కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా?

ఎవరైనా మన ప్రార్థన వింటున్నారా?

ఎవరైనా మన ప్రార్థన వింటున్నారా?

ఎవరూ మన ప్రార్థన వినరు కాబట్టి అదొక టైమ్‌ వేస్ట్‌ అని కొంతమందికి అనిపిస్తుంది. చాలామంది ప్రార్థన చేయడానికి ప్రయత్నించారు కాని జవాబు దొరకట్లేదని వాళ్లకు అనిపించింది. ఒక నాస్తికుడు దేవుడు ఇలా ఉంటాడు అని ఊహించుకుంటూ ఆయన చేసిన ప్రార్థన గురించి ఇలా చెప్తున్నాడు: ‘“చిన్నగా అయినా జవాబివ్వు” అని దేవున్ని అడిగాను కానీ ఆయన మాత్రం “నిశ్శబ్దంతో” ఉన్నాడు.’

అయితే బైబిలు మాత్రం మనకొరకు దేవుడు ఉన్నాడు, మన ప్రార్థనలు వింటాడు అని హామీ ఇస్తుంది. పూర్వం ఒక దేశ ప్రజల కోసం చెప్పిన మాట బైబిల్లో ఉంది. అక్కడ, “నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును” అని ఉంది. (యెషయా 30:19) ఇంకొక బైబిలు వచనం ఇలా ఉంది: “యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.”—సామెతలు 15:8.

యేసు తండ్రికి ప్రార్థన చేశాడు, అప్పుడు “ఆయన అంగీకరింపబడెను.” —హెబ్రీయులు 5:7

దేవుడు విన్న ప్రార్థనల గురించి కూడా బైబిల్లో ఉంది. ఒక వచనంలో యేసు “తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ... యాచనలను” సమర్పించినప్పుడు “ఆయన అంగీకరింపబడెను” అని ఉంది. (హెబ్రీయులు 5:7) వేరే ఉదాహరణలు దానియేలు 9:21; 2 దినవృత్తాంతములు 7:1⁠లో ఉన్నాయి.

మరి ఎందుకు కొంతమంది వాళ్ల ప్రార్థనలకు జవాబు దొరకడం లేదని అనుకుంటారు? ప్రార్థనలకు జవాబు కోసం బైబిల్లో ఉన్న దేవుడు యెహోవాకే  a ప్రార్థన చేయాలి, వేరే ఏ దేవునికి లేదా మన పూర్వీకులకు కాదు. అంతేకాదు “ఆయన చిత్తానుసారముగా,” అంటే దేవుడు ఒప్పుకునే వాటినే మనం అడగాలి. అప్పుడు ‘ఆయన మన మనవి ఆలకించును’ అనే హామీ ఉంది. (1 యోహాను 5:14) కాబట్టి మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనం బైబిల్లో ఉన్న దేవున్ని తెలుసుకోవాలి ఆయన చిత్తాన్ని గ్రహించాలి.

చాలామంది ప్రార్థనను ఒక మతపరమైన ఆచారంగా మాత్రమే చూడరు. దేవుడు ప్రార్థనలు విని జవాబిస్తాడని వాళ్లు నమ్ముతారు. కెన్యాకు చెందిన ఐసాక్‌ ఇలా అంటున్నాడు: “నేను బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం కోసం ప్రార్థించాను. వెంటనే ఒకరు నా దగ్గరకు వచ్చి నాకు కావాల్సిన సహాయం ఇచ్చారు.” ఫిలిప్పీన్స్‌లో ఉంటున్న హిల్డా పొగ తాగడం మానేయాలనుకుంది. చాలా ప్రయత్నాలు విఫలమయ్యాక “సహాయం కోసం దేవునికి ఎందుకు ప్రార్థన చేయకూడదు” అని ఆమె భర్త సలహా ఇచ్చాడు. ఆయన చెప్పినట్లు చేశాక ఆమె ఇలా అంటుంది, “దేవుడు నాకు ఎలా సహాయం చేశాడో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు పొగ తాగాలనే కోరిక మెల్లగా తగ్గిపోయింది. నేను మానుకోగలిగాను.”

మీ అవసరాలు ఆయన ఇష్టానికి అనుగుణంగా ఉంటే మీకు సహాయం చేయాలని దేవునికి అనిపిస్తుందా? (w15-E 10/01)

a యెహోవా బైబిల్లో దేవుని పేరు.