కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సౌమ్యత తెలివిని చూపిస్తుంది

సౌమ్యత తెలివిని చూపిస్తుంది

టోనీ అనే స్త్రీ ఓ ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తోంది. ఆమె ఒకరోజు ఆ ఇంటి కాలింగ్‌ బెల్‌ నొక్కింది. అప్పుడు దాదాపు 50 ఏళ్లున్న ఓ స్త్రీ తలుపుతీసి, వృద్ధురాలైన తన తల్లి బాగోగులు చూసుకోవడానికి కాస్త ముందే రావచ్చుగా అంటూ టోనిపై మండిపడింది. నిజానికి టోనీ ఆలస్యంగా రాకపోయినా ఆ స్త్రీ టోనీని అపార్థం చేసుకుంది. అయినప్పటికీ టోనీ మారుమాట్లాడకుండా ఆమెకు క్షమాపణ చెప్పింది.

రెండోసారి టోనీ ఆ ఇంటికి వెళ్లినప్పుడు, ఆ స్త్రీ మళ్లీ టోనీ మీద అరిచింది. మరి టోనీ ఎలా స్పందించింది? “ఆ పరిస్థితుల్లో చాలా కష్టంగా అనిపించింది. ఆమె అలాంటి మాటలు అనడం సరికాదు” అని టోనీ అంటోంది. అయినప్పటికీ, టోనీ ఆమెకు మళ్లీ క్షమాపణ చెప్పి ఆమె పడుతున్న బాధను తాను అర్థంచేసుకున్నానని చెప్పింది.

మీరే టోనీ స్థానంలో ఉంటే, ఎలా స్పందించేవాళ్లు? సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నించేవాళ్లా? లేదా కోపాన్ని అదుపు చేసుకోవడం మీకు కష్టమయ్యేదా? పైన మనం చూసినలాంటి పరిస్థితుల్లో కోపాన్ని అదుపు చేసుకోవడం అంత సులభం కాకపోవచ్చు. ఒత్తిడిలో లేదా కోపంలో ఉన్నప్పుడు సౌమ్యంగా ఉండడం నిజంగా ఓ సవాలే.

అయితే సౌమ్యంగా ఉండమని బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. నిజానికి, బైబిలు ఆ లక్షణాన్ని తెలివితో ముడిపెడుతోంది. ‘మీలో తెలివి, గ్రహించే సామర్థ్యం ఎవరికి ఉన్నాయి?’ అని యాకోబు అడిగాడు. ఓ వ్యక్తి ‘ఆ లక్షణాల్ని తన మంచి ప్రవర్తన ద్వారా, సౌమ్యతతో చేసే పనుల ద్వారా చూపించాలి. ఈ సౌమ్యత తెలివి వల్ల కలుగుతుంది’ అని ఆ తర్వాత యాకోబు చెప్పాడు. (యాకో. 3:13NW) సౌమ్యత పైనుండి వచ్చు తెలివి వల్ల కలుగుతుందని ఎలా చెప్పవచ్చు? మరి ఆ లక్షణాన్ని వృద్ధిచేసుకోవడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది?

సౌమ్యతలో ఉన్న తెలివి

సౌమ్యత ఒత్తిడిని తగ్గిస్తుంది. “మృదువైన [సౌమ్యమైన, NW] మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.”సామె. 15:1.

పరిస్థితి సరిగ్గాలేనప్పుడు కోపంగా మాట్లాడితే ఆ పరిస్థితి మరింత ఘోరంగా తయారవ్వగలదు, ఎందుకంటే అది అగ్నికి ఆజ్యం పోయడం లాంటిది. (సామె. 26:21) దానికి భిన్నంగా, ఆ పరిస్థితిలో సౌమ్యంగా మాట్లాడితే ప్రశాంతత నెలకొంటుంది. కోపంగా ఉన్న వ్యక్తిని కూడా అది శాంతపర్చగలదు.

ఈ మాటలు నిజమవ్వడాన్ని టోనీ చూసింది. టోనీ సౌమ్యంగా మాట్లాడడం చూసి, ఆ స్త్రీ కంటతడి పెట్టుకుంది. ఆమె వ్యక్తిగత సమస్యలతో, కుటుంబ సమస్యలతో విసిగిపోయిందని టోనీకి వివరించింది. అప్పుడు టోనీ ఆమెకు బైబిలు గురించి చెప్పింది, ఆమె స్టడీ తీసుకోవడం కూడా మొదలుపెట్టింది. ఇదంతా టోనీ సౌమ్యంగా, సమాధానంగా ఉండడంవల్లే సాధ్యమైంది.

