కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ఆందోళనంతా యెహోవా మీద వేయండి

మీ ఆందోళనంతా యెహోవా మీద వేయండి

‘ఆయన [యెహోవా] మీ గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత [ఆందోళన, NW] యావత్తు ఆయనమీద వేయండి.’1 పేతు. 5:7.

పాటలు: 38, 7

1, 2. (ఎ) మనం ఎందుకు ఆందోళనకు గురౌతుంటాం? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏమి చర్చించుకుంటాం?

 మనం చాలా ఒత్తిడి కలిగించే రోజుల్లో జీవిస్తున్నాం. ఎందుకంటే సాతాను “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతు. 5:8; ప్రక. 12:17) కొన్నిసార్లు దేవుని సేవకులమైన మనం కూడా కొంత ఆందోళనకు గురౌతుంటాం. గతంలోని దేవుని సేవకులు కూడా ఆందోళనపడ్డారు. ఉదాహరణకు, రాజైన దావీదు కొన్నిసార్లు ఆందోళనపడ్డాడని బైబిలు చెప్తోంది. (కీర్త. 13:2) అంతేకాదు అపొస్తలుడైన పౌలు ‘సంఘాలన్నిటి గురించి’ ఆందోళనపడ్డాడని చెప్తోంది. (2 కొరిం. 11:28) మరి మనం తీవ్రమైన ఆందోళనతో ఉన్నప్పుడు ఏమి చేయవచ్చు?

2 గతంలో ఉన్న తన సేవకులు ఆందోళన నుండి ఉపశమనం పొందడానికి మన ప్రేమగల పరలోక తండ్రి సహాయం చేశాడు. నేడు మనకు కూడా ఆయన సహాయం చేయాలనుకుంటున్నాడు. ‘ఆయన మీ గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత [ఆందోళన, NW] యావత్తు ఆయనమీద వేయండి’ అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (1 పేతు. 5:7) కాబట్టి మనం ఏమి చేయవచ్చు? మన ఆందోళనను తగ్గించుకోవడానికి సహాయం చేసే నాలుగు విధానాలను మనం ఇప్పుడు చర్చించుకుంటాం. (1) ప్రార్థించడం, (2) దేవుని వాక్యాన్ని చదివి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించడం, (3) యెహోవా పవిత్రశక్తి కోసం అడగడం, (4) మీకు నమ్మకం ఉన్నవాళ్లతో మీ మనసులోని భావాలను చెప్పడం. ఈ నాలుగు విధానాలను పరిశీలిస్తుండగా, మీరు ఏయే విషయాల్లో మెరుగవ్వాలని కోరుకుంటున్నారో గుర్తించడానికి ప్రయత్నించండి.

మీ భారం యెహోవామీద వేయండి

3. మీ భారం యెహోవామీద ఎలా వేయవచ్చు?

3 మన ఆందోళనను యెహోవా మీద వేసే మొదటి విధానం ఏమిటంటే, హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం. మీకు ఆందోళనగా ఉన్నప్పుడు, మీ మనసులోని భావాలను తనకు చెప్పాలని మీ ప్రేమగల పరలోక తండ్రి కోరుతున్నాడు. కీర్తనకర్త దావీదు, “దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము” అని యెహోవాను వేడుకున్నాడు. అదే కీర్తనలో దావీదు తర్వాత ఇలా అన్నాడు, “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును.” (కీర్త. 55:1, 22) ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు చేయగలిగినదంతా చేశాక, యెహోవాకు హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. అంతేకానీ ఆందోళనపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది? తీవ్రమైన ఆందోళన నుండి బయటపడడానికి అది మనకెలా ఉపయోగపడుతుంది?—కీర్త. 94:18, 19.

4. మనకు ఆందోళనగా ఉన్నప్పుడు, ప్రార్థించడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

4 ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి. మనం హృదయపూర్వకంగా, పట్టుదలతో చేసే ప్రార్థనలకు యెహోవా ఎలా స్పందిస్తాడు? మనం ప్రశాంతంగా ఉండేలా, మనకు ప్రతికూల ఆలోచనలు-భావాలు కలగకుండా ఉండేలా ఆయన చేయగలడు. ఆందోళన, భయం బదులు హృదయ లోతుల్లో అంతకుముందెప్పుడూ లేని ప్రశాంతతను పొందేందుకు ఆయన సహాయం చేస్తాడు. మన సహోదరసహోదరీల్లో చాలామంది అలాంటి ప్రశాంతతను అనుభవించారు. బహుశా మీరూ దాన్ని రుచిచూసి ఉంటారు. ఎలాంటి పెద్ద సమస్యనైనా అధిగమించడానికి “దేవుని సమాధానము” మీకు సహాయం చేయగలదు. యెహోవా ఇస్తున్న ఈ అభయాన్ని మీరు పూర్తిగా నమ్మవచ్చు, “నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను.”—యెష. 41:9, 10.

