కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

నేను కూడా సహాయం చేయగలను అని ఇప్పుడు నాకనిపిస్తుంది

నేను కూడా సహాయం చేయగలను అని ఇప్పుడు నాకనిపిస్తుంది
  • పుట్టిన సంవత్సరం 1981

  • దేశం గ్వాటిమాల

  • ఒకప్పుడు చిన్నతనంలోనే చాలా కష్టాలు

నా గతం:

గ్వాటిమాల దేశంలో పశ్చిమాన ఉన్న పర్వతాల్లో మారుమూలనున్న ఆకూల్‌ అనే ఊరిలో నేను పుట్టాను. మా కుటుంబం మాయా ప్రజల నుండి వచ్చిన ఇసీల్‌ జాతికి చెందినది. స్పానిష్‌ భాషతోపాటు ప్రత్యేకమైన మా జాతి భాష కూడా నాకు వచ్చు. గ్వాటిమాల దేశంలో 36 సంవత్సరాలు ఘోరమైన అంతర్యుద్ధం జరిగింది. ఆ కాలంలో నేను పెరిగాను. అప్పుడు చాలామంది ఇసీల్‌ జాతివాళ్లు చనిపోయారు.

నాకు నాలుగు సంవత్సరాలప్పుడు, మా అన్నకు ఏడు సంవత్సరాలు. ఒక గ్రనేడ్‌ బాంబ్‌తో అన్న ఆడుకుంటున్నప్పుడు అనుకోకుండా అది పేలిపోయి నా కళ్లు పోయాయి, అన్న చనిపోయాడు. ఆ తర్వాత, నా చిన్నతనం అంతా నేను గ్వాటిమాల సిటీ అనే పట్టణంలో కళ్లులేని పిల్లల కోసం ఉన్న ఒక పాఠశాలలో గడిపాను. అక్కడ నేను బ్రెయిలీ నేర్చుకున్నాను. ఎందుకో తెలీదు కానీ, అక్కడ పనిచేసేవాళ్లు వేరే పిల్లలతో నన్ను మాట్లాడనివ్వలేదు, నాతో చదువుకునే పిల్లలు కూడా నన్ను దూరంగా ఉంచేవాళ్లు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడిని. మా ఇంట్లో మా అమ్మతో గడిపే రెండు నెలల కోసం సంవత్సరమంతా ఎదురుచూసేవాడిని, అమ్మ ఎప్పుడూ ప్రేమగా, దయగా ఉండేది. నాకు పది సంవత్సరాలు వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది. ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించే ఒకే ఒక్కరు మా అమ్మే అనుకున్నాను. ఆమె కూడా చనిపోయేసరికి నేను కుప్ప కూలిపోయాను.

నాకు 11 సంవత్సరాలప్పుడు మా ఊరుకు తిరిగి వచ్చి మా సవతి అన్నయ్య కుటుంబంతో ఉన్నాను. నాకు శారీరకంగా అవసరమైనవన్నీ వాళ్లు చూసుకునేవాళ్లు కానీ నా మనసును అర్థం చేసుకుని సహాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. “మా అమ్మ ఎందుకు చనిపోయింది? నా కళ్లు ఎందుకు పోయాయి?” అని నేను కొన్నిసార్లు ఏడుస్తూ దేవున్ని అడిగేవాణ్ణి. జరిగినవన్నీ దేవుని చిత్తమని చాలామంది నాతో చెప్పారు. దేవుడు అన్యాయస్థుడని, మనుషులను పట్టించుకోడు అనే నిర్ణయానికి వచ్చాను. కేవలం ఆత్మహత్య చేసుకునే దారిలేకే నేను అప్పుడు చనిపోలేదు.

