కంటెంట్‌కు వెళ్లు

“ముగ్గురు జ్ఞానులు” ఎవరు? వాళ్లు బేత్లెహేము “నక్షత్రాన్ని” వెంబడించారా?

“ముగ్గురు జ్ఞానులు” ఎవరు? వాళ్లు బేత్లెహేము “నక్షత్రాన్ని” వెంబడించారా?

బైబిలు ఇచ్చే జవాబు

 యేసు పుట్టాక ఆయనను చూడడానికి “ముగ్గురు జ్ఞానులు” లేదా “ముగ్గురు రాజులు” వెళ్లారని క్రిస్మస్‌ పండుగప్పుడు చర్చీల్లో చెప్తుంటారు. కానీ, బైబిలు వాళ్లను అలా వర్ణించట్లేదు. (మత్తయి 2:1) సువార్త పుస్తకాన్ని రాసిన మత్తయి వాళ్లను వర్ణించడానికి మాయీ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. ఆ పదానికి, జ్యోతిష్యం-మంత్రతంత్రాలు లాంటివాటిలో నిపుణులు అనే అర్థం ఉండొచ్చు. a చాలా బైబిలు అనువాదాల్లో వాళ్ల గురించి చెప్తున్నప్పుడు “జ్యోతిష్యులు” లేదా “మాగై” అనే పదాలు ఉపయోగించబడ్డాయి. b

 ఎంతమంది “జ్ఞానులు” ఉన్నారు?

 బైబిలు ఆ విషయం చెప్పడం లేదు. దీని గురించి చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెప్తుంది, “జ్ఞానులు 12 మంది ఉన్నారని ఆసియాలోని చాలామంది అనుకుంటారు. బహుశా, శిశువుకు ఇచ్చిన మూడు బహుమానాలు అంటే ‘బంగారము సాంబ్రాణి బోళమును’ బట్టి (మత్తయి 2:11) “జ్ఞానులు” ముగ్గురని యూరప్‌లో, అమెరికాలో ఉండే చాలామంది అనుకుంటారు.”

 ఆ “జ్ఞానులు” రాజులా?

 క్రిస్మస్‌ కథలో వాళ్లను రాజులుగా చూపిస్తారు కానీ బైబిల్లో ఎక్కడా వాళ్లు రాజులు అని లేదు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, యేసు పుట్టిన వందల సంవత్సరాల తర్వాత ఆయన పుట్టుక గురించిన కథకు ప్రజలు కొత్త వివరాలు జోడించారు, ఆ సమయం నుండి ఆ జ్యోతిష్యుల్ని చాలామంది రాజులు అని పిలవడం మొదలుపెట్టారు.

 ఆ “జ్ఞానుల” పేర్లేంటి?

 ఆ జ్యోతిష్యుల పేర్లేంటో బైబిలు చెప్పడం లేదు. కానీ కల్పిత కథల్లో వాళ్లకు గస్పార్‌, మెల్కీయోర్‌, బాల్తాజార్‌ అనే పేర్లు ఉన్నాయని ద ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిలు ఎన్‌సైక్లోపీడియా చెప్తుంది.

 ఆ “జ్ఞానులు” యేసును చూడడానికి ఎప్పుడు వెళ్లారు?

 యేసు పుట్టి చాలా నెలలు గడిచాకే జ్యోతిష్యులు ఆయన్ని చూడడానికి వెళ్లి ఉండొచ్చు. ఇలా ఎందుకు చెప్పవచ్చంటే, రాజైన హేరోదు యేసును చంపాలని అనుకున్నప్పుడు రెండు సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయసున్న మగపిల్లలందర్నీ చంపేయమని ఆజ్ఞాపించాడు. జ్యోతిష్యుల నుండి ఆయన తెలుసుకున్న సమాచారాన్ని బట్టే ఆయన ఆ వయసు పిల్లల్ని చంపించాడు.—మత్తయి 2:16.

 యేసు పుట్టిన రాత్రే జ్యోతిష్యులు ఆయన దగ్గరకు వెళ్లలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఆ పిల్లవాడు తన తల్లి మరియ దగ్గర ఉండడం చూశారు.” (మత్తయి 2:11) దీనిబట్టి అప్పటికే యేసు కుటుంబం ఒక ఇంట్లోకి మారారని, ఆయన ఇంకా పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువుగా లేడని అర్థమౌతుంది.—లూకా 2:16.