బైబిలు సహాయంతో హృదయలోతుల్లో ప్రశాంతతను పొందడం

5. హృదయలోతుల్లో ప్రశాంతతను పొందడానికి దేవుని వాక్యం మనకెలా సహాయం చేస్తుంది?

5 ఆందోళనను తగ్గించుకొని హృదయలోతుల్లో ప్రశాంతతను పొందడానికి సహాయం చేసే రెండవ విధానం ఏమిటంటే, బైబిలు లేఖనాలను చదివి, వాటిగురించి లోతుగా ఆలోచించడం. అది ఎందుకు ప్రాముఖ్యం? బైబిలు దేవుని వాక్యం. దానిలో మన సృష్టికర్త ఇచ్చే జ్ఞానయుక్తమైన, ఉపయోగపడే సలహాలు ఉన్నాయి. మీకు ఎప్పుడు ఆందోళన కలిగినా దేవుని తలంపుల గురించి లోతుగా ఆలోచిస్తూ, ఆయన సలహా మిమ్మల్ని ఎలా బలపర్చగలదో ధ్యానించండి. అలా చేస్తే మీరు ఆందోళనను అధిగమించవచ్చు, దాన్ని తగ్గించుకోవచ్చు లేదా అసలు ఆందోళనపడకుండా ఉండవచ్చు. మనం తన వాక్యాన్ని చదివినప్పుడు “నిబ్బరముగలిగి ధైర్యముగా” ఉంటామని, ‘దిగులుపడకుండా, జడియకుండా’ ఉంటామని యెహోవా చెప్తున్నాడు.—యెహో. 1:7-9.

6. యేసు మాటల నుండి మీరెలా ప్రయోజనం పొందగలరు?

6 యేసు ప్రజలతో మాట్లాడిన తీరు గురించి బైబిల్లో చదువుతాం. ప్రజలు ఆయన మాటలు వినడానికి ఇష్టపడేవాళ్లు ఎందుకంటే ఆయన మాటలు ఓదార్పును, సేదదీర్పును ఇచ్చేవి. ఆయన మాటలు ముఖ్యంగా బలహీనులను బలపర్చేవి, కృంగినవాళ్లను ఓదార్చేవి. (మత్తయి 11:28-30 చదవండి.) ఇతరుల భావాలపట్ల యేసుకు ఎంతో శ్రద్ధ ఉంది. (మార్కు 6:30-32) తనతో ప్రయాణం చేసిన అపొస్తలులకు సహాయం చేస్తానని ఆయన మాటిచ్చాడు. నేడు మనకు కూడా ఆయన సహాయం చేస్తాడు. అయితే ఆ సహాయం పొందాలంటే మనం యేసుతో అక్షరార్థంగా జీవించనక్కర్లేదు. పరలోకంలో మన రాజుగా ఉన్న యేసు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి మీరు ఆందోళన పడుతున్నప్పుడు ఆయన మీకు అండగా ఉంటాడని, సరైన సమయంలో సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి. ఆందోళనను అధిగమించడానికి సహాయం చేసే నిరీక్షణను, ధైర్యాన్ని యేసు మనకిస్తున్నాడు.—హెబ్రీ. 2:17, 18; 4:16.

పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు

7. మనం పవిత్రశక్తి కోసం అడిగినప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడు?

7 మనం ఎప్పుడు అడిగినా మన పరలోక తండ్రి పవిత్రశక్తిని ఇస్తాడని యేసు మాటిచ్చాడు. (లూకా 11:10-13) ఆందోళనను అధిగమించడానికి ఉన్న ఈ మూడో విధానం మనకు ఎలా సహాయం చేస్తుంది? సర్వశక్తిగల మన దేవునికున్న మంచి లక్షణాలను మనం వృద్ధిచేసుకోవడానికి ఆయన పవిత్రశక్తి లేదా చురుకైన శక్తి సహాయం చేస్తుంది. (కొలొ. 3:9, 10) ఈ లక్షణాల్ని “ఆత్మ ఫలం” లేదా పవిత్రశక్తి పుట్టించే లక్షణాలని బైబిలు పిలుస్తుంది. (గలతీయులు 5:22-24 చదవండి.) ఈ మంచి లక్షణాలను మనం వృద్ధి చేసుకున్నప్పుడు, ఇతరులతో మన సంబంధాలు మెరుగౌతాయి, ఆందోళనకు దారితీసే పరిస్థితులు రాకుండా ఉంటాయి. అయితే, పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు మనకు వేర్వేరు విషయాల్లో ఎలా సహాయం చేస్తాయో చూద్దాం.

