కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉన్నంతలోనే ఎలా జీవించాలి?

ఉన్నంతలోనే ఎలా జీవించాలి?

ఉన్నంతలోనే ఎలా జీవించాలి?

మీఇంట్లో నీళ్ల తొట్టి ఎప్పుడూ నిండుగా ఉండాలంటే ఏం చేస్తారు? దానిలో నీళ్లు వాడుకున్నప్పుడల్లా మళ్లీ నింపుతారు. ఎన్ని నీళ్లు వాడితే అన్ని నీళ్లు తిరిగిపోస్తారు. అప్పుడే అది నిండుగా ఉంటుంది.

ఉన్నంతలో జీవించడం కూడా అలాంటిదే. మీ సంపాదనను తొట్టిలో పోసే నీళ్లు అనుకుంటే, మీ ఖర్చులు అందులో నుండి వాడుకున్న నీళ్లలాంటివి. మీ ఖర్చులు మీ సంపాదనను మించకుండా చూసుకోవాలి, అక్కడే ఉంది అసలు చిక్కు.

ఉన్నంతలో జీవించడమనే సూత్రాన్ని పాటిస్తూ దాన్నుండి ప్రయోజనం పొందడం చెప్పుకున్నంత సులువు కాదు. ఆ సూత్రాన్ని పాటించకపోవడం వల్లే చాలామంది ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. మరైతే ఆ సూత్రాన్ని పాటించడానికి ఏమి చేస్తే బావుంటుంది? ఈ విషయంలో మనకు మంచి సలహాలు ఎక్కడ దొరుకుతాయి? దీనికి బైబిలు ఎంతో చక్కగా సహాయం చేస్తుంది. అదెలాగో ఒకసారి చూద్దాం.

ఉపయోగపడే బైబిలు సూత్రాలు

డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టే విషయంలో బైబిలు ఎన్నో చక్కని సలహాలు ఇస్తుంది. వీటిలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్నంతలో జీవించడానికి ఈ సూత్రాలు మీకు పనికొస్తాయేమో ఆలోచించండి.

చక్కని ప్రణాళిక వేసుకోండి. డబ్బును పొదుపుగా ఖర్చు పెట్టాలంటే మీ సంపాదన ఎంతో, దేనికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలిసుండాలి. బైబిల్లో ఇలా ఉంది: ‘శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు. తాలిమిలేకుండా పనిచేసేవారికి నష్టమే ప్రాప్తిస్తుంది.’ (సామెతలు 21:5) కొంతమంది “సరుకులకు,” “ఇంటి అద్దెకు,” “బట్టలకు” అని దేనికి దానికి కొంత డబ్బును పక్కనబెడతారు. మీరు ఈ పద్ధతిని పాటించినా, ఇంతకన్నా మెరుగైన వేరే పద్ధతిని పాటించినా, మీరు మీ జీతాన్ని ఎలా ఖర్చుపెడుతున్నారో తెలుసుండాలి. మీరు విలాసాలకు కాకుండా అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలి.

ఈర్ష్య పడకండి. వర్ధమాన దేశాల్లో ఉన్న చాలామంది, సంపన్న దేశాల ప్రజలు వాడే వస్తువుల కోసం వెంపర్లాడతారు. తమ పొరుగువాళ్లు డంబంగా చూపించుకునే వస్తువులు తమ దగ్గర కూడా ఉండాలని సాధారణంగా ప్రజలు ఆరాటపడుతుంటారు. పైకి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. బహుశా ఆ పొరుగువాళ్లు కూడా అప్పు చేసి ఆ వస్తువులు కొనుక్కున్నారేమో! వాళ్ళలా మీరు కూడా తెలివితక్కువగా ప్రవర్తించి ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకోవడం దేనికి? బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: ‘చూసిన ప్రతీదీ కావాలనుకునే వ్యక్తులు ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి తాపత్రయపడతారు. తమకు దారిద్ర్యం కలగబోతుందని వారికి తెలియదు.’—సామెతలు 28:22, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోండి. కళ్లను “తేటగా” ఉంచుకోమని యేసు తన అనుచరులకు చెప్పాడు. అంటే జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోమని అర్థం. (మత్తయి 6:22) సైకిలు మాత్రమే కొనుక్కునే స్థోమత ఉన్నప్పుడు కారు కొనడానికి ప్రయత్నిస్తే అనవసరమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వాళ్ల ఒక నివేదిక ప్రకారం, ఫిలిప్పీన్స్‌లోని మూడో వంతు ప్రజలు, భారతదేశంలోని సగానికన్నా ఎక్కువమంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. అంటే వాళ్ల సగటు ఆదాయం రోజుకు 60 రూపాయలకన్నా తక్కువే. అంత తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు కనీస అవసరాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఉండాలంటే సంపన్న దేశాల్లో ఉన్నవాళ్లు కూడా అదే సూత్రం పాటించడం మంచిది.