 ఆ “జ్ఞానులు” బేత్లెహేము “నక్షత్రాన్ని” వెంబడించేలా దేవుడే చేశాడా?

 జ్యోతిష్యుల్ని యేసు దగ్గరకు నడిపించడానికి దేవుడే బేత్లెహేము నక్షత్రంగా పిలువబడే నక్షత్రాన్ని పంపించాడని కొంతమంది నమ్ముతారు. అయితే అది నిజం కాదనడానికి కొన్ని విషయాల్ని పరిశీలించండి.

  •   ఆ “నక్షత్రం” జ్యోతిష్యుల్ని ముందు యెరూషలేముకు నడిపించింది. బైబిలు ఇలా చెప్తుంది: “తూర్పు నుండి జ్యోతిష్యులు యెరూషలేముకు వచ్చి, ఇలా అడిగారు: ‘యూదుల రాజుగా పుట్టిన బాబు ఎక్కడున్నాడు? మేము తూర్పున ఉన్నప్పుడు ఆయన నక్షత్రాన్ని చూశాం; ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలని వచ్చాం.’”—మత్తయి 2:1, 2.

  •   జ్యోతిష్యుల్ని ముందు బేత్లెహేముకు నడిపించింది ఆ “నక్షత్రం” కాదుకానీ, రాజైన హేరోదు. తనకు పోటీ వస్తున్న “యూదుల రాజు” గురించి హేరోదు విన్నప్పుడు, వాగ్దానం చేయబడిన క్రీస్తు ఎక్కడ పుడతాడో కనుక్కున్నాడు. (మత్తయి 2:3-6) అది బేత్లెహేములో అని తెలిసినప్పుడు జ్యోతిష్యుల్ని అక్కడికి వెళ్లి, బాబు కోసం వెదికి, తిరిగి వచ్చి వివరాల్ని చెప్పమన్నాడు.

     ఆ తర్వాతే జ్యోతిష్యులు బేత్లెహేముకు వెళ్లారు. బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు రాజు చెప్పిన మాటలు విని, తమ దారిన తాము వెళ్లారు. అప్పుడు ఇదిగో! వాళ్లు తూర్పున ఉన్నప్పుడు చూసిన ఆ నక్షత్రం వాళ్లకు ముందుగా వెళ్తూ, ఆ పిల్లవాడు ఉన్న చోటికి వచ్చి పైన ఆగింది.”—మత్తయి 2:9.

  •   ఆ “నక్షత్రం” కనిపించడం వల్లే యేసు ప్రాణం ప్రమాదంలో పడింది, ఎంతోమంది అమాయకులైన పిల్లలు చంపబడ్డారు. బేత్లెహేము నుండి జ్యోతిష్యులు బయలుదేరినప్పుడు, తిరిగి హేరోదు దగ్గరకు వెళ్లొద్దని దేవుడు వాళ్లను హెచ్చరించాడు.—మత్తయి 2:12.

 అప్పుడు హేరోదు ఏం చేశాడు? బైబిలు ఇలా చెప్తుంది: “జ్యోతిష్యులు తనను మోసం చేశారని అర్థం చేసుకున్న హేరోదుకు విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు అతను మనుషుల్ని పంపించి బేత్లెహేములో, దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో రెండు సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసున్న మగపిల్లలందర్నీ చంపించాడు. జ్యోతిష్యుల నుండి తాను జాగ్రత్తగా తెలుసుకున్న సమయాన్ని బట్టి అతను అలా చంపించాడు.” (మత్తయి 2:16) దేవుడైతే అలాంటి చెడు చేయడు.—యోబు 34:10.

a క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో జీవించిన హెరోడోటస్‌ అనే గ్రీకు చరిత్రకారుడు, తన కాలంలో ఉన్న మాయీ గురించి చెప్తూ, వాళ్లు మాదీయ (పారసీక) గోత్రానికి చెందినవాళ్లని, అంతేకాదు జ్యోతిష్యంలో, కలల అర్థాన్ని చెప్పడంలో నిపుణులని అన్నాడు.

b పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌, అలాగే పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము బైబిళ్లు చూడండి. పరిశుద్ధ బైబిలు, యేసును కలవడానికి వచ్చినవాళ్లను “జ్ఞానులు” అని పిలిచినప్పటికీ వాళ్లు ముగ్గురు అని చెప్పట్లేదు.