8-12. పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు మీకెలా సహాయం చేస్తాయి?

8 “ప్రేమ, సంతోషము, సమాధానము.” మీరు ఇతరుల్ని గౌరవించినప్పుడు, ఆందోళన కలిగించే పరిస్థితులు ఎక్కువగా రావు. ఎందుకు? మీరు ఇతరులపట్ల సహోదర ప్రేమ, ఆప్యాయత, గౌరవం చూపించినప్పుడు, కోపం, చిరాకు, ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎక్కువగా రాకుండా ఉంటాయి. దానివల్ల ఇతరులతో సమాధానాన్ని కాపాడుకోవడం మీకు మరింత తేలికౌతుంది.—రోమా. 12:10.

9 “దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము.” బైబిలు ఇలా చెప్తుంది, ‘ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, ఒకరినొకరు క్షమించుకోండి.’ (ఎఫె. 4:32) మనం ఆ సలహాను పాటిస్తే, ఇతరులతో సమాధానంగా ఉంటాం, మంచి సంబంధాలు కలిగివుంటాం. అలాగే మనకు ఆందోళనను కలిగించే పరిస్థితులు రాకుండా చూసుకోగలుగుతాం. అంతేకాదు, మన అపరిపూర్ణత వల్ల వచ్చే పరిస్థితులతో మరింత సులభంగా వ్యవహరించగలుగుతాం.

10 “విశ్వాసము.” నేడు మనం డబ్బు, వస్తుసంపదల కోసం తరచుగా ఆందోళనపడుతూ ఉంటాం. (సామె. 18:11) ఇలాంటి ఆందోళన నుండి మనమెలా బయటపడవచ్చు? “కలిగినవాటితో తృప్తిపొందియుండుడి” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను మనం పాటించాలి. యెహోవా మీద మనకు బలమైన విశ్వాసం ఉంటే, మనకు కావాల్సినవాటిని ఆయన ప్రేమతో ఇస్తాడనే నమ్మకం కలిగి ఉండగలుగుతాం. ఆయన ఇలా మాటిస్తున్నాడు, “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” అందుకే మనం పౌలులా ఇలా చెప్పగలం, “ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?”—హెబ్రీ. 13:5, 6.

11 “సాత్వికము, ఆశానిగ్రహము.” ఈ రెండు లక్షణాలను చూపించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆలోచించండి. మీకు ఆందోళన కలిగించే పనులకు లేదా మాటలకు దూరంగా ఉండడానికి ఈ లక్షణాలు మీకు సహాయం చేస్తాయి. అంతేకాదు “ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ” వంటివాటికి దూరంగా ఉండడం వల్ల కూడా మీరు ప్రయోజనం పొందుతారు.—ఎఫె. 4:31.

12 దేవుని ‘బలమైన చేతిపై’ నమ్మకం ఉంచి, ‘ఆందోళనంతా ఆయన మీద వేయాలంటే’ మీకు వినయం అవసరం. (1 పేతు. 5:6-7, NW) వినయం ఉంటే, మీరు ఏమి చేయగలరో ఏమి చేయలేరో గుర్తించగలుగుతారు. (మీకా 6:8) అప్పుడు మీరు మీమీద ఆధారపడే బదులు దేవుని మీద ఆధారపడతారు. దేవుని ప్రేమను, సహాయాన్ని స్పష్టంగా చూడడంవల్ల ఆందోళన కొంతవరకు తగ్గుతుంది.

ఎన్నడూ ఆందోళనపడకండి

13. “చింతింపకుడి” అని యేసు చెప్పిన మాటల ఉద్దేశమేమిటి?

13 మత్తయి 6:34⁠లో యేసు ఇచ్చిన ఈ తెలివైన సలహాను చదువుతాం, “చింతింపకుడి.” (చదవండి.) ఈ సలహా పాటించడం మనకు అసాధ్యం అనిపించవచ్చు. అయితే, యేసు మాటల ఉద్దేశమేమిటి? దావీదు, పౌలు కొన్నిసార్లు ఆందోళనపడ్డారని మనం అంతకుముందే చూశాం. కాబట్టి యేసు ఉద్దేశం, దేవుని సేవకులు ఎన్నడూ ఆందోళనపడరని కాదు. బదులుగా అనవసరంగా, అతిగా ఆందోళనపడడం వల్ల సమస్యలు పరిష్కారం కావని తన శిష్యులు అర్థంచేసుకోవడానికి యేసు సహాయం చేస్తున్నాడు. ప్రతిరోజూ సమస్యలు ఉంటాయి కాబట్టి గతంలో వచ్చిన లేదా భవిష్యత్తులో రాబోయే సమస్యల గురించి ఆలోచిస్తూ క్రైస్తవులు తమ ఆందోళనను ఎక్కువ చేసుకోకూడదు. తీవ్రమైన ఆందోళనను తగ్గించుకోవడానికి యేసు ఇచ్చిన సలహా ఎలా ఉపయోగపడుతుంది?

