కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆర్థిక సమస్యలు లేని జీవితం

ఆర్థిక సమస్యలు లేని జీవితం

బైబిలు సూత్రాల్ని పాటించడం ద్వారా చాలామంది ఆర్థిక సమస్యల్ని తగ్గించుకున్నారు.

మంచి ప్రణాళిక వేసుకోండి

బైబిలు సూత్రం: “శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి, తొందరపాటుగా పనిచేసే వాళ్లంతా ఖచ్చితంగా పేదవాళ్లౌతారు.”—సామెతలు 21:5, NW.

అంటే: మీరు ఒక ప్రణాళిక వేసుకుని, దాన్ని ఖచ్చితంగా పాటించాలి. డబ్బు ఖర్చుచేసే ముందే ప్రణాళిక వేసుకోండి. మీరు కోరుకున్న ప్రతీదీ కొనలేరని గుర్తుంచుకోండి. కాబట్టి మీ డబ్బును తెలివిగా ఖర్చు పెట్టండి.

మీరేం చేయవచ్చు:

  • మీ బడ్జెట్‌ను మించి వెళ్లకండి. మీకు ఏమేం ఖర్చులు ఉన్నాయో వాటన్నిటిని ఒక లిస్టుగా రాయండి. ఒక్కోదానికి ఎంత డబ్బు అవసరమో కూడా రాయండి. ఒకవేళ దేనికైనా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయితే, వేరేదానికి ఖర్చుపెట్టే డబ్బును తగ్గించుకోండి. ఉదాహరణకు, పెట్రోల్‌ కోసం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తే, బయటికి వెళ్లి భోజనం చేయడం లాంటి విషయాల్లో ఖర్చులు తగ్గించండి. అంటే, ఏవి అంత ముఖ్యమైనవి కావో వాటిలో ఖర్చులు తగ్గించుకోండి.

  • అనవసరంగా అప్పులు చేయకండి. సాధ్యమైనంత వరకు అప్పులు చేయకండి. బదులుగా, మీకు అవసరమైన వాటికోసం డబ్బులు కూడబెట్టండి. మీకు క్రెడిట్‌ కార్డు ఉంటే, ఏ నెల డబ్బులు ఆ నెలే చెల్లించండి, అప్పుడు వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు. మీకు ఒకవేళ అప్పు ఉంటే, దాన్ని తీర్చేయడానికి ఒక ప్రణాళిక వేసుకోండి, దాన్ని జాగ్రత్తగా పాటించండి.

    క్రెడిట్‌ కార్డును ఉపయోగించేవాళ్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని ఒక పరిశోధన తెలియజేస్తుంది. కాబట్టి మీకు క్రెడిట్‌ కార్డు ఉంటే, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి.

హానికరమైన లక్షణాలకు దూరంగా ఉండండి

బైబిలు సూత్రం: “సోమరి చలికాలంలో పొలం దున్నడు, కాబట్టి కోతకాలంలో తన దగ్గర ఏమీ లేకపోవడంతో అతను బిచ్చం ఎత్తుకుంటాడు.”—సామెతలు 20:4, NW.

అంటే: సోమరితనం వల్ల పేదరికం వస్తుంది. కాబట్టి కష్టపడి పనిచేయండి, మీ డబ్బును తెలివిగా ఉపయోగిస్తూ భవిష్యత్తు అవసరాల కోసం కూడబెట్టుకోండి.

మీరేం చేయవచ్చు:

  • కష్టపడి పనిచేయండి. మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేయండి, బాధ్యతగా నడుచుకోండి. అప్పుడు మీ యజమానికి మీరు నచ్చుతారు, ఎవరూ అలాంటి వాళ్లను ఉద్యోగంలో నుండి తీసేయాలనుకోరు.

  • నిజాయితీగా ఉండండి. మీ యజమాని దగ్గర దొంగతనం చేయకండి. నిజాయితీగా లేకపోతే మీ పేరు పాడౌతుంది, ఆ తర్వాత మీకు వేరేచోట ఉద్యోగం దొరకాలన్నా కష్టమౌతుంది.

  • అత్యాశకు పోకండి. ఇంకా, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అన్నట్టుగా పనిచేస్తే కొంతకాలానికి మీ ఆరోగ్యం పాడౌతుంది, ఇతరులతో మీకున్న సంబంధాలు దెబ్బతింటాయి. జీవితంలో డబ్బు కన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయని గుర్తుంచుకోండి.

ఇంకొన్ని బైబిలు సూత్రాలు

మీరు jw.org వెబ్‌సైట్‌లో బైబిల్ని చదవచ్చు. అందులో బైబిలు వందల భాషల్లో ఉంది

చెడు అలవాట్ల కోసం సమయాన్ని, డబ్బును వృథా చేయకండి.

“త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.”—సామెతలు 23:21.

డబ్బు గురించి అతిగా ఆందోళన పడకండి.

“ఏమి తినాలా, ఏమి తాగాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏమి ధరించాలా అని మీ శరీరం గురించి గానీ ఆందోళన పడడం మానేయండి.”—మత్తయి 6:25.

అసూయ పడకండి.

“ఈర్ష్యపరుడు సంపదల కోసం ఆరాటపడతాడు, తనకు పేదరికం రాబోతుందని అతనికి తెలీదు.” —సామెతలు 28:22.