సౌమ్యత మనకు సంతోషాన్నిస్తుంది. ‘సౌమ్యంగా ఉండేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు భూమికి వారసులౌతారు.’మత్త. 5:5, NW.

సౌమ్యంగా ఉండేవాళ్లు ఎందుకు సంతోషంగా ఉంటారు? సౌమ్యతను వృద్ధిచేసుకోవడం వల్ల ఒకప్పుడు కోపిష్ఠులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. వాళ్ల జీవితం మెరుగైంది, అంతేకాదు వాళ్లకోసం ఓ అద్భుతమైన భవిష్యత్తు వేచివుందని వాళ్లు తెలుసుకున్నారు. (కొలొ. 3:12) స్పెయిన్‌లో ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేస్తున్న ఆడోల్ఫో, సత్యం తెలుసుకోకముందు అతని జీవితం ఎలా ఉండేదో గుర్తుచేసుకుంటున్నాడు.

ఆడోల్ఫో ఇలా అంటున్నాడు, “నా జీవితానికి సంకల్పం ఉండేది కాదు. నేను తరచూ కోప్పడేవాణ్ణి. నాకెంత కోపమొచ్చేదంటే, ఆ కోపాన్ని, నా దురుసు ప్రవర్తనను చూసి నా స్నేహితుల్లో కొంతమంది భయపడేవాళ్లు. చివరికి నా జీవితాన్ని మార్చే ఒక సంఘటన జరిగింది. ఓ పెద్ద గొడవలో నన్ను ఆరు చోట్ల కత్తితో పొడిచారు. ఎంత రక్తం పోయిందంటే దాదాపు చనిపోయేంత పరిస్థితి వచ్చింది.”

ఆడోల్ఫో ఇప్పుడు తన మాటల ద్వారా, ఆదర్శం ద్వారా సౌమ్యంగా ఉండమని ఇతరులకు నేర్పిస్తున్నాడు. అతను ఆప్యాయంగా, నెమ్మదిగా ఉండడం చూసి చాలామంది అతనికి స్నేహితులు అవుతున్నారు. తాను చేసుకున్న మార్పులను బట్టి చాలా సంతోషంగా ఉన్నానని ఆడోల్ఫో చెప్తున్నాడు. సౌమ్యతను వృద్ధి చేసుకోవడానికి సహాయం చేసిన యెహోవాకు అతను రుణపడి ఉన్నాడు.

సౌమ్యత యెహోవాను సంతోషపెడుతుంది. “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”సామె. 27:11.

ప్రధాన శత్రువైన సాతాను యెహోవాను నిందిస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా సాతాను వేస్తున్న నిందలకు అతనిపై బాగా కోప్పడేందుకు యెహోవాకు సరైన కారణమే ఉంది. కానీ యెహోవా ‘దీర్ఘశాంతం’ చూపిస్తున్నాడని బైబిలు చెప్తుంది. (నిర్గ. 34:6) మనం యెహోవాలా దీర్ఘశాంతాన్ని, సౌమ్యతను చూపించడానికి కృషిచేసినప్పుడు, ఆయన్ను ఎంతో సంతోషపెట్టే తెలివైన పని చేసినవాళ్లమౌతాం.—ఎఫె. 5:1.

ప్రస్తుత లోకం ద్వేషంతో నిండిపోయింది. ‘గొప్పలు చెప్పుకునేవాళ్లను, గర్విష్ఠులను, దైవదూషణ చేసేవాళ్లను, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లను, ఆత్మనిగ్రహం లేనివాళ్లను, క్రూరులను’ మనం కలుస్తూ ఉండవచ్చు. (2 తిమో. 3:2-3, NW) అయినప్పటికీ, ఓ క్రైస్తవుడు సౌమ్యతను చూపిస్తూనే ఉండాలి. “పైనుండివచ్చు జ్ఞానము . . . సమాధానకరమైనది, మృదువైనది” అని బైబిలు మనకు గుర్తుచేస్తోంది. (యాకో. 3:17) మనం సమాధానాన్ని, మృదుత్వాన్ని చూపించడం ద్వారా దేవుని గురించిన జ్ఞానాన్ని లేదా తెలివిని సంపాదించుకున్నామని చూపిస్తాం. అలాంటి తెలివి, ఎవరైన మనకు కోపం తెప్పించినప్పుడు సౌమ్యంగా స్పందించేందుకు, అలాగే ఈ అంతులేని తెలివికి మూలమైన యెహోవాకు మరింత దగ్గరయ్యేందుకు సహాయం చేస్తుంది.