచారాన్ని కొనసాగించారు.—ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.