14. దావీదులాగే మీ ఆందోళనను ఎలా తగ్గించుకోవచ్చు?

14 కొన్నిసార్లు ప్రజలు తాము గతంలో చేసిన తప్పుల గురించి ఆందోళనపడుతుంటారు. తప్పు చేసి చాలా సంవత్సరాలు గడిచిపోయినా, వాళ్లు దాని విషయంలో తీవ్రమైన అపరాధ భావంతో బాధపడుతుండవచ్చు. కొన్నిసార్లు దావీదు కూడా తన తప్పుల్ని బట్టి చాలా బాధపడ్డాడు. అతను ఇలా ఒప్పుకున్నాడు, “నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను.” (కీర్త. 38:3, 4, 8, 18) ఆ పరిస్థితిలో దావీదు ఏమి చేశాడు? అతను యెహోవా కరుణ, క్షమాగుణం మీద నమ్మకం ఉంచాడు. అంతేకాదు దేవుడు అతన్ని క్షమించాడని తెలుసుకొని సంతోషించాడు.—కీర్తన 32:1-3, 5 చదవండి.

15. (ఎ) దావీదు నుండి మనమింకా ఏమి నేర్చుకోవచ్చు? (బి) ఆందోళనను తగ్గించుకోవడానికి మీరేమి చేయవచ్చు? (“ఆందోళనను తగ్గించుకోవడానికి కొన్ని సలహాలు” అనే బాక్సు చూడండి.)

15 ఇంకొన్నిసార్లు, మీరున్న పరిస్థితుల గురించి మీరు ఆందోళన పడుతుండవచ్చు. ఉదాహరణకు, దావీదు 55వ కీర్తన రాసే సమయంలో తనను చంపేస్తారేమోనని భయపడుతున్నాడు. (కీర్త. 55:2-5) అయినప్పటికీ, తన ఆందోళనవల్ల యెహోవా మీదున్న నమ్మకాన్ని అతను కోల్పోలేదు. తన సమస్యల నుండి బయటపడడానికి సహాయం చేయమని దావీదు యెహోవాను వేడుకున్నాడు. అయితే తాను ఏదోక చర్య తీసుకోవడం కూడా ప్రాముఖ్యమని అతనికి తెలుసు. (2 సమూ. 15:30-34) మనం దావీదు నుండి ఓ పాఠం నేర్చుకోవచ్చు. ఆందోళనపడుతూ ఉండిపోయే బదులు, సమస్యను పరిష్కరించుకోవడానికి చేయగలిగినదంతా చేసి, యెహోవా మీద నమ్మకముంచి విషయాన్ని ఆయనకు విడిచిపెట్టాలి.

16. దేవుని పేరుకున్న అర్థం మీ విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?

16 కొన్నిసార్లు ఓ క్రైస్తవుడు భవిష్యత్తులో రాగల సమస్యల గురించి ఆందోళనపడవచ్చు. కానీ ఇంకా జరగని వాటిగురించి ఆందోళనపడాల్సిన అవసరంలేదు. ఎందుకు? ఎందుకంటే చాలాసార్లు పరిస్థితులు మనం అనుకున్నంత చెడుగా ఉండవు. అంతేకాదు, దేవుడు అదుపుచేయలేని పరిస్థితి ఏదీ ఉండదని గుర్తుంచుకోండి. ఆయన పేరుకున్న అర్థమే “తానే కర్త అవుతాడు” అని. (నిర్గ. 3:14) మనుషుల విషయంలో తన సంకల్పాలన్నిటినీ నెరవేరుస్తాడని దేవుని పేరు తెలియజేస్తుంది కాబట్టి మనం భవిష్యత్తు గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. దేవుడు తనకు నమ్మకంగా ఉన్నవాళ్లను ఆశీర్వదించి, గతం గురించిన, ప్రస్తుతం గురించిన, భవిష్యత్తు గురించిన ఆందోళనను తగ్గించుకోవడానికి సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి.