నిజంగా అవసరమైన వాటితో సరిపెట్టుకోండి. మీ జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోండనే పై సలహాకు దీనికి చాలా దగ్గరి సంబంధముంది. బైబిల్లోని 1 తిమోతి 6:7, 8 (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) లో ఈ సలహా ఉంది: “మనకు అన్నవస్త్రాలు ఉంటే, వాటితోనే తృప్తిపడదాం.” కొంతమంది సంపన్నులు కాకపోయినా సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే, వాళ్లు తమకున్న వాటితో సంతృప్తిగా జీవిస్తున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యుల, స్నేహితుల ప్రేమను కూడా సంపాదించుకున్నారు.—సామెతలు 15:17.

అనవసరంగా అప్పులు చేయకండి. “ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 22:7) ఆ మాటలు ఎంత నిజమో కదా! కొన్నిసార్లు అప్పుచేయాల్సిన పరిస్థితులు రావచ్చు, అయితే కంటికి నచ్చినవన్నీ కొనుక్కోవడానికే అప్పులు చేసేవాళ్లు ఆర్థికంగా చితికిపోతారు. క్రెడిట్‌ కార్డులు వాడేవాళ్ల విషయంలో ఇది ఖచ్చితంగా నిజం. “మన చేతుల్లో కార్డు ఉందంటే చాలు ముందూవెనకా ఆలోచించకుండా ప్రవర్తిస్తాం” అని టైమ్‌ పత్రిక చెబుతోంది. ఫిలిప్పీన్స్‌లో నివసిస్తున్న ఎరిక్‌ ఇలా అంటున్నాడు: “క్రెడిట్‌ కార్డు వాడినప్పుడు నేను డబ్బులిచ్చి కొనే దానికన్నా ఎక్కువే కొంటాను. దాంతో, ఆ బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు నేను వేసుకున్న బడ్జెట్‌ దెబ్బతింటుంది.” ఇలా సులువుగా దొరికే అప్పు వాడేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం తెలివైన పని.—2 రాజులు 4:1; మత్తయి 18:25.

ఆదాచేసి కొనుక్కోండి. ఇది పాతకాలం పద్ధతి అనిపించినా, ఏదైనా కొనుక్కోవాలనుకుంటే దానికోసం డబ్బు దాచుకోవడం మంచి పద్ధతి. అలాచేస్తే, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఉంటాం. ఈ పద్ధతి పాటించడం వల్ల, చేసిన అప్పులకు అధిక వడ్డీలు కట్టుకోలేక నానా తంటాలుపడాల్సిన పరిస్థితిని నివారించవచ్చు. అంతేకాదు, కొనే ప్రతీ వస్తువుమీద ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు. చీమలు ‘జ్ఞానంగలవని’ బైబిలు చెబుతోంది, ఎందుకంటే అవి భవిష్యత్తు కోసం, ‘కోతకాలంలో’ కూడా ‘ధాన్యాన్ని’ కూర్చుకుంటాయి.—సామెతలు 6:6-8; 30:24, 25.

వేరేవాళ్లను చూసి నేర్చుకోండి

ఇప్పటివరకు మనం చూసిన బైబిలు సూత్రాలన్నీ బాగానే ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ ఉన్నంతలో జీవించడానికి ఆ సూత్రాలు నిజంగా ఎంతవరకు పనికొస్తున్నాయి? ఆ సూత్రాలు పాటించి ఆర్థిక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొన్న కొంతమంది అనుభవాలు ఇప్పుడు చూద్దాం.

నలుగురు పిల్లల తండ్రి డీయోస్‌డాడో ఈ మధ్య ఎదురైన ఆర్థిక సంక్షోభం వల్ల, తన కుటుంబ అవసరాలను తీర్చడం తనకు కష్టమైందని అంటున్నాడు. అయితే, బడ్జెట్‌ వేసుకోవడం ఎంత మంచిదో ఆయన గ్రహించాడు. ఆయనిలా చెబుతున్నాడు: “నా సంపాదనంతటికీ బడ్జెట్‌ వేసుకున్నాను. దేనికెంత ఖర్చుపెడుతున్నానో రాసిపెట్టుకుంటాను.” డానీలో అనే వ్యక్తి కూడా అదే పద్ధతి పాటిస్తున్నాడు. తనకున్న చిన్న వ్యాపారం దెబ్బతింది. అయినా, జాగ్రత్తగా బడ్జెట్‌ వేసుకోవడం వల్ల కనీస అవసరాలు తీర్చుకుంటున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “ప్రతీనెల ఎంత డబ్బు వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో మాకు తెలుసు. దాన్నిబట్టి మిగతా వాటికి ఎంత ఖర్చుపెట్టాలనేది వివరంగా మాట్లాడుకుంటాం.”