కళ్లు లేవు కాబట్టి నేను శారీరకంగా, మానసికంగా నిస్సహాయుడిని. చిన్నప్పుడు నన్ను చాలాసార్లు లైంగికంగా వేధించారు. నన్ను ఎవరూ పట్టించుకోరని అని జరిగింది ఎవ్వరికీ చెప్పలేదు. నాతో మాట్లాడేవాళ్లే లేరు, నేనూ ఎవ్వరితో మాట్లాడేవాణ్ణి కాదు. అందరికి దూరంగా ఉంటూ, కృంగిపోతూ ఉండేవాణ్ణి. నేను ఎవ్వరినీ నమ్మలేదు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

నాకు 13 సంవత్సరాలప్పుడు, ఇద్దరు యెహోవాసాక్షులు (భార్యాభర్తలు) పాఠశాలలో గేమ్స్‌ పీరియడ్‌లో నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. నా పరిస్థితిని అర్థం చేసుకున్న ఒక టీచర్‌ నన్ను కలవమని వాళ్లతో చెప్పింది. చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారని, కళ్లులేనివాళ్లు చూస్తారని బైబిలు మాటిస్తుందని వాళ్లు చెప్పారు. (యెషయా 35:5; యోహాను 5:28, 29) వాళ్లు చెప్పేవి నాకు నచ్చాయి కానీ మాట్లాడే అలవాటు లేక వాళ్లతో మాట్లాడడం నాకు కష్టంగా ఉండేది. నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా బైబిలు నేర్పించడానికి దయతో, ఓర్పుతో మానకుండా నా దగ్గరకు వచ్చేవాళ్లు. ఆ భార్యాభర్తలు 10 కిలోమీటర్లు నడుస్తూ పర్వతాలు దాటి మా ఊరుకు వచ్చేవాళ్లు.

వాళ్లు శుభ్రంగా కనిపిస్తున్నారు కానీ ఉన్నవాళ్లు అయితే కాదు అని మా సవతి అన్నయ్య వాళ్ల గురించి నాకు వివరించాడు. అయినా వాళ్లు నా గురించి పట్టించుకుంటూ నా కోసం చిన్న గిఫ్ట్‌లు తెచ్చేవాళ్లు. కేవలం నిజమైన క్రైస్తవులే అలా నిస్వార్థంగా వేరేవాళ్ల కోసం త్యాగం చేస్తారని నాకు అప్పుడు అనిపించింది.

బ్రెయిలీ పుస్తకాల సహాయంతో నేను బైబిలు నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నవి నాకు అర్థమయ్యాయి కానీ కొన్ని విషయాలను నమ్మడం నాకు కష్టంగా అనిపించేది. ఉదాహరణకు, నా గురించి దేవుడు పట్టించుకుంటాడని, దేవునిలానే వేరేవాళ్లు కూడా నన్ను పట్టించుకుంటారని నేను ఒప్పుకోలేకపోయాను. ఇప్పుడున్న బాధలను యెహోవా కొంతకాలం వరకు ఎందుకు ఉండనిస్తున్నాడో నేను అర్థం చేసుకున్నాను కానీ యెహోవా దేవున్ని ఒక ప్రేమగల తండ్రిలా చూడలేకపోయాను. a

మెల్లమెల్లగా, బైబిలు నుండి నేను నేర్చుకున్నవి నా ఆలోచనల్ని మార్చాయి. ఉదాహరణకు, కష్టాల్లో ఉన్నవాళ్లను దేవుడు నిజంగా అర్థం చేసుకుంటాడని, ఆయన కూడా బాధపడతాడని నేర్చుకున్నాను. (నిర్గమకాండము 3:7) ఆయన్ను ఆరాధించేవాళ్లను వేరేవాళ్లు కష్టపెట్టినప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, ... వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.” (నిర్గమకాండము 3:7) యెహోవాకున్న సున్నితమైన లక్షణాలను నేను అర్థం చేసుకున్నప్పుడు ఆయనకు నా జీవితాన్ని సమర్పించుకోవాలని నాకనిపించింది. 1998⁠లో నేను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాను.