మీకు నమ్మకం ఉన్నవాళ్లతో మాట్లాడండి

17, 18. మనసువిప్పి మాట్లాడడంవల్ల ఆందోళన ఎలా తగ్గుతుంది?

17 మీరు ఆందోళన పడుతున్నప్పుడు సహాయం పొందేందుకు ఉన్న నాలుగవ విధానం ఏమిటంటే, మీకు నమ్మకం ఉన్నవాళ్లతో మనసువిప్పి మాట్లాడడం. మీ పరిస్థితి గురించి మీకు సరైన అవగాహన రావడానికి మీ వివాహజత, ఓ సన్నిహిత స్నేహితుడు లేదా ఓ సంఘపెద్ద సహాయం చేయగలరు. బైబిలు ఇలా చెప్తోంది, “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.” (సామె. 12:25) అంతేకాదు, “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును” అని కూడా బైబిలు చెప్తోంది.—సామె. 15:22.

18 మన ఆందోళనల్ని తగ్గించుకోవడానికి మీటింగ్స్‌ కూడా సహాయం చేస్తాయి. అక్కడ, మీ పట్ల శ్రద్ధ చూపిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించాలనుకునే సహోదరసహోదరీలతో మీరు సమయం గడుపుతారు. (హెబ్రీ. 10:24, 25) అలా ‘ఒకరి వల్ల ఒకరు ప్రోత్సాహం’ పొందడం మీకు బలాన్నిస్తుంది. అంతేకాదు ఎలాంటి ఆందోళననైనా మరింత సులభంగా అధిగమించేందుకు సహాయం చేస్తుంది.— రోమా. 1:11, NW.

దేవునితో మీకున్న సంబంధమే మీకు కొండంత బలం

19. దేవునితో మీకున్న సంబంధం మిమ్మల్ని బలపరుస్తుందని ఎందుకు నమ్మవచ్చు?

19 కెనడాలో ఉంటున్న ఒక సంఘపెద్ద తన ఆందోళనను యెహోవామీద వేయడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకున్నాడు. అతను ఒక స్కూల్‌ టీచర్‌గా, విద్యార్థులకు సలహాదారునిగా పనిచేస్తున్నాడు. ఆ ఉద్యోగం ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. అంతేకాదు తన అనారోగ్యం వల్ల కూడా అతను ఆందోళనకు గురౌతుంటాడు. మరి అతను ధృడంగా ఉండడానికి ఏది సహాయం చేసింది? అన్నిటికన్నా ముఖ్యంగా అతను యెహోవాతో తనకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి కృషిచేస్తాడు. అతని కష్ట సమయాల్లో నిజమైన స్నేహితులు కూడా ఎంతో సహాయం చేశారు. అతను తన భార్యతో మనసువిప్పి మాట్లాడేవాడు. దానితోపాటు, తన పరిస్థితిని యెహోవా దృష్టితో చూసేందుకు తోటి సంఘపెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకుడు కూడా సహాయం చేశారు. అలాగే ఒక డాక్టర్‌ సహాయంతో తన ఆరోగ్య పరిస్థితిని అర్థంచేసుకొని తన రోజువారీ పనుల్లో మార్పులు చేసుకోగలిగాడు. దానివల్ల సేదదీరడానికి, వ్యాయామం చేయడానికి అతనికి సమయం దొరికేది. నెమ్మదినెమ్మదిగా అతను తన పరిస్థితిని, తన భావాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకున్నాడు. అతను అదుపు చేయలేనివి ఏవైనా ఉంటే, సహాయం కోసం యెహోవా మీద ఆధారపడతాడు.

20. (ఎ) మన ఆందోళనను దేవుని మీద ఎలా వేయవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి నేర్చుకుంటాం?

20 యెహోవాకు ప్రార్థించడం ద్వారా, ఆయన వాక్యాన్ని చదివి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించడం ద్వారా మన ఆందోళనను దేవుని మీద వేయడం ప్రాముఖ్యమని ఈ ఆర్టికల్‌లో నేర్చుకున్నాం. అంతేకాదు, పవిత్రశక్తి కోసం యెహోవాను అడగడం, మనకు నమ్మకం ఉన్నవాళ్లతో మాట్లాడడం, మీటింగ్స్‌కు వెళ్లడం కూడా చాలా ప్రాముఖ్యమని నేర్చుకున్నాం. అయితే తర్వాతి ఆర్టికల్‌లో, ప్రతిఫలాన్ని పొందే నిరీక్షణను ఇవ్వడం ద్వారా యెహోవా మనకెలా సహాయం చేస్తున్నాడో నేర్చుకుంటాం.—హెబ్రీ. 11:6.