వేసుకున్న బడ్జెట్‌ను మించకుండా ఉండడానికి కొంతమంది కొన్ని విషయాల్లో తమ ఖర్చులను తగ్గించుకోవాలని తెలుసుకున్నారు. భర్త చనిపోయిన, ముగ్గురు పిల్లల తల్లి మర్న ఇలా చెబుతోంది: “ఇప్పుడు మేము కూటాలకు ప్రజా రవాణా వాహనాల్లో వెళ్లకుండా నడుచుకుంటూ వెళ్తున్నాం.” నిరాడంబరంగా జీవించడం మంచిదని తన పిల్లలకు అర్థమయ్యేలా చేయడానికి ఆమె కృషిచేసింది. ఆమె ఇలా చెబుతోంది: “ఉన్నదానిలో సంతృప్తిగా ఉండడం ప్రాముఖ్యమని చెబుతున్న 1 తిమోతి 6:7-10లోని సూత్రాన్ని చక్కగా పాటించి చూపించడానికి ప్రయత్నించాను.”

ఇద్దరు పిల్లల తండ్రి జెరాల్డ్‌ కూడా అలాంటిదే చేశాడు. ఆయనిలా చెబుతున్నాడు: “మా కుటుంబమంతా కలిసి బైబిలు చదువుకుంటున్నప్పుడు జీవితంలో నిజంగా ప్రాముఖ్యమైన వాటికి అంటే దేవుని విషయాలకు ప్రాధాన్యతనిచ్చే క్రైస్తవుల అనుభవాల గురించి మాట్లాడుకుంటాం. దీనివల్ల మంచి ఫలితాలొచ్చాయి, ఎందుకంటే మా పిల్లలు అవసరంలేనివి కొనమని పట్టుబట్టరు.”

ఫిలిప్పీన్స్‌వాసి జానెట్‌ ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఎక్కువ సమయం బైబిలు గురించి స్వచ్ఛందంగా బోధిస్తోంది. ఆమెకు ఈ మధ్యే ఉద్యోగం పోయింది, కానీ ఆమె తనకున్నంతలో జీవిస్తుంది. ఆమె ఇలా చెబుతోంది: “చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని నా దగ్గరున్న వాటిని పొదుపుగా వాడుకుంటాను. నేను మాల్స్‌కు (పెద్దపెద్ద షాపులకు) వెళ్లకుండా చవకగా అమ్మే దుకాణాలకు వెళ్తాను. తక్కువలో దొరుకుతున్నప్పుడు ఎక్కువ డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? బాగా ఆలోచించకుండా ఏదీ కొనను.” ఏదైనా కొనేముందు దానికోసం డబ్బులు ఆదా చేయడం మంచిదని జానెట్‌ గ్రహించింది. అందుకే ఆమె ఇలా అంటోంది: “నా దగ్గర ఏమాత్రం డబ్బులు మిగిలినా వాటిని అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం పక్కనబెడతాను.”

ముందు చెప్పుకున్న ఎరిక్‌, క్రెడిట్‌ కార్డు గురించి ఇలా అంటున్నాడు: “మరీ అవసరమైతే తప్ప క్రెడిట్‌ కార్డు వాడకూడదని నిర్ణయించుకున్నాను.” డీయోస్‌డాడో ఇలా అంటున్నాడు: “క్రెడిట్‌ కార్డును అనవసరంగా వాడకుండా ఉండడానికి దాన్ని ఆఫీసులోనే పెట్టేస్తాను.”

ఉన్నంతలో జీవించడం సాధ్యమే

బైబిల్లో ఆధ్యాత్మిక విషయాల గురించే ఎక్కువగా ఉన్నా, మన రోజువారీ జీవితానికి అవసరమైన ఎన్నో చక్కని సలహాలు కూడా అందులో ఉన్నాయని చాలామంది అనుభవంతో చెబుతున్నారు. (సామెతలు 2:6; మత్తయి 6:25-34) ఈ ఆర్టికల్‌లో చూసిన బైబిలు సూత్రాలను పాటిస్తే, వాటిని పాటించి ప్రయోజనం పొందినవాళ్లను చూసి నేర్చుకుంటే మీరు కూడా ఉన్నంతలో జీవించగలరు. అలా చేస్తే, నేడు లక్షలాదిమంది పడుతున్న ఎన్నో బాధల నుండి, ఆందోళనల నుండి మీరు తప్పించుకోవచ్చు. (w11-E 06/01)

[10వ పేజీలోని బ్లర్బ్‌]

‘దేనికి ఎంత ఖర్చుపెట్టాలో వివరంగా మాట్లాడుకుంటాం’

[11వ పేజీలోని బ్లర్బ్‌]

‘ఇప్పుడు మేము కూటాలకు వాహనాల్లో వెళ్లకుండా, నడుచుకుంటూ వెళ్తున్నాం’

[11వ పేజీలోని బ్లర్బ్‌]

“బాగా ఆలోచించకుండా ఏదీ కొనను”