నన్ను ఇంట్లో పెట్టుకున్న బ్రదర్‌తో

బాప్తిస్మం తీసుకున్న దాదాపు ఒక సంవత్సరం తర్వాత, నేను ఎస్‌క్విన్‌ట్లా పట్టణంలో చూపులేని వాళ్ల కోసం ఒక కోర్సుకు వెళ్లాను. మా ఊరునుండి మీటింగ్స్‌కు వెళ్లడానికి నాకు కష్టమౌతుందని మా సంఘంలో పెద్ద తెలుసుకున్నాడు. నాకు దగ్గర్లో ఉన్న సంఘానికి వెళ్లాలంటే, నాకు స్టడీ చేయడానికి వచ్చిన యెహోవాసాక్షులు దాటిన పర్వతాలను నేను కూడా దాటి వెళ్లాలి. అది నాకు చాలా కష్టం. నాకు సహాయం చేయడానికి ఆ పెద్ద ఎస్‌క్విన్‌ట్లాలో ఒక కుటుంబంతో మాట్లాడి నన్ను వాళ్ల ఇంట్లో పెట్టుకునేలా ఏర్పాటు చేశాడు. వాళ్లు సంఘ కూటాలకు వెళ్లడానికి నాకు సహాయం చేస్తారు. ఇప్పటికీ వాళ్లు నన్ను సొంత కుటుంబ సభ్యునిలా చూసుకుంటున్నారు.

సంఘంలో వాళ్లు నాపై చూపించిన నిజమైన ప్రేమ గురించి నేను ఇంకా చాలా చెప్పవచ్చు. వీటన్నిటిని బట్టి నేను యెహోవాసాక్షిగా నిజ క్రైస్తవుల మధ్య ఉన్నానని పూర్తిగా నమ్ముతున్నాను.—యోహాను 13:34, 35.

నేనెలా ప్రయోజనం పొందానంటే ... :

నేను ఎందుకూ పనికిరానని నాకు భవిష్యత్తే లేదని ఇప్పుడు అనిపించడం లేదు. నా జీవితంలో చేయాల్సినది ఎంతో ఉంది. కళ్లు లేవని ఆలోచిస్తూ ఉండే బదులు నేను ఒక పయినీరుగా b వేరేవాళ్లకు బైబిల్లో ఉన్న సత్యాలు నేర్పించడం గురించే ఆలోచిస్తాను. సంఘ పెద్దగా సేవ చేస్తూ దగ్గర్లో ఉన్న సంఘాల్లో బైబిలు ప్రసంగాలు ఇచ్చే గొప్ప అవకాశం నాకు ఉంది. వేలమంది హాజరయ్యే పెద్ద సమావేశాల్లో కూడా బైబిలు ప్రసంగాలు ఇచ్చే గొప్ప అవకాశం కూడా దొరికింది.

నా బ్రెయిలీ బైబిల్‌తో ప్రసంగం ఇస్తున్నాను

2010⁠లో ఎల్‌ సాల్వడోర్‌లో జరిగిన పరిచర్య శిక్షణా పాఠశాలకు (ఇప్పుడు రాజ్య ప్రచారకుల పాఠశాల) హాజరయ్యాను. సంఘంలో నాకున్న బాధ్యతల్ని ఇంకా బాగా చేయడానికి ఈ పాఠశాల నాకు సహాయం చేసింది. అక్కడ పొందిన శిక్షణ వల్ల యెహోవా నన్ను విలువైనవాడిగా చూస్తున్నాడని, నన్ను ప్రేమిస్తున్నాడని గట్టి నమ్మకం కలిగింది. ఆయన ఎవరినైనా తన పనికి ఉపయోగించుకోగలడు.

“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము,” అని యేసు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:35) ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానని నిజంగా చెప్పగలను. అంతకుముందు అసాధ్యం అనుకున్నాను కానీ ఇప్పుడు నేను వేరేవాళ్లకు సహాయం చేయగలను అనుకుంటున్నాను. ▪ (w15-E 10/01)

a దేవుడు బాధలను ఎందుకు ఉండనిస్తున్నాడనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 11వ అధ్యాయం చూడండి.

b పయినీరు అంటే ప్రతీ నెల బైబిలు విద్యా పని కోసం ఎక్కువ సమయాన్ని ఉపయోగించే యెహోవాసాక్షి.